వన్డే వరల్డ్ కప్ 2023లో జగజ్జేత ఆస్ట్రేలియా అవతరించిన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో ఆరోసారి వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతంగా ఆడి ట్రోఫీ గెలుచుకున్నారంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఆస్ట్రేలియాపై ప్రశంసల జల్లు కురుస్తున్న సమయంలో వారి ప్రవర్తన ఆగ్రహానికి గురయ్యేలా చేస్తుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లందరూ ప్రపంచ కప్‌తో సరదాగా ఫొటోలు దిగగా, ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ మాత్రం వరల్డ్ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగుతూ ఫొటోలకు పోజులివ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
ఈ ట్రోఫీని ఎంతో మంది అపూరూపంగా చూసుకుంటారు. అలాంటిది దానిపై కాళ్లు పెట్టి అవమానించడం సరైన పనేనా అంటూ తిట్టి పోస్టున్నారు. కొందరు ‘మార్ష్ నీకిది తగునా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ‘దయచేసి ట్రోఫీకి కాసింత మర్యాద ఇవ్వండి’, ‘ఏరకంగా చూసినా ఇది తప్పే’ అంటూ విమర్శిస్తున్నారు. ఇంకొందరు ‘ఆస్ట్రేలియన్లకు ఇది ఏమంత సిగ్గు చేటు కాదు’ అని తిట్టిపోస్తున్నారు. ప్రతిష్ఠాత్మక, గౌరవప్రదమైన ప్రపంచకప్‌ను ఇలా అవమానించడం తగదని, వారిపై కఠిన శిక్ష విధించాలంటూ క్రికెట్ అభిమానులు ఆసీస్ ప్లేయర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత అహంకారం పనికి రాదంటూ నెటిజన్లు అతనికి క్లాస్ పీకుతున్నారు.
క్రికెట్ లో అహంకారానికి ఆస్ట్రేలియన్లు అసలు సిసలు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మ్యాచ్ ఆడేటప్పుడు తమ ప్రత్యర్ధులని చిన్న చూపు చూస్తుండడం అలానే వారిని నోటికి వచ్చినట్టు తిట్టడం వంటివి చేస్తుంటారు. అయితే ఇటీవల అవి కాస్త తగ్గాయి అనుకుంటున్న సమయంలో మార్ష్ చేసిన పని ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్ల అహంకారానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం అంటూ తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం మార్ష్ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.