MPTC ZPTC Relevance | ఆరో వేలులాంటి ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ వ్య‌వ‌స్థ రాష్ట్రానికి అవ‌స‌ర‌మా?

వాళ్లకు అధికారాలు ఉండవు.. విధులు ఉండవు.. నిధుల సంగతి సరేసరి.. డబ్బు ఖర్చుపెట్టుకుని ఎన్నికల్లో గెలిచాక.. తెల్ల ఖద్దరు చొక్కాలు వేసుకుని.. ఊళ్లో తిరిగి.. ఆఫీసుకు వస్తే కూర్చోడానికి కుర్చీ కూడా ఉండదు! అసలు ఈ ఆరో వేలు లాంటి వ్యవస్థ తెలంగాణకు అవసరమా? రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు?

Telangana Panchayat Raj MPTC ZPTC relevance

విధాత, హైదరాబాద్ ప్రతినిధి: MPTC ZPTC Relevance | ప్ర‌స్తుతం తెలంగాణలో అమ‌లులో ఉన్న పంచాయ‌తీ రాజ్ వ్య‌వ‌స్థ‌కు కొత్త సంస్క‌ర‌ణ‌లు తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఎలాంటి అధికారాలు లేని, న‌యాపైస నిధులు ఖ‌ర్చు చేయ‌లేని మ‌ధ్యస్థ వ్య‌వ‌స్థ తెలంగాణ పంచాయ‌తీ రాజ్ వ్య‌వ‌స్థ‌కు అవ‌స‌ర‌మా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ప‌ద‌వుల పందేరం కోసం తీసుకు వ‌చ్చిన మ‌ధ్య‌స్థ వ్యవస్థ ప్ర‌భుత్వానికి భార‌మే కానీ ఎలాంటి ఉప‌యోగం లేద‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతున్న‌ది. పైగా వీళ్లు గ్రామ స‌ర్పంచ్‌ల‌తో విభేదించి ప‌నుల‌కు ఆట‌కం క‌లిగించే వారిలా త‌యారైన వ్య‌వ‌స్థ‌గా ఈ మ‌ధ్య‌స్థ వ్య వ‌స్థ గురించి మాట్లాడుతున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో మండ‌ల వ్యవ‌స్ధ వ‌చ్చిన త‌రువాత ఏర్ప‌డిన ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ వ్యవ‌స్థను ఎలాంటి ఉప‌యోగం లేని ఆరో వేలు లాంటిద‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఒక‌రు అభివ‌ర్ణించారు. ఈ వ్య‌వస్థ ప్ర‌భుత్వానికి భారమ‌ని చెపుతున్నారు.

iBomma Shutdown : మీ దేశంలో వెబ్‌సైట్‌ను మూసివేస్తున్నాం..ఐ బొమ్మ ప్రకటన

స్వాతంత్య్రం వ‌చ్చిన త‌రువాత దేశంలో పంచాయ‌తీ రాజ్ వ్య‌వ‌స్థ మొట్ట‌మొద‌టి సారిగా 1952లో వ‌చ్చింది. అప్ప‌టికి తెలంగాణ, మ‌రాఠ్వాడా, కొన్ని క‌న్న‌డ ప్రాంతాలు హైద‌రాబాద్ స్టేట్‌లో భాగంగా ఉండేవి. హైద‌రాబాద్ స్టేట్‌లో మొద‌టి సారి 1952లో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రిగాయి. గ్రామ ప‌రిపాల‌న ఆనాడు పురుడు పోసుకున్న‌ది. హైద‌రాబాద్ స్టేట్‌ను విభ‌జించి, మ‌ద్రాస్ రాష్ట్రం నుంచి విడువ‌డిన ఆంధ్ర ప్రాంతాన్ని, తెలంగాణ‌తో క‌లిపి 1956లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. 1959లో నాటి ఉమ్మ‌డి ఏపీ ప్ర‌భుత్వంలో గ్రామ పంచాయ‌తీ, పంచాయ‌తీ స‌మితి, జిల్లా ప‌రిష‌త్ అనే మూడు అంచెల వ్య‌వ‌స్థ ఉండేది. ఈ వ్య‌వ‌స్థ‌లో ప్ర‌జ‌లు నేరుగా స‌ర్పంచ్‌ను ఎన్నుకునేవారు. స‌ర్పంచ్‌లు, పంచాయ‌తీ స‌మితి స‌భ్యులు ప‌రోక్ష ప‌ద్ద‌తిలో స‌మితి అధ్య‌క్షుడిని ఎన్నుకునేవారు.

