Dragon Fruit Farming | నా పేరు ప్రసాద్ బాలకృష్ణ రామ్చావరే( Prasad Balakrishna Ramchaware ). నేను 2017లో ముంబై( Mumbai ) వెళ్లినప్పుడు అక్కడ డ్రాగన్ ఫ్రూట్( Dragon Fruit ) ఎంతగానో ఆకర్షించింది. డ్రాగన్ ఫ్రూట్‌ను ఎప్పటికైనా పండించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అయితే బీ ఫార్మసీ చదువుతున్న సమయంలో కరోనా( Corona ) రావడంతో.. చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. మా నాన్న కూడా అదే సమయంలో రిటైర్డ్ అయ్యారు. దాంతో ఇద్దరం కలిసి డ్రాగన్ ఫ్రూట్ సాగు( Dragon Fruit Farming )పై దృష్టి సారించాం అని తెలిపాడు.
మాది మహారాష్ట్ర విదర్భ రీజియన్( Vidarbha Region )లోని అకోలా గ్రామం( Akola Village ). ఈ ప్రాంతమంతా కరువే. సాగునీటి లభ్యత లేదు. డ్రాగన్ ఫ్రూట్ సాగుకు నీటి అవసరం కూడా తక్కువే. ఇక ఈ సాగు ప్రారంభించే ముందు ఆన్‌లైన్ ద్వారా వియత్నాంలోని రైతులను సంప్రదించాను. వారి నుంచి ఎన్నో మెళకువలు నేర్చుకున్నాను అని బాలకృష్ణ తెలిపాడు.
2021 జూన్‌లో రెండు ఎకరాల పొలంలో 6200 మొక్కలు నాటాను. ఇందులో 4 వేల మొక్కలను షోలాపూర్ నుంచి, 2200 మొక్కలను గుజరాత్ నుంచి కొనుగోలు చేశాను. ఒక్కో మొక్క ఖరీదు రూ. 82. ఇక భూమిని సారవంతం చేసేందుకు ఆవు పేడను ఉపయోగించాను. ఆ తర్వాత ఎకరాకు 3100 మొక్కల చొప్పున ప్లాంటేషన్ చేశాను. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు ప్రారంభించాను అని ప్రసాద్ పేర్కొన్నాడు.
11 నెలల తర్వాత అంటే 2022లో తొలి పంట చేతికి వచ్చింది. 3 టన్నుల దిగుబడి రాగా, కేజీ డ్రాగన్ ఫ్రూట్స్‌ను రూ. 200కు విక్రయించాను. ఆ ఏడాది రూ. 6 లక్షల ఆదాయం సమకూరింది. ఇక 2023లో 14 టన్నుల దిగుబడి రాగా, కేజీ డ్రాగన్ ఫ్రూట్స్‌ను రూ. 125కు విక్రయించాను. ఈ సమయంలో రూ. 18 లక్షల ఆదాయం వచ్చింది. మొత్తానికి 2024 వరకు దిగుబడి పెరుగుతూనే ఉంది. ఇప్పుడు సరాసరి కేజీ పండ్లను రూ. 100కు విక్రయిస్తున్నాను. 2024లో రూ. 20 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఈ సీజన్‌లో అంటే 2025లో ఇప్పటికే 22 టన్నుల డ్రాగన్ ఫ్రూట్స్‌ను విక్రయించగా, రూ. 22 లక్షల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్స్ నర్సరీ కూడా ప్రారంభించాను. ఈ నర్సరీ ద్వారా అదనంగా మరో రూ. 3 లక్షల ఆదాయం వచ్చింది. మొత్తంగా ఏడాదికి రెండు ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగుతో పాటు మొక్కలను విక్రయించడం ద్వారా రూ. 25 లక్షలు సంపాదిస్తున్నట్లు ప్రసాద్ బాలకృష్ణ తెలిపాడు.
