Avore Electric | చైనా విడిభాగాలు వాడకుండా.. పూర్తి స్వదేశీ టెక్నాలజీతోనే ఎలక్ట్రిక్ బైక్!

చైనా టెక్నాలజీ, విడిభాగాలపై ఆధారపడకుండా పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ బైక్‌ త్వరలోనే భారత మార్కెట్‌లోకి రాబోతుంది. అవోర్ ఎలక్ట్రిక్ (Avore Electric ) పేరుతో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ బైక్‌లను సమర్థ్ ఈ మొబిలిటీ కంపెనీ రూపొందిస్తుంది.

Avore Electric | సాధారణంగా భారత్‌లో తయారయ్యే చాలా ఉత్పత్తుల్లో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలనే వాడుతుంటారు. మేక్ ఇన్ ఇండియా పేరుతో చేసే ప్రొడక్ట్‌ల్లోనూ ఇదే తంతు!.. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలను ఉపయోగించి వాటిని తయారుచేస్తుంటారు. కానీ అలా చైనా విడిభాగాలపై ఆధారపడకుండా పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో పాటు హార్డ్‌వేర్ విభాగాలను వాడి తయారుచేసిన ఎలక్ట్రిక్ బైక్ త్వరలోనే మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతుంది. అవోర్ ఎలక్ట్రిక్ (Avore Electric ) పేరుతో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ బైక్‌లను సమర్థ్ ఈ మొబిలిటీ కంపెనీ రూపొందిస్తుంది.

సమర్థ్మొబిలిటీ కంపెనీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ కేంద్రంగా గత మూడేళ్లుగా పూర్తిస్థాయి స్వదేశీ టెక్నాలజీపై రీసెర్చ్ చేసింది. కంపెనీకి చెందిన 100 మందికి పైగా సాంకేతిక ఇంజినీర్ల బృందం రాత్రింబవళ్లు కష్టపడి వాహనానికి అవసరమైన కీలక భాగాలను స్వయంగా రూపొందించింది. ప్రత్యేకంగా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, మోటార్ కంట్రోలర్, ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టమ్, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, బ్యాటరీ ప్యాక్ వంటి 9 కీలక సబ్ సిస్టమ్‌లను సమర్థ్ ఈ మొబిలిటీ కంపెనీ స్వయంగా అభివృద్ధి చేసింది. ఇవన్నీ ఒకే టెక్నాలజీ ఆధారిత వ్యవస్థ కింద పనిచేసేలా అవోర్ సోర్స్ అనే యూనిఫైడ్ టెక్ స్టాక్‌ను రూపొందించింది. దీనికి అనుగుణంగా ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాల కోసం AVR ప్లాట్‌ఫామ్ అనే చాసిస్ డిజైన్‌ను కూడా అభివృద్ధి చేసింది. తాము అభివృద్ధి చేసిన టెక్నాలజీకి రక్షణ కల్పించేందుకు ఇప్పటివరకు 110కి పైగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కింద దరఖాస్తులను సమర్పించినట్లుగా సమర్థ్ ఈ మొబిలిటీ కంపెనీ తెలిపింది.

భారత్‌లో ఎక్కువగా అమ్ముడయ్యే 125సీసీ నుంచి 200 సీసీ పెట్రోల్ బైక్‌లకు ప్రత్యేకంగా ఉండే సెగ్మెంట్‌లపై అవోర్ ఎలక్ట్రిక్ దృష్టి పెట్టింది. అంటే పల్సర్, అపాచీ, అవెంజర్ వంటి బైక్‌లను వాడుతూ పెట్రోల్ ఖర్చులకు ప్రత్యామ్నాయం వెతుకుతున్న మిడిల్ క్లాస్, యూత్‌ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ ఎలక్ట్రిక్ బైక్‌లను తయారుచేస్తుంది. రోజు ఆఫీసులు, పనిమీద తిరిగే కస్టమర్లు, మన్నిక, నమ్మకాన్ని ప్రాధాన్యంగా చూసే కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని ఈ వాహనాలను రూపకల్పన చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ బైక్‌లను అధికారికంగా మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. దీని మోడల్ వేరియంట్లు, ధరలు, పూర్తి స్పెసిఫికేషన్లు వంటి వివరాలు వచ్చే నెలలో కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా సమర్థ్మొబిలిటీ కంపెనీ కో ఫౌండర్ ప్రియాంక్ రాఘోలియా మాట్లాడుతూ… నిజమైన ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడో మార్కెట్‌లో దొరికే, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలను బిగించడం వల్ల రాదని తెలిపారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే భాగాలను కేవలం అసెంబుల్ చేయడం కంటే స్వయంగా అభివృద్ధి చేసిన వ్యవస్థలతో వాహనాలు తయారుచేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. అందుకే థర్డ్ పార్టీ హార్డ్‌వేర్‌పై ఆధారపడకుండా అన్ని వ్యవస్థలను సంస్థ అంతర్గతంగానే అభివృద్ధి చేస్తోందని వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ నుంచి విడిభాగాల పనితీరు వరకు ప్రతిదానిపై పూర్తి నియంత్రణలో ఉండేలా సంస్థ వ్యూహం రూపొందించుకున్నట్లు చెప్పారు.

 

Latest News