Baby Girl | ఇప్పటి వరకు ఆరు వేళ్లతో పుట్టిన పిల్లలను చూశాం. కానీ ఈ శిశువు మాత్రం ఏకంగా 26 వేళ్లతో జన్మించింది. ఈ అసాధారణమైన లక్షణాన్ని కలిగి ఉన్న ఆడ శిశువు రాజస్థాన్‌లోని భరత్‌పూర్ పట్టణంలో జన్మించింది. ప్రతి చేతికి ఏడు వేళ్ల చొప్పున 14, ప్రతి పాదానికి ఆరు వేళ్ల చొప్పున 12 వేళ్లను కలిగి ఉంది ఆ పసిపాప. 26 వేళ్లతో పాప జన్మించడాన్ని ఆమె కుటుంబ సభ్యులు స్వాగతిస్తున్నారు. ఢోలాగర్ దేవి రూపంలో తమకు శిశువు జన్మించిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై డాక్టర్ బీఎస్ సోని స్పందించారు. జన్యుపరమైన లోపాల కారణంగానే పాప చేతులకు, పాదాలకు ఎక్కువ వేళ్లు కలిగి ఉందని తెలిపారు. ఈ అధిక వేళ్ల వల్ల పాప ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని, ఆమె ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు.
పాప తల్లి సర్జు దేవి(25) ఇక 8వ నెలలోనే ఈ బిడ్డను ప్రసవించింది. 26 వేళ్లతో పాప పుట్టడంతో.. ఆ ఆడబిడ్డకు కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. సర్జు దేవి భర్త సీఆర్పీఎఫ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. తండ్రి గోపాల్ భట్టాచార్య కూడా సంతోషం వ్యక్తం చేశారు.