Site icon vidhaatha

Metro: హైదరాబాద్ మెట్రోకు.. ‘రైల్వే సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం

న్యూఢిల్లీ: 2025 జూన్ 13న న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక ET (ఎకనమిక్ టైమ్స్) ఇన్‌ఫ్రా రైల్ షో 2025లో రైల్వే సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని దక్కించుకున్నట్లు L&T మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (L&TMRHL) సంతోషంగా ప్రకటించింది.

భారతీయ రైలు మరియు మెట్రో మౌలిక సదుపాయాల రంగ వృద్ధికి తోడ్పడిన సంస్థలను సత్కరించే లక్ష్యంతో ఈటీ ఇన్‌ఫ్రా రైల్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు. భద్రత, సుస్థిరత, సాంకేతికత, డిజిటల్ ఆవిష్కరణలు, అర్బన్ కనెక్టివిటీలో అగ్రగాములుగా నిలుస్తూ, దేశీయంగా రైల్ ఆధారిత మొబిలిటీ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న సంస్థలకు ఈ పురస్కారాలు అందజేశారు.

హైదరాబాద్ మెట్రో రైల్‌కు జాతీయ స్థాయిలో లభించిన ఈ గుర్తింపు ఎంతో గర్వకారణమైన మైలురాయిగా నిలుస్తుంది. సురక్షితమైన, విశ్వసనీయమైన, ప్రపంచ స్థాయి అర్బన్ ట్రాన్సిట్ సొల్యూషన్స్‌ను అందించడంలో సంస్థకు గల నిబద్ధతకు ఇది నిదర్శనం. ప్రయాణికుల భద్రత, సమగ్ర రిస్క్ మేనేజ్‌మెంట్ విధానాలు, సాంకేతిక ఆవిష్కరణలపై ప్రధానంగా దృష్టి సారించిన హైదరాబాద్ మెట్రో రైల్, దేశవ్యాప్తంగా అగ్రగామి మెట్రో సిస్టమ్‌లతో పోటీ పడి ఈ పురస్కారాన్ని గెలుచుకుంది.

భద్రతకు L&TMRHL ప్రాధాన్యత

ఈ పురస్కారం అందుకున్న సందర్భంగా L&TMRHL ఎండీ & సీఈవో Mr. కేవీబీ రెడ్డి మాట్లాడుతూ, “ఇది మేము సాధించిన విజయాలకు గుర్తింపు మాత్రమే కాదు. అర్బన్ మొబిలిటీ భవిష్యత్తును మరింతగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మాపై ఉందని గుర్తు చేసింది. L&TMRHLకి భద్రత అనేది కేవలం ఒక మైలురాయిలాంటిది కాదు, ప్రతి నిర్ణయం, ప్రతి ఆవిష్కరణ, మేము తోడ్పాటునందించే ప్రతి ప్రయాణానికి మార్గదర్శకంగా నిలిచే ఆలోచనాధోరణి. నిర్దిష్ట లక్ష్యాల సాధనకు తోడ్పడే భాగస్వామ్యాలు, అంకితభావం అనేవి భారతదేశంలో మొబిలిటీని పునర్నిర్వచిస్తాయన్న మా నమ్మకాన్ని ఇలాంటి అవార్డులు పునరుద్ఘాటిస్తాయి” అని పేర్కొన్నారు.

అర్బన్ మొబిలిటీపై విజన్

“ఫ్యూచర్ ఆఫ్ అర్బన్ రైల్ అండ్ స్మార్ట్ స్టేషన్స్ – ట్రాన్స్‌ఫార్మింగ్ అర్బన్ మొబిలిటీ” అనే అంశంపై జరిగిన ప్యానెల్ డిస్కషన్‌లో Mr. కేవీబీ రెడ్డి తన అనుభవాలను, తదుపరి తరం ట్రాన్సిట్‌కి సంబంధించి L&TMRHL యొక్క విజన్‌ను వివరించారు. టెక్నాలజీ, ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా సర్వీసులు అందించడం, ఎప్పటికప్పుడు సేవలను మెరుగుపర్చుకోవడమనేది సమయపాలన, భద్రత, విశ్వసనీయతలో అత్యుత్తమ ప్రమాణాలను సాధించడంలో హైదరాబాద్‌ మెట్రోకి ఏ విధంగా తోడ్పడ్డాయో ఆయన వివరించారు.

PPP (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) పరమైన సవాళ్లను ప్రస్తావిస్తూ, క్లియరెన్స్‌ల్లో జాప్యాలు, ఆర్థిక అనిశ్చితులు వంటి అంశాలను ఆయన పేర్కొన్నారు. పాలసీపరంగా పటిష్టమైన మద్దతు, రిస్కులను సమానంగా పంచుకునే పరిస్థితులు ఎంతో అవసరమని తెలిపారు. అలాగే, నవకల్పనలు, పర్యావరణహితమైన విధంగా మౌలిక సదుపాయాల వృద్ధికి మరింతగా ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం అవసరమని నొక్కి చెప్పారు.

Exit mobile version