విధాత, హైదరాబాద్ : డెమొక్రాటిక్ సంఘా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, ఎలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా పనిచేసే ఒక సామాజిక సంస్కరణ సంస్థ. కార్యకర్త చైతన్య ఎంఆర్ఎస్కే, నటి రెజినా కసాండ్రా సంయుక్తంగా ఈ సంస్థను స్థాపించారు. దేశాన్ని ధైర్యమైన ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు , సామాజిక ప్రభావాలతో మారుస్తున్న వ్యక్తులను గౌరవిస్తూ ఛేంజ్ మేకర్స్ లిస్ట్-2025ను ప్రకటించింది. ఈ సంస్థ భారతదేశాన్ని మార్చడంలో దూరదృష్టి కలిగినవారు, విప్లవాత్మక ఆలోచనాపరులు, మార్పుకర్తలను సత్కరిస్తుంది. వ్యాపారం, విధానం, కళలు, సాంకేతికత, మీడియా, ఉద్యమాల వరకు ఈ జాబితా విస్తరించింది. తమ రంగాల్లో మాత్రమే రాణించకుండా, ప్రస్తుత వ్యవస్థను సవాలు చేస్తూ, ప్రభావవంతమైన వ్యవస్థాత్మక మార్పును తీసుకువస్తున్న వ్యక్తులను గుర్తిస్తుంది.
ఈ సందర్భంగా, డెమొక్రాటిక్ సంఘా వ్యవస్థాపకుడు, కార్యకర్త చైతన్య మాట్లాడుతూ, ‘భారతదేశం ఒక కీలక మలుపు వద్ద ఉంది. దేశ భవిష్యత్తు ధైర్యం, సృజనాత్మకత, కరుణతో నిర్మితమవుతుందన్నారు. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తూ, పౌరులను శక్తివంతం చేస్తున్న ఈ విశిష్ట వ్యక్తులను వెలుగులోకి తీసుకురావడమే ఛేంజ్ మేకర్స్ లిస్ట్ లక్ష్యం’ అని ఆయన వెల్లడించారు. అనంతరం కో ఫౌండర్, నటి రెజీనా మాట్లాడుతూ, “ఈ చేంజ్ మేకర్స్ మరింత సమగ్రతతో కూడిన, పురోగమించిన భారతదేశం ఆత్మను ప్రతిబింబిస్తారు” అని ఆమె పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం, డెమొక్రాటిక్ సంఘా ప్రపంచాన్ని మలుస్తున్న దూరదృష్టి కలిగినవారు, విప్లవాత్మక నాయకులు, మార్పుకర్తలను గౌరవిస్తూ లిస్ట్‌ను సిద్ధం చేస్తుంది. వ్యాపారం, విధానం, కళలు, సాంకేతికత, మీడియా, ఉద్యమాలు వంటి విభాగాల నుంచి అత్యుత్తమ ప్రతిభను గుర్తించే ఈ జాబితా, ప్రస్తుత వ్యవస్థను సవాలు చేస్తూ అర్థవంతమైన, వ్యవస్థాత్మక మార్పుకు కృషి చేసే వారిని సత్కరిస్తుంది. యానువల్ ఛేంజ్ మేకర్స్ లిస్టులో ఎంపికైన వారికి తరువాత డెమొక్రాటిక్ సంఘా నిర్వహించే యానువల్ ఫోరంలో ఛేంజ్ మేకర్ అవార్డు ప్రదానం చేస్తారు.
ఇది విధాన నిర్మాతలు, మార్పుకర్తలు, పౌర నాయకులు, పండితులు, బాధ్యతగల పౌరులు కలిసి ప్రజాస్వామ్య స్థితిగతులపై చర్చించే, మరింత సమగ్ర మరియు కరుణతో కూడిన సమాజాన్ని నిర్మించే మార్గాలను అన్వేషించే వేదిక. కాగా, 2025కి సంబంధించి 35 మందికి డెమొక్రాటిక్ సంఘా ఛేంజ్ మేకర్స్ అవార్డు వరించింది. వీరిలో అనీష్ గవాండే, అర్జున్ బహల్, అశోక్ శంకర్ రాథోడ్, ఆకాశ్ మేహతా, మమతా మోహన్ దాస్, అక్షత్ రాజన్, కల్నల్ క్రిస్టోఫర్ జాన్ రెగో, చైతన్య ప్రభు, జయేష్ రంజన్ (IAS), రత్నా రెడ్డి, రవి రెడ్డి లాంటి ప్రముఖులు ఉన్నారు. కాగా, డెమొక్రాటిక్ సంఘా నాలుగు ప్రధాన కార్యక్రమాలు అయిన ఎలక్టోరల్ రిఫార్మ్స్, రూరల్ ఉమెన్ లీడర్ షిప్ ప్రోగ్రామ్, రైట్ టూ ఎడ్యూకేషన్, రైట్ టూ ఇన్ఫర్మేషన్ పై పనిచేస్తుంది.
