Bhanu Prakash Reddy : తిరుమల పరకామణి చోరీపై ఇవిగో సాక్ష్యాలు

తిరుమల పరకామణి చోరీపై భాను ప్రకాష్ రెడ్డి బయటపెట్టిన సాక్ష్యాలు సంచలనం.. రియల్ ఎస్టేట్‌లో కోట్ల రూపాయలు పెట్టుబడి ఆరోపణలు.

Bhanu Prakash Reddy

అమరావతి : తిరుమల పరకామణి సొమ్ము చోరీకి సంబంధించి గతంలో చేసిన ఆరోపణలను రుజువు చేసేలా టీటీడీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి పలు సాక్ష్యాలను బయటపెట్టారు. పరకామణి లెక్కింపులో రవికుమార్ అనే వ్యక్తి చేస్తున్న చోరీ వీడియోను ఆయన ప్రదర్శించారు. వైసీపీ హయాంలో పరకామణి దొంగతనాలు జరిగాయని..పరకామణిలో రవికుమార్‌ దోచుకుంటే వైసీపీ నేతలు, అధికారులు ఆ సొమ్మును పంచుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దోచుకున్న కోట్లాది రూపాయలను రియల్‌ ఎస్టేట్‌లో పెట్టారన్నారు. అప్పట్లో టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ఉన్నారని, చోరీ అంశంపై భూమన సమాధానం చెప్పాలని భానుప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. రూ.112 కోట్లు చోరీ జరిగితే కేవలం 9 నోట్లు మాత్రమే సీజ్ చేసినట్లు చూపించి కేసును క్లోజ్ చేశారని భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకునే కేసు కాకపోయినా రాజీ చేసుకున్నారని, ఈ కేసు పునఃవిచారణ చేయాలని డీజీపీకి మెమొరాండం ఇచ్చాం అని భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు.

ఈ కేసులో కీలకంగా ఉన్న ఓ అధికారి అప్రూవర్‌గా మారనున్నారని, త్వరలోనే అసలైన దోషుల పేర్లు బయటకు వస్తాయని భానుప్రకాష్ తెలిపారు. టీటీడీ వ్యవహారాల్లోని అవినీతిపై మరింత దర్యాప్తు జరగవలసిన అవసరం ఉందని భావిస్తున్నారు. పరకామణిలో దొంగతనంపై హైకోర్టు సీరియస్‌ అయ్యిందని, దొంగతనం కేసును హైకోర్టు సీఐడీకి అప్పగించిందని తెలిపారు. రవికుమార్‌కు ప్రాణహాని ఉందని వ్యాఖ్యానించారు. సీఐడీ విచారణ జరిగితే సంచలన విషయాలు బయటికొస్తాయన్నారు.

త్వరలో దొంగలు బయటపడతారు : మంత్రి నారా లోకేష్

పరకామణి సొమ్ము చోరీ ఘటనపై టీటీడీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి వెల్లడించిన సాక్ష్యాల నేపథ్యంలో ఈ విషయమై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. గత ఐదేళ్లలో భూములు, గనులు, మట్టి, ప్రజలను దోచుకున్న ఘనులు చివరకు దేవుడిని సైతం వదలలేదు అని లోకేష్ తన ట్విట్ లో విమర్శించారు. నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతో పరకామణిలో దొంగలు పడ్డారని..కొల్లగొట్టిన కోట్లాది రూపాయలు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారన్నారు. భూమన నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకూ ఈ వాటాలు అందినట్లు నిందితులే చెబుతున్నారన్నారు. రేపు నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారని తెలిపారు. దేవుడి సొమ్ము తిన్న వారు శిక్షింపబడతారు అని వ్యాఖ్యానించారు.

అధికారంఅండతో జగన్ గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదని, భక్తులు మహా ప్రసాదంగా భావించే లడ్డూను కల్తీ చేశారు. అన్న ప్రసాదాన్ని భ్రష్టు పట్టించారు. తిరుమల దర్శనాలను అమ్మేసి సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం దుర్లభం చేశారు. ఏడుకొండల జోలికి వెళ్లొద్దు, శ్రీవారికి అపచారం తలపెట్టవద్దని.. నాడు చంద్రబాబు బతిమాలి చెప్పినా జగన్‌ వినలేదు. ఏడుకొండలవాడు చాలా పవర్ ఫుల్ సామీ. ఆయనకు అపచారం తలపెట్టినా, ఆయన సన్నిధిలో అవినీతికి పాల్పడినా.. ఏం జరుగుతుందో తెలిసికూడా జగన్, భూమన ఏకంగా పరకామణినే దోచేశారు. గుడిలో హుండీని దోచేసిన పాపాలతో జగన్ గ్యాంగ్ పాపం పండింది. పరకామణి వీడియోలు ఈరోజు బయటపడ్డాయన్నారు. భక్తులు కట్టిన ముడుపులు, హుండీలో వేసిన కానుకలు రూ.వందల కోట్లు రవికుమార్ దోచుకుని వెళ్లినప్పుడు అప్పటి చైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి.. అతడి మనుషులు ఏకంగా ఈ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేయడానికి యత్నించారని విమర్శించారు.