ఇది జెన్ జీ..జెన్ ఆల్పా కాలం అని..దేన్నీ ఆపలేరని, మెగా డీఎస్సీ పరీక్షలో నిర్వహణలో సీఎం చంద్రబాబు తప్పు చేశాక కూడా ఒప్పుకోకుండా..ప్రశ్నించేవారినే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ‘గుర్తుపెట్టుకో..ఏపీలో కూడా కాక్రోచ్‌లు లేస్తాయి’ అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ హెచ్చరించారు. ఆంధ్రరాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో అని స్పష్టం చేశారు.
డీఎస్సీ అవకతవకల అంశంపై గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణలో అక్రమాలపై స్పష్టమైన ఆధారాలున్నాయంటూ జగన్ వెల్లడించారు. అందుకే మేం రాష్ట్ర పోలీస్ వ్యవస్థతో కాకుండా థర్డ్ పార్టీ సీబీఐ దర్యాప్తునకు పట్టుబడుతున్నాం అని స్పష్టం చేశారు.విద్యాశాఖ మంత్రిగా సాక్షాత్తూ చంద్రబాబు కొడుకు ఉన్నాడు కాబట్టి, ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడని, పైగా ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం వమ్ము చేసిందని, స్కాములు చేస్తూ, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిందని, ఇంత ఘోరంగా రిక్రూట్‌మెంట్ చేయడం అన్నది ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు అని జగన్ విమర్శించారు. వాస్తవంగా మా ప్రభుత్వ హయాంలోనే 6,100 పోస్టులకు మేం నోటిఫికేషన్ ఇచ్చామని, వాటిని భర్తీచేయకుండా రద్దుచేసి, రిక్రూట్‌మెంట్ ఆలస్యం చేశారన్నారు. పైగా ఆ 6,100 పోస్టులతో కలిపి, ఇస్తున్న 16వేల పోస్టులకే మెగా పేరుపెట్టి చివరకు లీకులు, అక్రమాలు, స్కాములు, అవకతవకలు చేశారన్నారు. ఇదీ చంద్రబాబు మొదటి సంతకం దుస్థిని అని జగన్ ఎద్దేవా చేశారు. హయాంలో మా హయాంలో 1లక్షా 30వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి విజయవంతంగా భర్తీ చేశాం అని గుర్తు చేశారు.
చంద్రబాబుఅడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజీల మయమేనని, 1995లో టెన్త్ క్లాస్ పేపర్ల లీక్. 1996లో ఎంసెట్ ఇంజినీరింగ్ పేపర్స్ లీక్. 1997లో ఇంటర్మీడియట్ పేపర్స్ లీక్. 2017 టెన్త్ సైన్స్ పేపర్ లీక్. 2019లో టెన్త్ పేపర్ లీక్. 2025లో బీఈడీ పేపర్ లీక్, 2025లో టెన్త్ మ్యాథ్య్స్ పేపర్ లీక్. ఇప్పుడు డీఎస్సీ టీచర్ల రిక్రూట్‌మెంట్ లీక్. లీకుల్లో చంద్రబాబు రికార్డు ఇది అని జగన్ ఏకరువు పెట్టారు. మెగా డీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ లో బేరసారాలు జరిగిన వీడియో కూడా బయటకొచ్చిందంగటూ వీడియోను ప్రదర్శించారు. డీఎస్సీ పరీక్షల పేరుతో చంద్రబాబు, నారా లోకేష్ కలిసి అక్రమాలకు పాల్పడినట్టు ఆధారాలతో బయటపెట్టారు. తప్పులను ఎత్తిచూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోందని ఎద్దేవా చేశారు. ఇది జెన్‌జీ కాలం.. దేన్నీ చంద్రబాబు ఆపలేడనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.
