వైసీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు నేను సిద్దం.. చర్చించడానికి వైసీపీ సిద్దమా..?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
సీఎంగా 30ఏళ్ల పదవి కాలంలో సంక్షేమం..అభివృద్ధి కోసం తపించాను
అమరావతి : ఎవరిది అభివృద్ధి..ఎవరిది విధ్వంసమో..సంక్షేమం ఎవరు అందించగలరో చర్చిద్దాం..అసెంబ్లీకి రావాలని వైసీపీకి ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. వైసీపీని సూటిగా అడుగుతున్నాను..వైసీపీ వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు నేను సిద్దం.. చర్చించడానికి అసెంబ్లీకి వచ్చేందుకు వైసీపీ సిద్దమా?..అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజంపేట నియోజకవర్గం, బోయనపల్లిలో ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. సిద్దం సిద్దం అని నినాదాలు చేసిన వారికి సవాల్ విసురుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. బాబాయ్ హత్యపై చర్చకు సిద్దం..పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలపై చర్చకు సిద్దం..దళిత డ్రైవరును డోర్ డెలివరీ చేసిన ఘటనపై చర్చకు సిద్దం..కోడికత్తి డ్రామా, గులక రాయి డ్రామాలపై సిద్దం అని చంద్రబాబు స్పష్టం చేశారు. క్లైమోర్ మైన్లతో పేల్చినా.. నేను చలించలేదు… నేను మీలా డ్రామాలు ఆడడం లేదన్నారు.
సీఎంగా 30ఏళ్ల పూర్తి చేసుకున్నా
సమైఖ్య రాష్ట్రంలో నేనే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నానని..సీఎంగా ఈ రోజుతో 30 ఏళ్ల కాలం పూర్తి చేసుకున్నానని..ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అయినా పేదల సంక్షేమం..అభ్యున్నతి కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటానని..ఈ 30 ఏళ్ల కాలంలో సంపద సృష్టించి.. సంక్షేమం చేయడమే నాకు కలిగిన తృప్తి అని..అప్పులు చేసి బాగుపడ్డ వారు లేరు. అప్పు చేసి పప్పు కూడు తింటే… చిప్పే మిగులుతుందన్నారు. ఆదాయాన్ని పెంచి…పేదలకు సంక్షేమం అందించాలి..అదే నేను చేస్తున్నానన్నారు. ఐటీ, హైటెక్ సిటీ అంటే ఎగతాళి చేశారని..కానీ చాలా కుటుంబాలను ఆర్థికంగా ఎదిగేలా చేసింది ఐటీనే అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్లు విస్తరించడానికి కారణం ఐటీనే అని..హైదరాబాద్ విశ్వనగరంగా మారింది.. బాగా అభివృద్ధి జరిగిందన్నారు. టీడీపీ పాలనలో డ్వాక్రా సంఘాలు ప్రారంభించాం.. మహిళలను అభివృద్ధి చేశామని గుర్తు చేశారు.
ప్రభుత్వాల మార్పుతో అభివృద్ధి వైకుంఠపాళి
టీడీపీ ప్రభుత్వం చేసిన మంచిని గుర్తు పెట్టుకోండని.అభివృద్ధి వైకుంఠపాళి కాకూడదని..తరచు ప్రభుత్వాలు మారితే అభివృద్ధి కుంటుపడుతుందని చంద్రబాబు హెచ్చరించారు. 2019లో ప్రభుత్వం మారిందని..రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కలిసి పోటీ చేశామని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో కూటమి గెలిచింది…ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది.. భయం లేకుండా మాట్లాడగలుగుతున్నారన్నారు. ఎమ్మెల్యేలు తప్పు చేస్తే నిలదీయగలుగుతున్నారు… ఇదీ మేం ఇచ్చిన స్వేచ్ఛ అని చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని..సీమను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. సీమకు నీళ్లిచ్చే దారి చూపిన నాయకుడు ఎన్టీఆర్ అని, రాయలసీమకు నీళ్లు తెస్తాం.. నిన్ననే కుప్పానికి నీళ్లు తీసుకెళ్లాను… భవిష్యత్తులో రాజంపేట, కోడూరుకు నీళ్లు తెస్తాం అని చంద్రబాబు ప్రకటించారు. రాయలసీమకు కరవు లేకుండా చేస్తామన్నారు. కరవు జిల్లా అనంతపురానికి కియా కంపనీ తెచ్చాం..ఇవాళ ఆ జిల్లా రూపు రేఖలు మారిపోయాయన్నారు. రాయలసీమకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తున్నాం అని తెలిపారు.
సూపర్ సిక్స్ సూపర్ హిట్
సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని..సంక్షేమానికి సాటి లేదు.. అభివృద్ధికి అడ్డు లేదు.. సుపరిపాలనకు పోటీ లేదని చంద్రబాబు అన్నారు. అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయని ప్రజలే చెబుతున్నారు. నా బలం.. బలగం ప్రజలు. స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి చూపుతాం…లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేస్తాం అని స్పష్టం చేశారు. కొన్ని కారణాల వల్ల రాజంపేటలో మాకు ఓట్లేయలేదని..మోసం చేసిన వారికి ఓట్లేశారు.. అయినా నేను అభివృద్ధి చేస్తానన్నారు. రాజకీయాలు వేరు.. అభివృద్ధి వేరు.. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేస్తానన్నారు. జిల్లా విభజన విషయంలో ఇబ్బందులు ఉన్నాయి… వాటిని సరి చేస్తాం అని హామీ ఇచ్చారు. ఒంటిమిట్ట శ్రీరాముల ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం అని తెలిపారు.
రైతులకు న్యాయం చేసింది.. చేసేది టీడీపీనే
మామిడి రైతుల విషయంలోనూ వైపీపీ పార్టీ నాయకులు డ్రామాలు ఆడారని..రైతులకు న్యాయం చేసింది.. చేసేది టీడీపీనే అని చంద్రబాబు స్పష్టం చేశారు. అవయవాలన్నీ సక్రమంగా ఉన్న వారికి గత ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ ఇచ్చిందని..ఇలాంటి వారికి పెన్షన్లు ఇవ్వాలా…? ప్రజలు ఆలోచించాలన్నారు. అనర్హులకు పెన్షన్ తీసేయండని చెప్పే ధైర్యం ప్రజలకు రావాలన్నారు. పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుపడతారు… పోలవరం, అమరావతిని ఆపేందుకు కుట్రలు చేస్తుంటారని.. రోడ్లకు గుంతలు పెట్టారని చంద్రబాబు విమర్శించారు. అన్నమయ్య డ్యాంను కూల్చారు… మేం ఆ డ్యాంను పునర్ నిర్మిస్తాం అన్నారు. వాళ్ల కారుతోనే సింగయ్యను తొక్కించి చంపేశారు.. తిరిగి మనపైనే నెపాన్ని నెడుతున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తున్నారు.
ఆడబిడ్డలను ఏడిపించిన వారిని చట్టం ముందు నిలబెడతా.. ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తానన్నారు. అంతకుముందు చంద్రబాబు రాజంపేట నియోజకవర్గం, బోయనపల్లిలో పేదల ఇళ్లకు వెళ్లి పింఛను అందించారు. యడవల్లి సుమిత్రమ్మ అనే మహిళకు పింఛను అందించారు. సుమిత్రమ్మ ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో దోభీ ఘాట్‌ను సీఎం సందర్శించారు. అక్కడ విధుల్లో ఉన్న రజకులతో కాసేపు ముచ్చటించారు. పనిలో కష్టాలు, సౌకర్యాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు.