Site icon vidhaatha

సీఎం నివాస పరిధిలో కూల్చివేతలపై ఆగస్టు 6 వరకు హైకోర్టు స్టే

విధాత‌:గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం జగన్‌ నివాసానికి సమీపంలో కూల్చివేతలపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.నిర్వాసితులను ఆగస్టు 6 వరకు ఖాళీ చేయించొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇళ్ల కూల్చివేతలను నిలువరించాలని కోరుతూ వి. రాజ్యలక్ష్మీ, మరో నాలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తు రాత్రి సమయంలో తన ఇంటిని కూల్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.అక్కడ ఉన్న కుటుంబాలకు పరిహారం ఇచ్చామని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఉన్నఫలంగా ఇళ్లని కూల్చివేస్తే బాధితులు ఇబ్బంది పడుతారని, ప్రత్యామ్నాయం చూపాలని పిటిషనర్ న్యాయవాది వాదించారు.

పిటిషనర్లకు ప్రత్యామ్నాయం కల్పిస్తే.. అక్కడ నుంచి వెళ్లిన వారు ప్రత్యామ్నాయం కోసం మళ్లీ వస్తారని, అందరికి సదుపాయం కల్పించడం కష్టమని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వెళ్లిపోయేందుకు రెండునెలల సమయం కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం రెండు వారాలకు ఇళ్ల కూల్చివేతలు జరపవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 6కి వాయిదా వేసింది.తాడేపల్లిలో సీఎం జగన్‌ నివాసానికి సమీపంలో అమరారెడ్డినగర్‌ వాసులను ఖాళీ చేయిస్తున్నారు. సీఎం భద్రత కారణాలతో అమరారెడ్డి నగర్‌లోని కరకట్ట వద్ద 283 మందిని ఖాళీ చేయాలని గతంలో నోటీసులు ఇచ్చారు. వీరికి మంగళగిరి మండలం ఆత్మకూరు సమీపంలో స్థలాలు కేటాయించారు. అయితే.. ఇందులో కొందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. వారంతా ఇక్కడి నుంచి ఖాళీ చేసేందుకు నిరాకరిస్తున్నారు. వీరిని పోలీసులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. 200 మంది పోలీసులు, స్థానిక వాలంటీర్లు, అధికారులు దగ్గరుండి ఇళ్లు తొలగిస్తున్నారు. కొందరు మాత్రం తమకు న్యాయం జరిగేవరకు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లబోమని స్పష్టం చేస్తున్నారు.

Exit mobile version