Site icon vidhaatha

TTD News | తిరుమల ఆలయంపై మళ్లీ విమానం చక్కర్లు !

TTD News | తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా మరోసారి విమానం వెళ్లడం కలకలం రేపింది. గురువారం ఉదయం శ్రీవారి ఆలయం మీదుగా విమానం చక్కర్లు కొట్టడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ ఉదంతంపై తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతాధికారులు ఆరా తీస్తున్నారు. ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో తిరుమలలో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఈ సమయంలో శ్రీవారి ఆలయం మీదుగా విమానం వెళ్లడంతో ఆ విమానం వివరాలపై ఎయిర్ పోర్టు అధికారుల ద్వారా టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. గత సంవత్సరం జూన్ 7వ తేదీన, అక్టోబర్ 21న, ఈ సంవత్సరం జనవరి 2, మార్చి 27 తేదీల్లోనూ తిరుమల ఆలయం మీదుగా విమానం వెళ్లింది. ఏప్రిల్ 15న ఆలయం మీదుగా డ్రోన్ చక్కర్లు కొట్టింది. ఇలా విమానాలు, హెలికాప్టర్లు వెళ్లిన ప్రతిసారి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కేంద్ర విమానయాన శాఖకు సమాచారం అందిస్తున్నారు. విమానాల, హెలికాప్టర్లు ఆలయం మీదుగా వెళ్లకుండా చూడాలని అభ్యర్థిస్తున్నారు.

ఆలయం పైనుంచి డ్రోన్లు, విమానాలు ఎరగకూడదన్న సంప్రదాయం ఉన్నప్పటికి తరుచు విమానాలు, హెలికాప్టర్లు శ్రీవారి ప్రధానాలయం మీదుగా ప్రయాణిస్తున్నాయి. తిరుమల వేంకటేశ్వరుడి గర్భాలయం ఆనంద నిలయంపై విమానాల ప్రయాణించడం ఆగమ శాస్త్రానికి విరుద్ధం. భక్తుల నమ్మకాలను, మనోభావాలను గమనించి తిరుమల ఆలయ పరిసరాలను నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించాలన్న డిమాండ్ కొన్నాళ్లుగా వినిపిస్తుంది. ఈ విషయంలో పలుమార్లు టీటీడీ అధికారులు కేంద్ర విమానయాన శాఖకు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. రేణిగుంట విమానాశ్రయంలో పెరిగిన ట్రాఫిక్ నేపథ్యంలో తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించేందుకు సాధ్యం కాదని.. అయితే ఆలయానికి సమీపంలో విమానాల రాకపోకలు సాగకుండా చూస్తామని కేంద్రం గతంలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ కేంద్ర విమానయాన సంస్థ నుంచి ఈ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

Exit mobile version