- కేసులో అనేక చిక్కుముడులు
- గత ఏడాది మార్చిలో విచారణ మొదలు
- కీలక నిందితులను విచారించిన సిట్
- వెలుగు చూసిన నివ్వెరపోయే అంశాలు
- జడ్జీలు, కేంద్రమంత్రుల ఫోన్లు కూడా..
- రివ్యూ కమిటీకి నాటి సీఎస్ సారథ్యం
- వారి విచారణకు సిట్‌కు అర్హత ఉందా?
- ప్రత్యామ్నాయం కేంద్ర దర్యాప్తు సంస్థే
- బీజేపీ కోర్టులోకి బంతిని నెట్టే అవకాశం!
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విధాత): రాష్ట్రంలోనే కాదు.. యావత్ దేశంలో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ అంశం సంచలనం రేపింది. ప్రత్యర్థి పార్టీల కీలక నేతలతోపాటు.. సొంత పార్టీలో అనుమానం ఉన్న నాయకులపైనా నిఘా పెట్టి ఉంచారన్న సంగతి బయటపడింది. అంతేకాదు.. సినీ ప్రముఖుల ఫోన్లను సైతం ట్యాప్ చేశారనీ తేలింది. రాజకీయ ప్రత్యర్థులను చావుదెబ్బ కొట్టేందుకు మావోయిస్టుల పేరుతో కేంద్రం నుంచి ఇబ్బడిముబ్బడిగా అనుమతులు పొంది.. బీఆరెస్ ప్రభుత్వం హయాంలో భారీగా ఫోన్‌లు ట్యాప్ అయ్యాయి. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో.. లోగుట్టు బయటకు వచ్చింది. కేంద్ర హోం శాఖను తప్పుదోవ పట్టించి కేంద్ర మంత్రులు, హైకోర్టు జడ్జీలు, గవర్నర్లతో పాటు ప్రముఖ జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేశారని తేలింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 2024 మార్చి నెలలో ట్యాపింగ్ నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)ను ఏర్పాటు చేసింది. ఏడాది దాటినా ఇంకా కేసు కొలిక్కి రాలేదు.
దీనికి చట్టపరంగా అనేక సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం, వాటి చట్టాలు, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ – 1885 పరిధి వంటి చిక్కుముడులు ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి. ఎందుకంటే ఇందులో కేంద్ర ప్రభుత్వంలోని హోం శాఖ, న్యాయశాఖ, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖలతో పాటు మొబైల్ కంపెనీలు కూడా ఉన్నాయి. హైకోర్టు జడ్జీలు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు కూడా బాధితులుగా ఉండడంతో సిట్ విచారణార్హత సరిపోదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విచారణ నచ్చనివారు సవాల్ చేసే ప్రమాదముందని ప్రభుత్వ పెద్దలు అంచనాకు వచ్చారని విశ్వసనీయంగా తెలిసింది. మున్ముందు న్యాయస్థానాల్లో సిట్ విచారణను సవాల్ చేస్తే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని గ్రహించిన ప్రభుత్వ పెద్దలు, సమగ్ర దర్యాప్తునకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు అప్పగించే యోచనకు వచ్చినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగించిన ప్రభుత్వం.. ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి అప్పగించి.. బీజేపీ కోర్టులోకి మరో బంతిని నెట్టాలని చూస్తున్నదని ఆ వర్గాల కథనం. దీనిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని త్వరలోనే ఒక నిర్ణయానికి రావచ్చని అధికార వర్గాల ద్వారా తెలిసింది.
కేటీఆర్, సిబ్బంది ఫోన్లు కూడా ట్యాపింగ్
బీఆర్ఎస్ పార్టీకీ, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సందర్భంగా బుధవారం కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ట్యాపింగ్ అంశం ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌దని, వారికి కావాల్సిన సమాచారాన్ని వాళ్లు ఏదైనా రూపంలో పొందుతారని కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కానీ.. ఫోన్ ట్యాపింగ్ వెనకాల మాజీ మంత్రి టీ హరీశ్ రావు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, టీవీ చానల్ అధినేత శ్రవణ్ రావు ఉన్నట్లు కవిత ఆరోపించడం మరో కలకలం రేపింది. వీరి కారణంగానే తమ కుటుంబంలో నలుగురికి సిట్ నోటీసులు వచ్చాయనీ చెప్పారు. తన అన్న కేటీఆర్, కుటుంబ సభ్యులు, సిబ్బంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆమె చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది.
