India Draft Seeds Bill 2025 Analysis | విత్తన రంగంలో సమూల మార్పులు తెచ్చేందుకంటూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదా విత్తన బిల్లు–2025పై రైతు సంఘాలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇది చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర నష్టం చేసేవిలా ఉన్నాయని చెబుతున్నాయి. కేవలం కార్పొరేట్ కంపెనీలకే ఇది మేలు చేస్తుందని ఆరోపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న విత్తనాల చట్టం–1966, విత్తన నియంత్రణ ఉత్తర్వు–1983ను పూర్తిస్థాయిలో రీప్లేస్ చేస్తూ కొత్త బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ బిల్లు నాణ్యమైన విత్తనాల సరఫరాను మెరుగుపరుస్తుందని, నకిలీ విత్తనాలకు చెక్ పెడుతుందని అధికారులు చెబుతున్నారు. రైతులకు మునుపటికంటే మరింత పకడ్బందీ రక్షణ ఏర్పడుతందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇదే బిల్లును తీసుకొచ్చేందుకు 2004లో, తదుపరి 2019లో ప్రయత్నించింది. ఆ సమయంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ కొత్త బిల్లు సీడ్ కంపెనీలకు, వ్యవసాయ వ్యాపారవేత్తలకు తగినట్టుగా ఉంది కానీ.. సాధారణ రైతులకు, ప్రత్యేకించి సంప్రదాయ, రసాయనరహిత వ్యవసాయం చేసేవారికి అనుగుణంగా లేదని రైతు సంఘాల నాయకులు, విత్తన నిపుణులు, పౌర సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. సాధారణ రైతులు, ప్రత్యేకించి రసాయన ఎరువులు లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేసేవారికి ఈ బిల్లు నష్టంచేసేదిగా ఉందని, పైగా.. సీడ్ కంపెనీలు, వ్యవసాయ వ్యాపారాలకు లాభం చేసేదిలా ఉందని భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సభ్యుడు, విత్తన నిపుణుడు భరత్ మాన్సత హెచ్చరించారని డౌన్ టు ఎర్త్ పేర్కొన్నది.
బిల్లులో ఏముంది?
అన్ని రకాల విత్తన వెరైటీలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రైతుల సంప్రదాయ వెరైటీలు, ఎగుమతి కోసమే ఉద్దేశించిన విత్తనాలకు మినహాయింపు ఉంది. అనుమతి పొందటానికి ముందు విత్తన వెరైటీలు తప్పనిసరిగా వాల్యూ ఫర్ కల్టివేషన్ అండ్ యూజ్ (వీసీయూ–సాగు, ఉపయోగం విలువ) పరీక్షలను దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తారు. కనీస అంకురోత్పత్తి (జెర్మినేషన్), స్వచ్ఛమైన ప్రమాణాలు కలిగినవాటిని మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. విత్తనాలను అమ్మేందుకు లేదా దిగుమతి చేసుకునేందుకు లేదా ఎగుమతి చేసేందుకు సంబంధిత విత్తన డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి. విత్తనాల జాడను ట్రేస్ చేసేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వం సీడ్ ట్రేసబిలిటీ పోర్టల్ ద్వారా జనరేట్ చేసిన క్యూఆర్ కోడ్‌ను ప్రతి విత్తన కంటెయినర్ మీద ముద్రించాలి. ప్రతిపాదిత కేంద్ర అక్రెడిటేషన్ వ్యవస్థ ద్వారా ఒకసారి జాతీయ స్థాయిలో అక్రెడిటేషన్ పొందిన కంపెనీలు.. రాష్ట్రాలలో ఆటోమెటిక్‌గా గుర్తింపు పొందుతాయి. అయితే.. ఈ అంశం బడా కార్పొరేషన్లకు గణనీయమైన లబ్ధిని చేకూర్చుతుందనే విమర్శలు ఉన్నాయి.
జరిమానాలు
నాణ్యతలేని విత్తనాలను అమ్మడం లేదా సాథి పోర్టల్‌లో సమాచారాన్ని అప్‌లోడ్ చేయకపోవడం వంటి సాధారణ ఉల్లంఘనలకు లక్ష రూపాయల వరకూ జరిమానా విధిస్తారు. ఇక నకిలీ లేదా రిజిస్టర్ కాని విత్తనాలను అమ్మేవారికి 30 లక్షల రూపాయల వరకూ జరిమానా, మూడేళ్ల వరకూ కారాగారం విధిస్తారు.
రైతుల హక్కులు
విత్తనాలను కొంత మంది రైతులు తరతరాలుగా భద్రపర్చుకుంటూ ఉంటారు. వాటిని నాటుకుని, పెంచుకుని, మళ్లీ పంటకు వాడుతూ ఉంటారు. ఇతరులతో వాటిని మార్పిడి చేసుకుంటారు. ఇష్టం ఉంటే పంచుకుంటారు.. లేదంటూ అమ్ముకుంటారు. రైతులకు ఉన్న ఈ వ్యక్తిగత హక్కును బిల్లు సమర్థిస్తున్నది. అయితే.. వాటిని ఒక కంపెనీ బ్రాండ్ పేరుతో అమ్మకూడదనే నిబంధన విధించింది. దీని అమలును కొత్తగా ఏర్పడే కేంద్ర, రాష్ట్ర సీడ్స్ కమిటీలు పర్యవేక్షిస్తాయి.
