- ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయం
- పంచాయతీ ఎన్నికల హడావుడి
- అప్పుడే అభ్యర్ధుల ఎంపిక పై దృష్టి
- పావులు కదుపుతున్న ప్రధాన పక్షాలు
- ఎన్నికలకు మానసికంగా సంసిద్ధం
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ తేదీలు ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రమంతా దాదాపు నెల రోజుల పాటు సందడి నెలకొననున్నది. ముఖ్యంగా పల్లెలు రాజకీయంగా వేడెక్కనున్నాయి. ఇప్పటికే ఒకసారి ప్రకటించిన ఎన్నికలు అర్ధంతరంగా రద్దయిన విషయం తెలిసిందే. గత వారం రోజులుగా రాజకీయ నాయకుల ప్రకటనలు, వరుస పరిణామాల నేపథ్యంలో నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతోందనే ముందస్తు సమాచారం మేరకు గ్రామాల్లో రాజకీయ నాయకులు మానసికంగా ఎన్నికలకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మాత్రమే ఎన్నికల కమిషన్ సిద్ధమైనప్పటికీ అధికారిక కార్యక్రమాలు, రాజకీయ పార్టీల హడావుడి, నేతలంతా పట్నాల్లో మకాం వేసి ఉన్నందున, జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు పట్టణ ప్రాంతాలైనప్పటికీ అన్నింటికి కేంద్రంగా ఈ పట్టణ ప్రాంతాలే ఉన్నందున పరోక్షంగా అక్కడ కూడా రాజకీయ సందడి ప్రారంభం కానున్నది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ 31 జిల్లాలను మూడు దశలుగా విభజించినందున ప్రతీ దశ రాజకీయ వాతావరణం జిల్లా అంతటా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం కనబరుస్తోంది. ఎన్నికల తేదీలు ప్రకటించిన నవంబర్ 25 నుంచి ఎన్నికలు ముగిసే డిసెంబర్ 17 వరకు ఎక్కడ చూసినా ఎన్నికల అంశాలకే ప్రాధాన్యత చేకూరుతోంది. ఎన్నికలు ముగిసినప్పటికీ గెలుపోటములు, విజయోత్సవాలు, ప్రమాణస్వీకారాలు, బాధ్యతల స్వీకరణ, గెలిచిన వారి ఆనందం, ఓడిన వారి విచారంతో అటూ ఇటూ నెలంతా ఎన్నికల సందడికే ప్రాధాన్యత చేకూరనుంది.
గెలుపు గుర్రాల ఎంపిక పై శ్రద్ధ
తాజాగా వార్డులు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ కు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు కావడంతో అభ్యర్ధుల ఎంపిక దిశగా పార్టీ నాయకులు ముఖ్యంగా నియోజకవర్గ ఇంచార్జ్ లు, ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. గెలుపు గుర్రాల పై కేంద్రీకరిస్తున్నారు. ఆర్ధిక, సామాజిక అండ, పార్టీలో, కేడర్ లో పట్టుతో పాటు నియోజకవర్గ ఇంచార్జ్ లేదా ఎమ్మెల్యేలకు నమ్మిన బంటు అయితే పెద్దపీట వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అభ్యర్ధి లెక్కల్లో తారుమారైతే మరో వైపు జంప్ చేసేందుకు సైతం రంగం సిద్ధం చేసుకునేవారున్నారు. నిన్నటి వరకు సర్పంచ్ పదవి పై కన్నేసిన నాయకులు రిజర్వేషన్లు తమకు అనుకూలంగా రాకపోవడంతో కొందరు నిరాశకు లోనుకాగా, మరి కొందరికి కొత్తగా అవకాశం దక్కనుండడంలో ఆనందంలో ఉన్నారు.
నెల రోజులు పల్లెల్లో పండుగ
నియమాలు, నిబంధనలు,కోడ్ తదితర అనేక అంశాలు చెబుతున్నప్పటికీ దాదాపు నెలరోజుల పాటు పల్లెల్లో రాజకీయ పండుగ వచ్చినట్లే. పల్లె ఎన్నికలైనా పోటీ తీవ్రంగా ఉన్నందున ప్రతిష్టకు పోయి ఎంతకైనా సిద్ధమయ్యేవారు ఎక్కువ ఈ నేపథ్యంలో పోటీచేసేందుకు సిద్ధమవుతున్న వారు చేతి చమురు వదిలించుకోవడం ఖాయం. ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లు కూడా తమ పట్టు నిలుపుకునేందుకు వెనుకా, ముందు అన్ని రకాల అండగా నిలిచేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ రాష్ట్రస్థాయిలో తమ తమ సన్నాహాలు చేసుకుంటున్నాయి. కొన్ని పక్షాలు నియోజకవర్గ స్థాయి సమావేశాలు, ఉమ్మడి జిల్లా స్థాయి ముఖ్యుల సమావేశాలు నిర్వహించి ఎన్నికల గీతోపదేశం చేసేందుకు సైతం ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా తమదైన పద్ధతిలో పల్లెల పై పట్టు సాధించేందుకు సర్వసన్నద్ధమవుతుండగా, అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి, పార్లమెంటు ఎన్నికల్లో సున్నా చిక్కి, మొన్నటి మొన్న జూబ్లీ ఫలితం ఊరించి ఉసూరునిపించడంతో స్థానిక ఎన్నికల్లో విజయం సాధించి పోయిన పరువును నిలబెట్టుకోవాలని, కాంగ్రెస్ పై కసి తీర్చుకోవాలని పట్టుదలతో బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. అన్ని రకాల హంగులు, అండ ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం ఈ ఎన్నికలను వినియోగించుకుని రాష్ట్రవ్యాప్తంగా కాషాయ పాదులు వేస్తే వచ్చే ఎన్నికల నాటికైనా చిగురిస్తాయనే ఆశతో సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి..
APSPDCL | ఆర్టీఐ దరఖాస్తుపై విచిత్ర సమాధానం! ట్రాన్స్ ఫార్మర్ అంశం ప్రజాసంబంధం కాదట!
Civil Supplies Corporation | పౌర సరఫరాల్లో రిటైర్డ్ ఉద్యోగుల తిష్ఠ! ప్రతి నెలా రూ.40 లక్షల దుబారా!
TG Cabinet | జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు విలీనం..క్యాబినెట్ కీలక నిర్ణయాలు
Repo Rate | రెపోరేటు లోన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా?
