రేపే ఏపీ జొన్నగిరి బంగారు గని శుద్ధి కేంద్రం ప్రారంభం

కర్నూలు జిల్లా జొన్నగిరి బంగారు గని శుద్ధి కేంద్రాన్ని సీఎం చంద్రబాబు బుధవారం ప్రారంభించనున్నారు. ఏపీ దేశానికి గోల్డ్ మైనింగ్ హబ్‌గా మారే దిశగా కీలక అడుగు పడనుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి బంగారం అందించే కీలక రాష్ట్రంగా మారబోతుంది. రాష్ట్రంలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలోని గనుల నుంచి బంగారం ఉత్పత్తికి సమయం ఆసన్నమైంది. జొన్నిగిరి బంగారం ఉత్పత్తి కేంద్రాన్ని బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. అనంతరం పూర్తిస్థాయి ఉత్పత్తికి శ్రీకారం చుడతారు. జొన్నగిరి పరిసర ప్రాంతాల్లోని మరో 1,200 ఎకరాల్లోనూ త్వరలో తవ్వకాలు జరపనున్నారు. దీంతోపాటు అదే ప్రాంతంలో బంగారం ఖనిజాన్ని శుద్ధి చేసే రెండో యూనిట్‌కు కూడా చంద్రబాబు భూమిపూజ చేస్తారు. మొదటి ఏడాది 600 కిలోలు, మరుసటి ఏడాది 1500 కిలోలు బంగారాన్ని ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో జొన్నగిరి స్వర్ణగిరిగా…రాయలసీమ మళ్లీ రతనాల సీమగా మారనుంది.

తొలి ప్రైవేట్ బంగారు గని

జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్-డెక్కన్ గోల్డ్ మైన్స్ నేతృత్వంలో స్వాతంత్ర్యం తర్వాత ప్రైవేట్ రంగంలో ప్రారంభమవుతున్న తొలి పెద్ద బంగారు గనిగా జొన్నగిరి ప్రాజెక్టు గుర్తింపు పొందింది. సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 13.1 టన్నుల బంగారు నిల్వలను గుర్తించారు. భవిష్యత్తులో ఈ నిల్వలు 50 టన్నులకు పైగా ఉండే అవకాశం ఉందని అన్వేషణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ప్రస్తుతానికి దాదాపు 13 వేల కిలోల బంగారు నిల్వలను ధృవీకరించారు. మొత్తం లీజు ప్రాంతంలో 50 వేల కిలోల వరకు బంగారం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాబోయే 15 సంవత్సరాల పాటు ఇక్కడ బంగారం ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.

వజ్రాల కోసం సర్వేలో చిక్కిన పసిడి జాడ

జొన్నగిరి ప్రాంతంలో వజ్రాలు తరచూ దొరకడంపై జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) నిపుణులు సర్వే చేపట్టగా భారీ ఎత్తున బంగారం ఖనిజం ఉందని తేలింది. అన్నిరకాల నిర్ధారణలు చేసుకుని, బంగారం వెలికితీసే ప్రక్రియ ప్రారంభం కావడానికి 30 ఏళ్లు పట్టింది. జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల్లో బంగారం గనులున్నాయని తేలడంతో ‘జియోమైసూర్‌ సర్వీసెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ 2006లో 1,477.24 ఎకరాల్లో తవ్వకాలకు అనుమతి పొందింది. ప్రయోగాత్మకంగా కొంత ప్రాంతాన్ని తవ్వి అక్కడున్న బంగారం ఖనిజం నాణ్యమైనదేనని నిర్ధారించుకుంది. తొలుత మినీ కర్మాగారాన్ని నిర్మించింది. తరువాత రూ.320 కోట్లు వెచ్చించి అత్యాధునిక కర్మాగారాన్ని నిర్మించింది. సుమారు 800 మంది ఉద్యోగులను కూడా నియమించుకుని బంగారం ఉత్పత్తికి సిద్ధం చేసుకుంది.

