Pinnelli Rama Krishna | పోలీసుల అదుపులో ఎమ్మెల్యే పిన్నెల్లి?

ఈవీఎంను ధ్వంసం చేసి, ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాచర్ల వైసీపీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది

  • Publish Date - May 22, 2024 / 06:30 PM IST

ఈవీఎం ధ్వంసంపై ఈసీ సీరియస్‌
తక్షణమే అరెస్టుకు ఆదేశం

విధాత: ఈవీఎంను ధ్వంసం చేసి, ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాచర్ల వైసీపీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ముమ్మరంగా గాలించి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌ సమీపంలోని ఓ గెస్ట్‌హౌజ్‌లో పిన్నెల్లిని పట్టుకున్నట్టు సమాచారం.

పిన్నెల్లి పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను నేలకేసి కొట్టి ధ్వంసం చేసిన విషయం విదితమే. ఆ వీడియో బహిర్గతమైంది. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. ఆయనను తక్షణమే అరెస్ట్ చేయానలి ఈసీ ఆదేశించింది. ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పిన్నెల్లిని అరెస్టు చేయడానికి నిన్న ఏపీ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా కంది వద్ద ఆయన కారును స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారని పోలీసులు కేసు పెట్టారు. వెబ్‌ కెమెరాల్లో రికార్డయిన ఘటన బైటికి రావడంతో పోలీసులు ఎమ్మెల్యే పేరును నిందితుడుగా చేర్చారు.

మహిళపై దుర్భాషలాడిన పిన్నెల్లి

ఈవీఎం ధ్వంసంపై పోలింగ్‌ రోజు ఎమ్మెల్యే పిన్నెల్లిని ఓ మహిళ నిలదీసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే పోలింగ్‌ కేంద్రం వద్దే ఆమెపై దుర్భాషలాడారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Latest News