Deputy CM Pawan Kalyan | వ్యవస్థను ఆటబొమ్మలుగా మార్చిన వైసీపీ పాలకులు: డిప్యూటీ సీఎం పవన్

గత ఐదేళ్ల కాలంలో వైసీపీ పాలకులు అధికార వ్యవస్థను ఆటబొమ్మలుగా మార్చారని, ఓ రాష్ట్రం పాలన ఎలా ఉండకూడదో చూపించారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు.

విధాత, హైదరాబాద్ : గత ఐదేళ్ల కాలంలో వైసీపీ పాలకులు అధికార వ్యవస్థను ఆటబొమ్మలుగా మార్చారని, ఓ రాష్ట్రం పాలన ఎలా ఉండకూడదో చూపించారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో పని చేయడానికి ఐఏఎస్‌లు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో ఏపీలో పని చేసేందుకు ఐఏఎస్‌లు పోటీ పడేవారని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్న ఆయన.. వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని బతికించాలనే ఉద్దేశంతోనే అన్నీ తట్టుకొని నిలబడ్డామన్నారు. . కానీ ప్రజలు మాకు అద్భుతమైన విజయం అందించారని, వారు మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలని కలెక్టర్లను కోరారు. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు.

గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నామని, ఒకేరోజు రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాది హామీ గ్రామసభలు నిర్వహిస్తున్నామని, పైలెట్ ప్రాజెక్టుగా మొదటగా పిఠాపురం నియోజకవర్గంలో చేపడతామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు. సీఎం చంద్రబాబు నుంచి పాలనానుభవం, పాలనా దక్షత నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, పాలనా వ్యవస్థను గత ప్రభుత్వం చిద్రం చేసిందని, అనుభవంతో పని చేసేందుకు చంద్రబాబు, నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నామన్నార. ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిరక్షించేందుకే మేం ఇక్కడ ఉన్నామని, మా వైపు నుంచి ఏమైనా తప్పులు ఉంటే మా దృష్టికి తీసుకురండని కోరారు. ప్రజలకు సేవ చేసే విషయంలో మా వల్ల మీరు ఓ అడుగు ముందుకు వేసేలా ఉంటుందే తప్ప.. అడుగులను ఆపే పరిస్థితి ఉండకూడదన్నారు. విభజన తర్వాత నుంచి చాలా కష్టాలు పడ్డామని, గత ఐదేళ్ల కాలంలో ఏపీ బోర్డర్ దాటి రావాలన్నా.. ఇబ్బందులు పడ్డామని, రాష్ట్రాభివృద్ధిలో స్కిల్ సెన్సస్ చాలా కీలకమైందని సూచించారు.