- డిజిటలైజేషన్ వల్ల నిండా మునుగుతున్న భారతీయులు
- పెరిగిన స్మార్ట్ఫోన్ల వాడకం– తగ్గిన డాటా రేట్లు కూడా కారణమే.
- ఈ భారీ మొత్తాల దోపిడిలో కొవిడ్ మహమ్మారి కూడా నిందితురాలే
- వాట్సప్ – ఆర్థిక మోసాల ప్రధాన కేంద్రం. టెలిగ్రామ్, యూట్యూబ్‌లు కూడా
Cybercriminals | 2024లో భారతీయుల నుంచి సైబర్ నేరగాళ్లు ₹22,842 కోట్లు దోచుకున్నారని ఢిల్లీకి చెందిన మీడియా–టెక్ సంస్థ డేటాలీడ్స్ తన నివేదికలో వెల్లడించింది. ఈ సంఖ్య 2023లో జరిగిన ₹7,465 కోట్ల డిజిటల్ మోసాల కంటే మూడింతలు, 2022లో జరిగిన ₹2,306 కోట్ల కంటే దాదాపు పది రెట్లు ఎక్కువ.
కేంద్ర హోంశాఖ పరిధిలోని I4C (Indian CyberCrime Coordination Centre) అంచనా ప్రకారం, 2025లో భారతీయులు ₹1.2 లక్షల కోట్లకు పైగా కోల్పోయే అవకాశం ఉంది. ఫిర్యాదుల సంఖ్య కూడా భయానకంగా పెరిగింది – 2024లో దాదాపు 20 లక్షల కేసులు నమోదు కాగా, ఇది 2019తో పోల్చితే పది రెట్లు ఎక్కువ.
యూపీఐ విజృంభణ – మోసగాళ్లకు బంగారు గని
పేటీఎం, ఫోన్‌పే వంటి డిజిటల్ చెల్లింపు పద్ధతుల విస్తృత వాడకం, వాట్సాప్–టెలిగ్రామ్‌లాంటి మెసేజింగ్ యాప్స్ ద్వారా ఆర్థిక సమాచారాన్ని పంచుకోవడం( ఎండ్–టు–ఎండ్ ఎన్క్రిప్షన్ అని చెప్తే చాలామంది నమ్ముతున్నారు..ప్చ్) మోసగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పించింది. ఒక్క 2025 జూన్‌లోనే 190 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగి, మొత్తం విలువ ₹24.03 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రపంచంలో సగానికి పైగా డిజిటల్ చెల్లింపులు భారత్లోనే జరుగుతున్నాయి. 2013లో 163 కోట్లున్న డిజిటల్ చెల్లింపులు, జనవరి 2025 నాటికి 18,120.82 కోట్లకు చేరుకున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి ప్రధానమైన కారణం, కొవిడ్ మహమ్మారి. కరెన్సీనోట్ల వాడకం వల్ల వైరస్ బారిన పడే అవకాశముంది కాబట్టి, ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించింది.
బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ – అందరూ లక్ష్యాలే!
2025–26 ఆర్థిక సంవత్సరపు మొదటి అర్ధభాగంలో బ్యాంక్ మోసాలు ఎనిమిది రెట్లు పెరిగాయి. నష్టాలు రూ. 2,623 కోట్ల నుంచి రూ. 21,367 కోట్లకు చేరాయి. ప్రైవేట్ బ్యాంకులు ఎక్కువ ఘటనలకు కారణమైనా, పబ్లిక్ బ్యాంక్ వినియోగదారులు ఎక్కువ నష్టపోయారు – ఆ మొత్తం ₹25,667 కోట్లు.
ఇన్సూరెన్స్ రంగంలోనూ మోసాలు పెరిగాయి – లైఫ్, హెల్త్, వాహన, జనరల్ పాలసీల పేరుతో యాప్ ఆధారిత సర్వీసుల ద్వారా కస్టమర్లను మోసం చేస్తున్నారు. HDFC, Kotak, Royal Sundaram వంటి పేర్లతో లోగోలు ఉపయోగించి ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు.
పెట్టుబడి మోసాలు కూడా విపరీతంగా పెరిగాయి. అధిక లాభాల మాయలో పడి మోసపోయే వాళ్లలో చదువుకున్నవారే అధికంగా ఉండటం ఆందోళనకరం.
సాధారణ డిజిటల్ మోసాల పద్ధతులు
- ఫిషింగ్ మెసేజీలు – SMS/WhatsApp ద్వారా బహుమతి, రీఫండ్ పేరుతో లింకులు పంపడం.
- నకిలీ ఉత్పత్తుల లిస్టింగ్స్ – తక్కువ ధరలో వస్తువులు చూపించి, ముందుగానే డబ్బులు తీసుకొని మాయమవడం.
- పేమెంట్ కన్ఫర్మేషన్ స్కామ్ – ఫేక్ మెసేజ్‌ల ద్వారా ఫైనాన్షియల్ డిటైల్స్ దోచుకోవడం.
వాట్సాప్ – మోసగాళ్ల ప్రధాన కేంద్రం
ఈ మోసాలలో అధికశాతం వాట్సప్ ద్వారా జరుతున్నట్లు నిపుణులు గుర్తించారు. 2024 జనవరిలోనే వాట్సాప్‌లో 15,000 ఫైనాన్స్ మోసాలు నమోదయ్యాయి. టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ప్రభుత్వం చట్టాలు తీసుకువచ్చినా, సోషల్ మీడియా కంపెనీలు తాము కేవలం ప్లాట్‌ఫారమ్ మాత్రమే అని చెప్పి తప్పించుకుంటున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్లాట్ఫారమ్ స్థాయి పర్యవేక్షణ, కఠిన చట్టపరమైన చర్యలు తప్ప ఈ ముప్పును ఆపడం సాధ్యం కాదు.