Toyota Innova Crysta | ప్రముఖ కార్ల కంపెనీ టయోటా తన ఇన్నోవా క్రిస్టాను 2026 వెర్షన్ కోసం అప్‌గ్రేడ్ చేసింది. 2026 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది. కాలానికి అనుగుణంగా దీని ఆకర్షణ పెంచేందుకు స్టైలింగ్ అప్‌డేట్స్, కొన్ని కొత్త ఫీచర్లను జోడించి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధరను రూ.19.72 లక్షలు (ఎక్స్ షోరూం)గా నిర్ణయించింది.
ఈ కొత్త మోడల్‌లో ప్రధానంగా బాహ్య డిజైన్, ఇంటీరియర్‌లో మార్పులు చేశారు. దీని ముందు భాగంలో పూర్తిగా కొత్త గ్రిల్‌ను అందించారు. అలాగే భారీ గ్రిల్‌కు మందమైన క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. నంబర్ ప్లేట్ అమర్చే ప్రాంతాన్ని బ్లాక్ అప్లీక్‌తో విభజనించారు. ముందు బంపర్‌ను కూడా కొత్తగా డిజైన్ చేశారు. ఫాగ్‌ల్యాంప్ చుట్టూ అదనపు క్రోమ్ ఎలిమెంట్లను జోడించారు వెనుక బంపర్‌లోనూ ఇలాంటి మార్పులే చేశారు. ఈ మార్పులతో ఇన్నోవా క్రిస్టా మరింత రగ్‌డ్ లుక్‌ను సొంతం చేసుకుంది.
ఇంటీరియర్‌లో కూడా కొత్త అప్‌డేట్స్ తీసుకొచ్చారు. ఇంటీరియర్‌లో లేత రంగుల ఫాక్స్‌వుడ్ ట్రిమ్ ఇన్సర్ట్స్, కొత్త కాపర్ యాక్సెంట్స్, హైయర్ వేరియంట్లలో డ్యూయల్ టోన్ బ్లాక్ అందించారు. స్టీరింగ్ వీల్, డ్యాష్‌బోర్డు, సెంటర్ కన్సోల్, డోర్ ట్రిమ్స్‌పై గ్రేస్ కాపర్ ఫినిష్ ఇన్‌సర్ట్‌లను జోడించి ప్రీమియం ఫీలింగ్‌ను పెంచారు. ఏసీ కంట్రోల్స్ చుట్టూ డిజైన్‌ను మెరుగుపరచడంతో పాటు కొత్త డ్యూయల్ టోన్ సీట్ అప్‌హోల్‌స్ట్రీని అందించారు.
ఫీచర్ల విషయానికి వస్తే VX, ZX వేరియంట్లలో వైర్‌లెస్ చార్జింగ్ ప్యాడ్‌ను కొత్తగా అందించారు. టాప్‌ఎండ్ ZX వేరియంట్‌లో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. అయితే ఇంజిన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. అదే 2.4 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 148బీహెచ్‌పీ శక్తి, 343 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే ఈ వాహనం అందుబాటులో ఉంది.
