Chandra Babu | శ్రీవారి భక్తులకు ఏపీ సీఎం శుభవార్త.. తిరుపతి వెంకన్న సాక్షిగా చంద్రబాబు ప్రకటన

Chandra Babu | ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రక్షాళన టీటీడీ నుంచే మొదలుపెడతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని, ఇక పరదాలు కట్టే కార్యక్రమాన్ని మానుకోవాలని హెచ్చరించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి తిరుమలలో కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

  • Publish Date - June 13, 2024 / 01:39 PM IST

Chandra Babu : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రక్షాళన టీటీడీ నుంచే మొదలుపెడతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని, ఇక పరదాలు కట్టే కార్యక్రమాన్ని మానుకోవాలని హెచ్చరించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి తిరుమలలో కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తమ కులదైవం వేంకటేశ్వరస్వామేనని, ఆయన దగ్గరే సంకల్పం చేసి కార్యక్రమం మొదలుపెడుతానని అన్నారు.

‘మా కులదైవం వేంకటేశ్వరుడు. ఆయన దగ్గరే సంకల్పం చేసి కార్యక్రమం మొదలెడుత. శ్రీవారి ఆశీస్సులతో అంచెలంచెలుగా ఎదిగాను. గతంలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చే సమయంలో బాంబు పేలుడు జరిగినా నా కులదైవమే నన్ను కాపాడాడు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది తిరుమలలో అన్నదానం చేయించడం అనవాయితీగా వస్తున్నది. తిరుమల పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ క్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తిరుమలలో ఉంటే వైకుంఠంలో ఉన్న భావన ఉంటుంది.’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

‘తిరుమలను ధనార్జన కేంద్రంగా మార్చారు. విపరీతమైన రేట్లు, బ్లాక్ మార్కెట్‌‍లో టికెట్ల విక్రయం ఉండకూడదు. మా ప్రభుత్వ హయాంలో గ్రీనరీ పెంచాం. గంజాయి, అన్యమత ప్రచారం, మద్యం, మాంసం అంటూ విచ్చలవిడిగా గత ప్రభుత్వం వ్యవహరించింది. ఇష్టానుసారం తమకు నచ్చిన వారికి పదవులు ఇచ్చారు. పెళ్లిళ్లు, పేరంటాలకు స్వామివారిని అమ్మే ప్రయత్నం చేశారు. ఎర్ర చందనం స్మగ్లర్లకు సీట్లు ఇచ్చారు. దృఢ సంకల్పంతో చెడును అణచి వేస్త.’ అని ఆయన చెప్పారు.

శ్రీవారి ఆశీస్సులు తీసుకొని పరిపాలన సాగించాడనికి వచ్చానని, శ్రీవారి సన్నిధిలో రాజకీయం మాట్లాడటం సబబుకాదని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం దొంగలే దొంగ దొంగ అని అరిచిన చందంగా వ్యవహరించిందని విమర్శించారు. నేరాలు చేసి తప్పించుకోవాలంటే వదిలిపెట్టమని, నేరం వేరేవాళ్లపై వేసే ప్లాన్ చేసిన నేరస్థుడికే శిక్ష వేస్తానని చెప్పారు. కేసులు పెట్టి భయపెట్టే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని, ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన సాగుతుందని అన్నారు. గత ఐదేళ్ల పాలన రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లిందని ఆరోపించారు.

ప్రజలు ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలని, పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉండాలని, ఆర్థిక అసమానతను అధిగమించాలని, ఇది ప్రభుత్వ విధానాలవల్ల మాత్రమే సాధ్యమవుతుందని చెప్పారు. సంపద సృష్టించి, అలా వచ్చిన సంపదను పేదవాడికి ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని, తమ ప్రభుత్వం అదేపని చేస్తుందని ఆయన తెలిపారు.

Latest News