Site icon vidhaatha

Drone Land Survey | నక్షా.. ఇక పక్కాగా!.. తుది దశకు పైలట్ గ్రామాల సర్వే

Drone Land Survey | తెలంగాణలో ఐదు గ్రామాల్లో భూ భారతి కింద తొలిసారి చేపట్టిన డ్రోన్ సర్వే పైలట్ ప్రాజెక్టు ముగింపు దశకు వస్తున్నది. ఈ సర్వే పనులను జూన్ 3వ తేదీన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ డిజిటల్ సర్వే పూర్తి కానున్నది. ఇది పూర్తయిన తరువాత కచ్చితత్వంతో వచ్చే ఫలితాన్ని పరిగణలోకి తీసుకుని ఆ డిజిటల్ సర్వేను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలనే నిర్ణయంతో రెవెన్యూ శాఖ ఉంది.

నాడు గొలుసులతో కొలతలు

నిజాం పాలనలో గొలుసుల ద్వారా భూములకు కొలతలు వేసి ప్రతి గ్రామానికి టీపన్ నక్షా తయారు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికీ రెవెన్యూ శాఖ మొదలు కోర్టుల వరకు అదే నక్షాను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. టీపన్ నక్షాలో సర్వే నంబర్ల వారీగా భూ విస్తీర్ణం, కాలి బాటలు, రోడ్లు, గ్రామకంఠం ఎంత మేర ఉందనే వివరాలు ఉంటాయి. కొన్ని దశాబ్దాలుగా వీటినే ఆధారం చేసుకుని భూముల కొలతలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. వీటిని తయారు చేసి దశాబ్దాలు దాటిపోతుండడంతో ఈ నక్షాలు ముట్టుకుంటే చాలు చెదిరిపోతున్నాయి. ముక్కలు ముక్కలు అవుతున్నాయి. వీటిని భద్రంగా కాపాడేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే డిజిటైజేషన్ చేయించారు. అయినప్పటికీ గ్రామాల్లో ఇప్పటికీ భూ హద్దులు, విస్తీర్ణంపై వివాదాలు కోకొల్లలుగా నడుస్తునే ఉన్నాయి. దీంతో భూ భారతి కింద భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ భూముల రీ సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నది. గ్రామాల్లో భూముల కొలతలు నిర్థారించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం సాలార్ నగర్ గ్రామం, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడు, జగిత్యాల జిల్లా బీర్పురు మండలం కొమన్ పల్లి, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు జీ, సంగారెడ్డి జిల్లా వటెపల్లి మండలం షాహెద్ నగర్ గ్రామాల్లో డ్రోన్ (మానవ రహిత వైమానిక వాహనం) సర్వే మొదలైంది. ఒక్కో గ్రామానికి ఒక్కో సర్వే ఏజెన్సీని ఎంపిక చేసి భూముల డిజిటల్ సర్వే బాధ్యతను అప్పగించారు. సంప్రదాయ సర్వేలో ఇద్దరు సర్వేయర్లు చేయాల్సిన పనిని డ్రోన్ కొన్ని గంటల్లోనే పూర్తి చేస్తుంది. అయితే ఇది ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ కచ్చితత్వం ఉండటం, సమయం ఆదా కావడం వంటి కారణాలతో ప్రభుత్వాలు దీనికే మొగ్గుచూపుతున్నాయి.

ఐదు గ్రామాలపై డ్రోన్‌ల చక్కర్లు

ఐదు పైలట్ గ్రామాల్లో విమానం ఆకారంలో ఉన్న డ్రోన్లు ఈ ఐదు గ్రామాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతున్నాయి. సాధారణ డ్రోన్లతో పోల్చితే ఈ విమానం డ్రోన్లలో భూముల కొలతల్లో కచ్చితత్వం ఉంటుందని సర్వే అధికారులు పేర్కొంటున్నారు. తొలుత గ్రామ హద్దులు నిర్ణయించి, సర్వే నెంబర్ల వారీగా భూముల విస్తీర్ణాన్ని కొలతలు వేస్తున్నారు. డ్రోన్ తో చేసిన సర్వేలో కచ్చితత్వం ఉందా లేదా అనేది నిర్ధారించుకునేందుకు డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) సర్వేను కూడా వినియోగిస్తున్నారు. రెండు రకాల సర్వేలో ఏమైనా వ్యత్యాసాలు లేదా ఏమైనా తేడాలు ఉన్నాయా? అనేది తేలిన తరువాతే వేర్వేరుగా మ్యాపులను సిద్ధం చేస్తారు. రెవెన్యూ శాఖ అధికారుల తాజా వివరాల ప్రకారం సాలార్ నగర్ లో మొత్తం 422 ఎకరాలు ఉండగా 337 ఎకరాల్లో సర్వే పూర్తయింది. ఇదే రకంగా ములుగుమాడు లో 845 ఎకరాలకు గాను 445 ఎకరాలు, కోమన్ పల్లిలో 626 ఎకరాలు ఉండగా 269 ఎకరాలు, నూగురు జి లో 502 ఎకరాలు ఉండగా 232 ఎకరాలు, షాహెద్ నగర్ గ్రామంలో 593 ఎకరాలు ఉండగా 308 ఎకరాల్లో డ్రోన్, డీజీపీఎస్ సర్వే పూర్తయింది. పహణీల్లో ఉన్న వివరాలను, సర్వేలో వచ్చిన వివరాలను సరిచూస్తారు. ఈ సర్వే రిపోర్టును జిల్లా కలెక్టర్ కు అందచేసి, రెవెన్యూ శాఖ పరిశీలనకు పంపించనున్నారు. గతంలో సర్వే చేయాలంటే హద్దులు చూడడం, గొలుసులు పట్టుకుని తిరగడం చేసేవారు. ఈ సమయంలో భూ యజమానులు గొడవలకు దిగిన సందర్భాలు అనేకం. ప్రైవేటుగా డిజిటల్ సర్వే అందుబాటులోకి వచ్చినప్పటికీ రైతులు గొలుసులతో చేసే సర్వే కు ఎక్కువగా మొగ్గుచూపుతుండడం కూడా కారణంగా చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి..

Nitin Gadkari | అసలు సినిమా ముందుంది.. గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
Pumped Storage Power Plant | రాష్ట్రంలో మరో వినూత్న పవర్ ప్లాంట్ నిర్మాణానికి సింగరేణి శ్రీకారం
Sapt Mrittika | స్త్రీలు ‘స‌ప్త మృత్తికా బొట్టు’ ధ‌రిస్తే.. ఆర్థిక స‌మస్య‌లు తొలగిపోతాయ‌ట‌..!
Telangana Jagruti political classes | కల్వకుంట్ల గురుకులం! ఇక్కడ అన్నీ నేర్పించబడును!

Exit mobile version