AP | ఏపీ ఎన్నికల పోలింగ్‌లో సరికొత్త రికార్డు.. 81.86శాతం పోలింగ్‌

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 81.86 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్ కుమార్‌ మీనా తెలిపారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు

  • Publish Date - May 15, 2024 / 05:30 PM IST

నాలుగు దశల ఎన్నికల్లో ఏపీనే టాప్‌
రీపోలింగ్‌కు ఎక్కడా ప్రతిపాదనలు రాలేదు
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా

విధాత: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 81.86 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్ కుమార్‌ మీనా తెలిపారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తుది పోలింగ్ శాతం వివరాలను ఆయన వెల్లడించారు. ఇప్పటిదాకా జరిగిన నాలుగు దశల లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలోనే అత్యధిక పోలింగ్ జరిగిందని తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల్లో 3కోట్ల 33లక్షల 4,560మంది ఓటు వేశారన్నారు. కొంతమంది అసెంబ్లీకి ఓటు వేసి పార్లమెంటుకు వేయలేదని తెలిపారు. గతంలో కంటే ఈ సారి పోలింగ్ శాతం పెరగిందని, గత ఎన్నికలతో పోలిస్తే 2.09 శాతం పోలింగ్ పెరిగిందని మీనా తెలిపారు. 2014లో 78.41 శాతం. 2019లో 79.77 శాతం నమోదైందని చెప్పారు. 3500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంటలు దాటాక కూడా పోలింగ్ కొనసాగిందని చెప్పారు. ఆఖరి పోలింగ్ కేంద్రంలో రాత్రి 2 గంటలకు ఓటింగ్ ముగిసిందని పేర్కోన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈవీఎంలన్నీ 350 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామన్నారు. కొన్నిచోట్ల వర్షం వల్ల పోలింగ్ ఆలస్యమైందని చెప్పారు. అబ్జర్వర్లంతా పరిశీలన చేశారని.. రీపోలింగ్ ఆవశ్యకతపై ఏమీ చెప్పలేదని సీఈవో వివరించారు. ఎవరి నుంచి కూడా అలాంటి ప్రతిపాదనలు తమకు అందలేదన్నారు. ఈ ఎన్నికల్లో అత్యదికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91 శాతం, అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం నమోదైనట్లు వివరించారు. లోక్‌సభ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం, అత్యల్పంగా విశాఖ లోక్ సభలో 71.11 శాతం పోలింగ్ నమోదైనట్లు సీఈవో చెప్పారు.

ఈ ఎన్నికల్లో నాలుగు చోట్ల తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి,నరసరావుపేటలలో హింసాత్మక ఘటనలు చాలా జరిగాయని తెలిపారు. ఆ నాలుగు ప్రాంతాల్లో 144 సెక్షన్ పెట్టాం.. అదనపు బలగాలు పంపించామన్నారు. అభ్యర్ధులదరినీ హౌస్ అరెస్టు చేయాలని అదేశాలిచ్చామని, ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని తెలిపారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలని ఆదేశాలిచ్చామని, ఘటనలు అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామన్నారు.

Latest News