స‌మితి అధ్య‌క్షులు జిల్లా పరిష‌త్ అధ్య‌క్షుడిని ఎన్నుకునేవారు. స‌మితి అధ్య‌క్షుడు, జెడ్‌పీ చైర్మ‌న్ ఎన్నిక‌లో ఎంపీ, ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియోలుగా ఉండి ఓటు వేసే వారు. ఇలా ఎన్నికైన స‌ర్పంచ్‌కు, స‌మితి అధ్య‌క్షుడికి, జిల్లా పరిష‌త్ అధ్య‌క్షుడికి నిధులు, విధులు, అధికారాలు ఉండేవి. వాళ్లకు చ‌ట్టం ద్వారా సంక్ర‌మించిన నిధుల‌తో, త‌మ‌కున్న అధికారాల‌ను ఉప‌యోగించి గ్రామాభివృద్ధికి పాటు ప‌డేవారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీరామారావు ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత 1987లో అప్ప‌టి వ‌ర‌కు అమ‌లులో ఉన్న పంచాయ‌తీ రాజ్ వ్యవ‌స్థ‌ను ర‌ద్దు చేసి, దాని స్థానంలో కొత్త‌ మండ‌ల ప్ర‌జాప‌రిష‌త్‌ వ్య‌వ‌స్థ‌ను తీసుకు వ‌చ్చారు.

పత్తి రైతు పై ‘సుంకం’ ఎఫెక్టు

కొత్త‌గా వ‌చ్చిన మండ‌ల ప్ర‌జాప‌రిష‌త్ వ్య‌వ‌స్థ‌లో అదనంగా ఎంపీటీసీ, జెడ్‌పీటీసీలు వ‌చ్చి చేరారు. ఈ వ్య‌వ‌స్థ‌లో కొత్త‌గా వ‌చ్చి చేరిన ఎంపీటీసీ, జెడ్‌పీటీసీల‌కు ఎలాంటి నిధులు, విధులు, అధికారాలు ఇవ్వ‌లేదు. కానీ తెల్ల‌చొక్కాలు వేసుకొని మండ‌ల కేంద్రాల‌లో తిరిగే స‌రికొత్త నాయ‌కులు మాత్రం చాలా మంది వ‌చ్చారు. తాలూకాల‌ను ర‌ద్దు చేసి మండ‌లాలు తీసుకు రావడంతో ఒక్కో తాలూకా ప‌రిధిలో రెండు, మూడు మండ‌లాలు వ‌చ్చి చేరాయి. ఈ వ్య‌వ‌స్థ‌లో స‌ర్పంచ్‌ల‌ను, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీల‌ను ప్ర‌జ‌లు నేరుగా ఎన్నుకుంటారు. కానీ ఎంపీపీ, జెడ్‌పీ చైర్మ‌న్ల‌ను ప‌రోక్ష ప‌ద్ధతిలో ఎన్నుకుంటారు. మొద‌ట్లో ఎంపీపీలు, జెడ్‌పీ చైర్మ‌న్ల‌ను నేరుగా ఎన్నుకునే వారు కానీ, రాను రాను రాజ‌కీయ అవ‌స‌రాల కోసం ప‌రోక్ష ప‌ద్ధతిని తీసుకు వ‌చ్చారు. ఆ త‌రువాత ఎంపీపీ, జెడ్‌పీ చైర్మ‌న్ల ఎన్నిక‌కు ఏకంగా క్యాంపు రాజ‌కీయాలు న‌డిపే దుస్థితి ఏర్ప‌డింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు క్యాంపు రాజ‌కీయాల‌ప్పుడు మిన‌హా మ‌రో స‌మ‌యంలో ఎలాంటి అవ‌స‌రం లేని వాళ్ల‌లాగా ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఒక స‌మ‌యంలో ఎంపీటీసీలు, జెడ్‌పీటీసీలు త‌మ‌కు కూడా నిధులు కేటాయించాల‌ని ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారంటే వారి ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చున‌ని ఒక నాయ‌కుడ‌న్నారు. ఎలాంటి విధులు, నిధులు, అధికారాలు లేని జెడ్‌పీటీసీలు, ఎంపీటీసీలు అవ‌స‌ర‌మా? అన్న చ‌ర్చ గ్రామ స్థాయిలో జ‌రుగుతున్న‌ది. వీటి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కోసం చేసే ఖ‌ర్చు కూడా దండుగే అని ఒక మాజీ ఎంపీటీసీ అన్నారు. ఇవి కాకుండా గ్రామ పంచాయ‌తీల‌కు, ఎంపీపీల‌కు, జెడ్ పీ చైర్మ‌న్ల‌కు నేరుగా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే.. దండ‌గ‌మారి క్యాంపు రాజ‌కీయాల‌ను సమాధి చేయవచ్చునని రాజ‌కీయ విశ్లేష‌కులు చెపుతున్నారు. అలాగే విధులు, నిధులు, అధికారాలు ఉండి ప్ర‌జ‌ల‌కు ప‌ని చేయ‌డానికి వీల‌య్యే స‌ర్పంచ్‌లు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు ఉంటాని, మండ‌ల‌, జిల్లా ప్ర‌జాప‌రిష‌త్ మీటింగ్‌ల‌లో నేరుగా స‌ర్పంచ్‌లు పాల్గొని త‌మ గ్రామాల స‌మ‌స్య‌లపై చ‌ర్చించే అవ‌కాశం ఉంటుంద‌ని చెపుతున్నారు. ఈ దిశ‌గా ప్ర‌భుత్వాలు ప్ర‌య‌త్నాలు చేయాల‌ని కోరుతున్నారు.

