అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు 10రోజుల పాటు నిర్వహించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 30వరకు సమావేశాలు నిర్వహించనుండగా..మధ్యలో, 20, 21, 28వ తేదీలను సెలవు దినాలుగా పరిగణించారు. సమావేశాలు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కొనసాగనున్నాయి. సభలో చర్చించేందుకు 18 అంశాలను ప్రతిపాదించారు. ఎజెండా మేరకు గురువారం ఏపీ అసెంబ్లీలో జీఎస్టీ పై చర్చ కొనసాగనుంది. శుక్రవారం జల వనరులపై చర్చ ఉంటుంది. 22న శాంతిభద్రతలు, 23న వైద్యం, ఆరోగ్యం, 24న పరిశ్రమలు, 25న సూపర్ సిక్స్, 26న క్వాంటం, 27న లాజిస్టిక్స్, 29న స్వర్ణాంధ్ర దిశగా ఏపీ, 30న కోస్తాంధ్ర, రాయలసీమ అభివృద్ధిపై చర్చించనున్నారు.
అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజర్ పై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. అవినీతి, అక్రమాలు బయటకు వస్తున్నందునే జగన్ అసెంబ్లీకి రావడం లేదని అన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని సొంత మీడియాతో మాట్లాడుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా కూడా జగన్ పనికిరారని ప్రజలు ఆయన్ను పక్కన పెట్టారన్నారు. అయితే శాసన మండలి సమావేశాలకు మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు హాజరవుతున్న క్రమంలో సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య పలు అంశాలపై వాడీవేడీ చర్చలు సాగుతున్నాయి. మండలి సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు తొలిసారిగా హాజరయ్యారు.