జడ్జీలు, గవర్నర్లు, కేంద్రమంత్రులు, ప్రత్యర్థుల ఫోన్లు కూడా
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసు ఇంటెలిజెన్స్ విభాగం విచ్చలవిడిగా పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసింది. ఆ సమయంలో అధికారులు, రాజకీయ నాయకులు మొబైల్ ఫోన్లలో మాట్లాడాలంటే భయపడిపోయే పరిస్థితి తలెత్తింది. అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఆయన వ్యక్తిగత సిబ్బంది ఫోన్ల సంభాషణలు రికార్డు చేసేవారు. హైకోర్టు జడ్జీలు, గవర్నర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న వార్తలు వచ్చాయి. దీంతో చాలా మంది ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలంటే వాట్సప్ లేదా సిగ్నల్ యాప్‌లు ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా పొడిపొడిగా సంభాషించుకునేవారు. మాజీ ఐపీఎస్ అధికారి టీ ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ ఐజీగా వ్యవహరించడమే కాకుండా ఇందుకోసం ప్రత్యేకంగా ఒక టీమ్ పెట్టారు. అందులో తన కులానికి సంబంధించిన వారినే నియమించుకున్నారు. ఫోన్ లీగల్ ఇంటర్ సెప్షన్ విభాగానికి డిజిగ్నేటెడ్ అథారిటీగా వ్యవహరించారు. ఈ హోదాలో ఆయన అనుమతి తీసుకున్న తరువాత వారం రోజుల వరకే అనుమానితుల ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఉంటుంది. మళ్లీ చేయాలంటే కేంద్ర హోం శాఖ అనుమతులు తీసుకోవాలి. ఒకసారి ఇచ్చిన అనుమతిని అడ్డం పెట్టుకుని నెలల తరబడి ట్యాపింగ్ వ్యవహారాలను కొనసాగించేవాడని సిట్ విచారణలో వెలుగు చూసింది.
సంజయ్, ఈటల, శాంతి కుమారి వాంగ్మూలం నమోదు
సిట్ విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ నోటీసులు ఇవ్వగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిట్ ముందు తన వ్యక్తిగత సిబ్బందితో హాజరయ్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో మాట్లాడిన సందర్భంలో తన ఫోన్ ట్యాప్ చేశారని విచారణ తరువాత మీడియాకు ఆయన తెలిపారు. కేసీఆర్ పాలనలో ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ పలుమార్లు ఆయన ఆరోపించారు. మల్కాజిగిరి నియోజకవర్గం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విచారణకు హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. ఈటల హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీకి దిగిన సమయంలో ఆయనతో పాటు వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు బీ.మహేష్ గౌడ్ కూడా సిట్ ముందు హాజరయ్యారు. ఈ కేసులో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘునందర్ రావులను కూడా విచారణకు హాజరై వాంగ్మలం ఇచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్ఐబీ చీఫ్ టీ ప్రభాకర్‌రావు బృందం ట్యాపింగ్ కోసం సుమారు వందలాది ఫోన్ నంబర్లను రివ్యూ కమిటీ ముందు పెట్టగా.. అప్పటి ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆ ఫోన్ నెంబర్ల లిస్ట్‌ను కేంద్ర టెలికం శాఖకి పంపించి అనుమతి పొందారు. రివ్యూ కమిటీ సభ్యులు, ఆనాటి హోంశాఖ కార్యదర్శి, ప్రస్తుత డీజీపీ జితేందర్, అప్పటి ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ అనిల్ కుమార్‌ల నుంచి కూడా వాంగ్మూలం తీసుకున్న విషయం తెలిసిందే.
