హైదరాబాద్, ఆగస్ట్ 26 (విధాత) :
Telangana Conferred IAS | తెలంగాణలో కన్ఫర్డ్ ఐఏఎస్ పోస్టులకు సంబంధించిన ఫైలు ను కేంద్ర ప్రభుత్వానికి పంపించారని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీనియార్టీ ప్రకారం సివిల్ సర్వీసు అధికారుల పేర్లతో జాబితా రూపొందించిన తరువాత న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీసు కు ఈ నెల 20వ తేదీన తెలంగాణ సాధారణ పరిపాలన అధికారులు సీల్డ్ కవర్ లో అందచేశారంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెలాఖరు నాటికి కన్ఫర్డ్ ఐఏఎస్ ల జాబితా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నారు.
అయితే ఈ ఫైలు పై ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్లు, ప్రమోటీస్ (ప్రొ డీటీ లు) మధ్య వివాదం కారణంగా కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉంది. రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన నవీన్ మిట్టల్ జాబితాలో ఉన్న సభ్యుల మధ్య సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించారు. ఆయన స్థానంలో డీఎస్.లోకేశ్ కుమార్ కార్యదర్శి గా వచ్చారు. 61 మంది స్టేట్ సివిల్ సర్వీసు అధికారుల పేర్ల తో తయారు చేసిన జాబితాపై ప్రధాన కార్యదర్శి ఆమోదం తెలపడంతో ఆగస్టు 20వ తేదీన సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) అధికారులు న్యూఢిల్లీ వెళ్లారు. యూపీఎస్సీ కార్యాలయంలో జాబితాను అందచేసి వచ్చారు. మరో నలుగురు పేర్లతో కూడా జాబితాను సిద్ధం చేసి త్వరలో మళ్లీ ఢిల్లీకి పంపించనున్నారు. దీంతో మొత్తం 65 మంది అవుతారు. వీరిలో 21 మందికి ఐఏఎస్ పదోన్నతి (కన్ఫర్డ్) లభిస్తుంది. వీరిని ఎంపిక చేసే కమిటీలో డీఓపీటీ కార్యదర్శి, యూపీఎస్సీ ఛైర్మన్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.
తమకు ఇవ్వకుండా ప్రొబెషనరీ డిప్యూటీ తహశీల్దార్ నుంచి పదోన్నతి పై వచ్చిన వారితో జాబితా ఎలా సిద్ధం చేస్తారని ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్లు (2017) అభ్యంతరం తెలిపారు. హైకోర్టు లో కేసు వేస్తామని వారు చెప్పగా, అలా అయితే మీకు పదోన్నతులు రాకుండా చూస్తామని ప్రమోటీలు గట్టిగా బదులివ్వడంతో వెనక్కి తగ్గారు. ఐఏఎస్ లు గా పదోన్నతి పొందిన తరువాత ఎవరు కూడా రెండున్నర సంవత్సరాలకు మించి సర్వీసులో కొనసాగరని, మేము రిటైర్ అయిన తరువాత పోస్టులు మొత్తం మీకే చెందుతాయని వివరించారు.