Akbaruddin Owaisi | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట నియోజకవర్గంపై నగర ప్రజలు దృష్టి సారించారు. ఆ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ డబుల్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? అని వేచి చూస్తున్నారు. 1999 అసెంబ్లీ ఎన్నికల నుంచి అక్బరుద్దీన్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఇతర పార్టీలను చిత్తు చేసిన అక్బరుద్దీన్.. ఈసారి కూడా అదే పంథా కొనసాగించి అసెంబ్లీలో ఆరోసారి అడుగుపెట్టబోతున్నారా..? అని నగర ప్రజలు చర్చలు జరుపుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఒకే నియోజకవర్గం నుంచి ఒకే పార్టీ తరుఫున ఇన్ని పర్యాయాలు ఇప్పటి వరకు ఎవరూ వరుసగా గెలవలేదు. ఈసారి గెలిస్తే అరుదైన డబుల్ హ్యాట్రిక్ రికార్డు ఆయన పేరున ఉంటుంది. ఇక ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున బోయ నగేశ్, బీజేపీ నుంచి సత్యనారాయణ ముదిరాజ్, బీఆర్ఎస్ తరపున ముప్పిడి సీతారాంరెడ్డి బరిలో ఉన్నారు.
అక్బరుద్దీన్ రాజకీయ నేపథ్యం..
అక్బరుద్దీన్ ఓవైసీ తొలిసారిగా అసెంబ్లీకి 1999లో ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004, 2009, 20014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. తాజాగా ఆరోసారి పోటీ పడుతున్నారు. 1999 నుంచి నేటి వరకు చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచే ఆయన పోటీ చేస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ 2004 సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు ఎన్నిక కావడంతో.. అక్బరుద్దీన్ ఎంఐఎం ఫ్లోర్ లీడర్‌గా ఎన్నికయ్యారు. 2009లోనూ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నికయ్యారు. 2019లో తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ నియమించబడ్డారు.
చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నేపథ్యం ఇదీ..
హైదరాబాద్ జిల్లా పరిధిలో చాంద్రాయణగుట్ట నియోజకవర్గం ఒక్కటి. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి నేటి వరకు జనరల్ నియోజకవర్గంగానే కొనసాగుతుంది. మొట్ట మొదటి సారి 1952లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఏగ్‌బోటి గోపాల్‌రావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత ఎంబీటీ పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ అమనూల్లాఖాన్ 1978,1983,1985లో స్వాతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో అమనుల్లాఖాన్ మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా 1989,1994లో పోటీ చేసి గెలుపొందారు. మజ్లిస్ పార్టీ అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ కుమారుడు అక్బరుద్దీన్ ఒవైసీ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి మొదటి సారిగా 1999లో చాంద్రాయణగుట్ట నియోజవకర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.