కోటి టన్నులకు పైగానే ఖనిజ నిల్వలు

జొన్నగిరి ప్రాంతం జియోమైసూర్‌ సంస్థ చేయించుకున్న సర్వేలో ఆ ప్రాంతంలో సుమారు కోటి టన్నుల వరకు బంగారం ఖనిజం ఉందని నిర్ధారణయింది. ఒక్క తూర్పు బ్లాక్‌లోనే సుమారు 68 లక్షల టన్నుల ఖనిజం ఉన్నట్లు తేలింది. భూమి లోపల 180 మీటర్ల లోతున ప్రారంభమై 2 కిలోమీటర్ల లోతు వరకు బంగారం ఖనిజం ఉన్నట్లు గుర్తించారు. జియోమైసూర్‌ సంస్థ ఏటా నాలుగు లక్షల టన్నుల బంగారం ఖనిజాన్ని వెలికితీయనుంది. తొలుత రోజుకు కిలో చొప్పున బంగారాన్ని ఉత్పత్తి చేసి తరువాత దశలో ఏటా 600, ఆపైన ఏటా 1,500 కిలోల బంగారం ఉత్పత్తి చేసేలా చర్యలు చేపడతారు. ఓపెన్‌కాస్ట్ మైనింగ్, క్రషింగ్, కార్బన్-ఇన్-లీచ్ వంటి ఆధునిక సాంకేతికతతో ఖనిజాన్ని శుద్ధి చేసి బంగారాన్ని వెలికితీయనున్నారు. టన్ను మట్టిని తవ్వి ప్రాసెస్ చేస్తే సగటున ఒక గ్రాము బంగారం లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

దేశానికి గోల్డ్ మైనింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌

జొన్నగిరితో పాటు అనంతపురం జిల్లా రామగిరిలో కూడా బంగారం నిల్వలున్న నేపథ్యంలో కొద్దినెలల్లో అక్కడ కూడా ఉత్పత్తి ప్రారంభించనున్నారు. చిత్తూరు జిల్లాలోనూ బంగారం ఖనిజ నిక్షేపాలున్న ప్రాంతాలను గుర్తించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయా గనులలో బంగారం ఉత్పత్తి ప్రారంభమైతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ దేశానికి గోల్డ్ మైనింగ్ హబ్‌గా మారనుంది.

తగ్గనున్న పసిడి దిగుమతుల భారం

ఏపీలో జొన్నిగిరిలో లభించిన 50 టన్నుల బంగారు నిల్వల విలువ సుమారు రూ. 7,500 కోట్ల నుండి రూ. 9,000 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. భారతదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో ప్రతి సంవత్సరం మనదేశంలో 800 టన్నులకు పైగా బంగారాన్ని వినియోగిస్తున్నారు. కానీ, దానికి తగ్గట్టుగా దేశీయంగా ఉత్పత్తి మాత్రం లేకపోవడంతో కేంద్రం విలువైన విదేశీ మారక నిల్వలు భారీగా వెచ్చించి పసిడి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దేశీయంగా 2000వ సంవత్సరంలో కర్ణాటకలోని ప్రసిద్ధ కోలార్ బంగారు గనులను మూసివేసినప్పటి నుండి దేశంలో స్వదేశీ పసిడి ఉత్పత్తి పడిపోయింది. ప్రస్తుతం కర్ణాటకలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘హుట్టి గోల్డ్ మైన్స్’ మాత్రమే దేశంలో చురుకుగా ఉన్న ఏకైక ప్రధాన ఉత్పత్తిదారుగా కొనసాగుతంది. అందులో కూడా ఏటా కేవలం 1.5 టన్నుల బంగారాన్ని మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ బంగారు గనులు దేశానికి మైనింగ్ రంగంలో, దేశాభివృద్ధిలో కీలకం కానున్నాయి.

Latest News