GDP | జీడీపీ అంటే ఏంటి..? ఆర్ధిక వ్యవస్థకు ఎందుకు కీలకం..?

కార్య‌క‌ర్త‌ల‌కు ప‌ద‌వుల కోస‌మే.

కొండం అరుణ అశోక్ రెడ్డి

కార్యకర్తలకు పదవులకు కోసం తప్ప ఎంపీటీసీలు, జెడ్‌పీటీసీ ప‌ద‌వులు దేనికీ ప‌నికిరావు. పైస‌లు ఖ‌ర్చు పెట్టి గెలిచి చెప్పుకొని తిర‌గ‌డానికే ఈ ప‌ద‌వులు. వీళ్లు త‌మ ఖ‌ర్చుల కోసం స‌ర్పంచ్‌ల‌ను, మండ‌ల ప్ర‌జాప‌రిష‌త్ చైర్మ‌న్ల‌ను, జెడ్ పీ చైర్మ‌న్ల‌ను బెదిరించి బ‌త‌క‌డానికి మాత్రమే ప‌నికి వ‌స్తారు. చైర్మ‌న్లపై అవిశ్వాస తీర్మానాల‌ప్పుడు మాత్రం వారికి పోటీలో ఉన్న అభ్య‌ర్థుల నుంచి బెదిరించి నాలుగు రాళ్లు వెనుకేసుకోవ‌డానికే ప‌నికి వ‌స్తాయి. పంచాయ‌తీ రాజ్ వ్య‌వ‌స్థ‌లో స‌ర్పంచ్‌లు, మండ‌ల ప్ర‌జాప‌రిష‌త్ జిల్లా ప్ర‌జా ప‌రిష‌త్ చైర్మ‌న్‌లే కీల‌కం. మండ‌ల ప్ర‌జా ప‌రిష‌త్ స‌మావేశాలో స‌ర్పంచ్‌లు చ‌ర్చించి గ్రామాల‌కు నిధులు తీసుకువెళ్లే అవ‌కాశం ఉండాలి.. జిల్లా ప్ర‌జాప‌రిష‌త్ స‌మావేశాల‌లో మండ‌ల ప్ర‌జాప‌రిష‌త్ చైర్మ‌న్లు చ‌ర్చించి త‌మ మండ‌లాల‌కు కావాల్సిన నిధులు తీసుకువెళ్లే అవ‌కాశం ఉంటుంది. ఈ మేర‌కు గ్రామ పంచాయ‌తీల‌తో పాటు మండ‌ల ప్ర‌జా ప‌రిష‌త్ చైర్మ‌న్ల‌కు, జిల్లా ప్ర‌జా ప‌రిష‌త్ చైర్మ‌న్ల‌కు నేరుగా ఎన్నిక‌లు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే క్యాంపు రాజ‌కీయాల బెడ‌ద కూడా త‌ప్పుతుంది.

– కొండం అరుణ అశోక్ రెడ్డి, మాజీ స‌ర్పంచ్ కాచారం, యాద‌గిరిగుట్ట మండ‌లం
———————————

రాజ‌కీయ నిరుద్యోగుల‌ను సంతృప్తి ప‌ర‌చ‌డానికే..