వేల ఫోన్లు ట్యాపింగ్
తెలంగాణలో 2018 నుంచి ట్యాపింగ్ నడుస్తోందని, నాలుగేళ్లలో వేల సంఖ్యలో ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఇంటెలిజెన్స్ మాజీ డీఎస్సీ డీ ప్రణీత్ రావు వెల్లడించడంతో సిట్ అధికారులు కంగుతున్నట్లు తెలిసింది. ఇందులో కీలక అంశం.. మావోయిస్టుల పేరు అనుమతులు పొందిన నంబర్లన్నీ వివిధ రంగాల ప్రముఖులవే. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రాథమికంగా విచారణ జరిపి, నిర్థారించుకోకుండా గుడ్డిగా అనుమతులు ఇచ్చిందనేది స్పష్టమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి అధికారికంగా తీసుకున్న నంబర్లతోపాటు వాటికి మించిన సంఖ్యలో తప్పుడు మార్గంలో నంబర్లకు అనుమతి పొందారా? అనే సందేహాలూ ఉన్నాయి. వాటన్నింటినీ ట్యాప్ చేశారా అనేది విచారణలో వెల్లడి కావడం లేదని సిట్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై మొబైల్ కంపెనీలు, కేంద్ర హోం శాఖ, కమ్యూనికేషన్ల శాఖ నుంచి సమాచారం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఇది రాష్ట్ర స్థాయి విచారణ సంస్థలతో జరిగే పని కాదని, చట్టపరంగా అధికారాలు కూడా లేవని అంటున్నారు. ఒక వ్యక్తి లేదా సంస్థకు చెందిన ఫోన్ ట్యాప్ చేయాలనుకుంటే పోలీసులు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, 1885లోని సెక్షన్ 5(2) ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దీనికి తగిన కారణాలు, వారికి సంబంధించిన పేర్లు, చిరునామాలతో పాటు వివరాలు సమగ్రంగా అందచేయాలి. ఆ తరువాత రాష్ట్ర డీజీపీ లేదా హోం శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ నంబర్లను పరిశీలించిన తరువాత రివ్యూ కమిటీకి సిఫారసు చేస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ణయానికి వచ్చిన తరువాతే రివ్యూ కమిటీ కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం (డీఓటీ) కు నంబర్లను, వివరాలను పంపిస్తారు. డీఓటీ ఆమోదం తెలిపిన తరువాత సదరు నంబర్ల ట్యాపింగ్‌ను ఎస్ఐబీ అధికారులు మొదలు పెడతారు.
ట్యాపింగ్ తోనే ప్రత్యర్థులకు ముచ్చెమటలు
బీఆర్ఎస్ ప్రభుత్వంలో హుజూరాబాద్, మునుగోడు, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన ముఖ్యమైన నేతలందరి ఫోన్లన్నటినీ నిఘా నీడలో పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ డబ్బు తరలించే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్ రావు, టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు తెలిపేవాడు. ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన టీమ్ రంగంలోకి దింపి, డబ్బులు స్వాధీనం చేసుకుని ఆదాయపు పన్ను శాఖకు అప్పగించిన వార్తలు మనం చూశాం. శేరిలింగంపల్లి నుంచి పోటీ చేసిన భవ్య ఆనంద్ ప్రసాద్ కు సంబంధించిన డబ్బులు సికింద్రాబాద్ ప్యారడైజ్ సమీపంలో, దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రస్తుత ఎంపీ రఘునందన్ రావు బంధువు నుంచి రూ.1 కోటి తో స్వాధీనం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ పైనే భారం వేసి పని కానిచ్చేసిందంటున్నారు. పీసీసీ లీగల్ సెల్ కామారెడ్డి జిల్లా చైర్మన్ దేవరాజు గౌడ్ ఫోన్‌ను ట్యాపింగ్ చేశారు. దేవరాజు నివాసంలో ఉంటూ కామారెడ్డి అసెంబ్లీ నియోజకర్గ ఎన్నికలను సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి పర్యవేక్షించారు. వీరే కాకుండా బడా పారిశ్రామికవేత్తలు, సినిమా సెలెబ్రిటీల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది.