Amaravati : అమరావతి రాజధానికి చట్టబద్దత

అమరావతికి చట్టబద్ధత ఇచ్చే ప్రక్రియ ప్రారంభం. పార్లమెంట్ సవరణతో అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించేందుకు కేంద్రం చర్యలు వేగవంతం. చంద్రబాబు ప్రభుత్వంపై రైతుల ఆశలు మళ్లీ పెరిగాయి.

Amaravati

న్యూఢిల్లీ : ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పన ప్రక్రియ ప్రారంభమైంది.
విభజన చట్టంలోని 5(2) సెక్షన్ సవరణకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇప్పటికే సవరణకు కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత సవరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ ఆమోదం అనంతరం అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయనుంది.

రాజధానిగా అమరావతి ఎంపిక…

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజధానిగా అమరావతిని టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల రైతులు ముందుకొచ్చి 34వేల ఎకరాలను ల్యాండ్ ఫూలింగ్ ప్రక్రియ ద్వారా అందించారు. సింగపూర్‌ ప్రభుత్వ సహకారంతో అమరావతి రాజధాని నిర్మాణం మాస్టర్‌ప్లాన్‌ రూపొందించారు. ల్యాండ్ పూలింగ్‌లో సేకరించిన భూముల్లో 2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన తర్వాత పనులు ఊపందుకున్నాయి. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అసెంబ్లీ, సచివాలయ భవనాలు నిర్మించి పాలన ప్రారంభించారు. పెద్దఎత్తున రహదారులు, భవనాల నిర్మాణం మొదలైంది. తొలుత తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ సిద్ధం చేశారు. 2017 నుంచే వాటిని వినియోగంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత తాత్కాలిక హైకోర్టు భవనం సిద్ధం చేశారు. 2019 నుంచి కార్యకలాపాలు మొదలయ్యాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కోసం నిర్మించిన నివాసాలు కూడా 90 శాతం పూర్తి చేశారు. గ్రూప్ 3, గ్రూప్ 4 క్యాడర్ ఉద్యోగుల వసతి నిర్మించిన క్వార్టర్స్ కూడా సగం వరకూ పూర్తయ్యాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. వాటితో పాటుగా సీడ్ యాక్సెస్ రోడ్డు కొంత పూర్తయ్యింది. కీలకమైన సెక్రటేరియేట్ టవర్స్ నిర్మాణ పనులు పునాది దశలో ఉన్నాయి. జడ్జీల క్వార్టర్స్ కూడా పనులు మొదలయ్యాయి.

వైసీపీ మూడు రాజధానులతో ఆగిన అమరావతి

అనంతరం 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. అమరావతి పనులు నిలిచిపోయాయి. గత సీఎం జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారు. చివరకు రాజధానిపై స్పష్టత లేకుండానే ఆయన అధికారం కొల్పోయారు.

కేంద్రం సహకారంతో జోరందుకున్న పనులు

తిరిగి 2024లో ఏపీలో టీడీపీ కూటమి మరోసారి అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణ పనులు మరోసారి ఊపందుకున్నాయి. మరోసారి ప్రధాని నరేంద్ర మోదీతోనే అమరావతి నిర్మాణ పనులను మే 2న ప్రారంభించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో నిర్మాణ పనుల్లో సీఎం చంద్రబాబు వేగం పెంచారు.అమరావతికి ఇప్పటి వరకు 50వేల ఎకరాల భూమిని సేకరించారు. తాజాగా మరో 20 వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. దీంతో సమీకరించిన భూమి 70,000 ఎకరాలకు పైగా ఉండనుంది. అయితే ఇందులో 30 శాతం పచ్చదనంతో పాటు నీటికి కేటాయించనున్నారు. తద్వారా అమరావతిని పచ్చదనంతో నింపేయనున్నారు. రూ.58వేల కోట్లతో చంద్రబాబు ప్రభుత్వం పనులు ప్రారంభించింది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా… ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించేలా నోటిఫై చేస్తూ పార్లమెంటు ద్వారా విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టంలో సవరణ చేస్తారు. పార్ట్‌ 2-5(2) సబ్‌సెక్షన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఏర్పాటవుతుంది అనేచోట.. అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌కి నూతన రాజధాని ఏర్పాటైందని పేర్కొంటారు.

ఇవి కూడా చదవండి :

Maoist Letter : హిడ్మాను పట్టుకునే మట్టుబెట్టారు: మావోయిస్టుల మరో లేఖ
Naga Chaitanya- Sobhita : నాగ చైతన్యతో పెళ్లికి ఏడాది..శోభిత స్పెషల్ వీడియో వైరల్

Latest News