బీరేడ్డి జార్జిరెడ్డి

పంచాయ‌తీ రాజ్ వ్య‌వ‌స్థ‌లో అస‌లే అవ‌స‌రం లేని వ్య‌వ‌స్థ ఏదైనా ఉందంటే అది ఎంపీటీసీ, జెడ్‌పీటీసీలే. ఈ ప‌ద‌వులు కేవ‌లం రాజ‌కీయ నిరుద్యోగుల‌ను సంతృప్తి ప‌ర‌చ‌డానికే త‌ప్ప‌దేనికి ప‌నికి రావు. ఈ ప‌ద‌వుల‌కు అధికారాలు లేవు, విధులు లేవు, నిధులు ఎక్క‌డి నుంచీ రావు. వీళ్లు ఆందోళ‌న‌లు చేస్తే గ‌త ప్ర‌భుత్వం కేంద్రం నుంచి గ్రామ పంచాయ‌తీల‌కు వ‌చ్చే నిధుల‌లో 5శాతం కేటాయించింది. దీంతో గ్రామాల‌లో కొత్త పంచాయ‌తీల‌కు ఆస్కారం ఏర్ప‌డింది. మండ‌ల ప్ర‌జా ప‌రిష‌త్ స‌మావేశాల‌లో చ‌ర్చ చేయ‌రు. కానీ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించే స‌ర్పంచ్‌ల‌ను మాత్రం ఎక్క‌డో వెన‌కాల కూర్చోబెడ‌తారు. కేవ‌లం ఎంపీపీ, జెడ్‌పీపీల‌పై అవిశ్వాస తీర్మానాలు పెట్టిన‌ప్ప‌డు మాత్రం క్యాంపు రాజ‌కీయాల‌లో డ‌బ్బులు గుంజ‌డానికి త‌ప్ప ఈ ప‌ద‌వులు దేనికీ ప‌నికి రావు. ఎంపీటీసీ, జెడ్ పీటీసీల వ్య‌వ‌స్థ‌ను తీసివేసి ఎంపీపీ, జెడ్‌పీపీల‌కు నేరుగా ఎన్నిక‌లు నిర్వ‌హించాలి. అప్ప‌డే గ్రామ పంచాయ‌తీల వ్య‌వ‌స్థ బాగుప‌డుతుంది.

– బీరేడ్డి జార్జిరెడ్డి, మాజీ స‌ర్పంచ్‌, మ‌రియాపురం, త‌రిగొప్పుల మండ‌ల స‌ర్పంచ్‌ల సంఘం అధ్య‌క్షుడు, జ‌న‌గామ జిల్లా
———————————
అవ‌స‌రం లేని ప‌ద‌వులు

మాలోతు శ్రీ‌నివాస్ నాయ‌క్‌

అవ‌స‌రం లేని ప‌ద‌వులు ఏమైనా ఉన్నాయంటే అవి ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ప‌ద‌వులే. స‌ర్పంచ్‌ల ద‌గ్గ‌ర వార్డు మెంబ‌ర్లు ఎలానో ఎంపీపీ, జెడ్‌పీ చైర్మ‌న్ల వ‌ద్ద ఎంపీటీసీ, జెడ్‌పీటీసీల ప‌రిస్థ‌తి అంతే. రాజ‌కీయంగా న‌ష్ట‌పోయా.. మండ‌లం మొత్తం తిరిగి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో గెలిస్తే కార్యాల‌యంలో క‌నీసం కూర్చోవ‌డానికి కుర్చీ కూడా ఉండ‌దు. అలాంటి ప‌ద‌వి ఇది. క‌నీస విధులు లేని ప‌ద‌వులు ఇవి. నేను ఐదేళ్లు జెడ్‌పీటీసీగా ఉండి అప్పుల పాలయ్యాను. మూడు ఎక‌రాల భూమి అమ్ముకున్నా. నాతోటి మిత్రులు వ్యాపారాలు, ఉద్యోగాలు చేసి ఆర్థికంగా బ‌ల‌ప‌డితే.. నేను వారికంటే 10 ఏళ్లు ఆర్థికంగా వెనుక‌కు పోయాను. అలాగ‌ని జెడ్‌పీటీసీగా ప్ర‌జ‌ల‌కు నేను చేసింది ఏమిట‌న్న‌ది క‌నిపించ‌డం లేదు. క‌నీసం విధులు కూడా లేని ప‌ద‌వులు ఇవి.
– మాలోతు శ్రీ‌నివాస్ నాయ‌క్‌, జెడ్‌పీటీసీ, న‌ర్మెట్ట మండ‌లం, జ‌న‌గామ జిల్లా

ఇవి కూడా చదవండి..

TATA Sierra 2025: SUV కార్ల ప్రియులకు టాటా బిగ్ సర్ప్రైజ్
Womens Rozgar Scheme Bihar | ప్రపంచ బ్యాంకు అప్పుతో బీహార్ మహిళలకు రూ.10 వేల కోట్ల హారతి!
India Draft Seeds Bill 2025 Analysis | ముసాయిదా విత్తన బిల్లు–2025లో ఏముంది? రైతులకు నష్టాలేంటి?