రైతు సంఘాల అభ్యంతరాలేంటి?
తప్పుడు విత్తనాల కారణంగా పంట నష్టం సంభవిస్తే రైతులు నష్టపరిహారం పొందేందుకు కోర్టుల ద్వారానే పరిష్కరించుకోవాలి. ఈ ప్రక్రియ సాధారణ చిన్న రైతులకు తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది. రైతుల సాదక బాధకాలను తీర్చేందుకు బిల్లులు ఆచరణాత్మక లేదా ఆమోదయోగ్యమైన అంశాలు లేవని విత్తన రంగ నిపుణులు చెబుతున్నారు. కమ్యూనిటీ సీడ్ కీపర్స్‌కు నిబంధనల వర్తింపు: రైతులు వ్యక్తిగతంగా విత్తనాలను భద్రపర్చుకోవడం, పంచుకోవడాన్ని అనుమతించినా.. కమ్యూనిటీ గ్రూపులైన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు (ఎఫ్‌పీవో), మహిళల సమిష్టి విత్తన సేకరణలు, సంప్రదాయ విత్తన నిల్వ నెట్‌వర్క్‌లను వాణిజ్య సంస్థలుగా వర్గీకరిస్తారు. అవి పెద్ద కంపెనీలకు వర్తించే ప్రభుత్వ నిబంధనలు, డిజిటల్ ఆమోదాల పరిధిలోకి వస్తాయి. ఇది భారతదేశపు జన్యుపరమైన వారసత్వాన్ని దోపిడీ చేయడమేనని మాన్సత అన్నారు.
కార్పొరేట్ల పట్ల పక్షపాతం.. డిజిటల్ భారం :
సాధారణంగా పెద్ద కంపెనీలు ఉత్పత్తి చేసే ఏకరీతి హైబ్రిడ్ విత్తనాలను వీసీయూ పరీక్షలు ఎంపిక చేస్తాయని విమర్శకులు అంటున్నారు. ఈ సమయంలో దేశీయ, వైవిధ్య, వాతావరణ స్థిరత్వం కలిగిన రకాలు నిర్దేశిత ప్రమాణాలను చేరుకోవడంలో ఇబ్బంది పడతాయని, తద్వారా క్రమక్రమంగా అవి మార్కెట్ల నుంచి అదృశ్యమవుతాయని చెబుతున్నారు. విస్తృత స్థాయిలో డిజిటల్ రిపోర్టింగ్‌ను ఈ బిల్లు ప్రతిపాదిస్తున్నది. గ్రామీణ చిన్న స్థాయి సీడ్ కీపర్లకు ఇంటర్నెట్ సౌలభ్యం లేదా డిజిటల్ అక్షరాస్యత చాలా తక్కువగా ఉంటుందని, వారికి క్యూఆర్ కోడ్స్, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, వాటిని ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయడం కష్టంగా మారుతుందని రైతు సంఘాల నాయకులు అంటున్నారు.
విదేశీ విత్తనాలకు తలుపులు బార్లా
వీసీయూ పరీక్షలకు విదేశీ విత్తన సంస్థలను కూడా బిల్లు అనుమతిస్తున్నది. దీని వల్ల విదేశీ అంచనాలపై ఆధారపడి జన్యుపరంగా మార్పు చేసిన లేదా పేటెంట్ పొందిన విత్తనాలు భారతదేశంలోకి వెల్లువెత్తుతాయన్న ఆందోళనలను రైతు సంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. జన్యుపరంగా మార్పు చేసిన లేదా జన్యువును సవరించిన విత్తనాలను కఠిన పరీక్షలు లేకుండా అనుమతించినట్టయితే మనుషుల ఆరోగ్యానికే కాకుండా.. వాతావరణ పరిస్థితులు కూడా ప్రమాదమని, రైతుల పరిస్థితి మరింత దుర్లభంగా మారిపోతుందని మన్సత ఆందోళన వ్యక్తం చేశారు. అవి సామాజిక దుష్పరిణామాలకు దారి తీస్తాయని చెప్పారు. అటువంటి పరిస్థితిలో కొవిడ్ మరణాలకు మించిన స్థాయిలో రైతుల ఆత్మహత్య చోటు చేసుకుంటాయని ఆయన హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
TATA Sierra 2025: SUV కార్ల ప్రియులకు టాటా బిగ్ సర్ప్రైజ్
IRCTC Best Package: రూ. 11,170కే అరుణాచలం, పుదుచ్చేరి, కాంచీపురం
Demonetisation | పెద్ద నోట్ల రద్దుకు తొమ్మిదేళ్లు పూర్తి.. అనుకున్న లక్ష్యాల్లో సాధించిందెంత?
Asian Water Snake | అసోం ‘జూ’లో అరుదైన పాము దర్శనం
