- 3న బైకులు, 4న కార్ల రంగ ప్రవేశం
- వరుస కట్టిన 12 బడా కంపెనీలు
- పెద్ద ఎత్తున రానున్న ఇథనాల్ బంకులు
ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం మిథనాల్‌ను పెద్ద ఎత్తున మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నది. వారం క్రితం మహారాష్ట్ర నాగపూర్‌లో కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇథనాల్‌తో నడిచే స్టౌను ఆవిష్కరించారు. జూన్ 3వ తేదీన హీరో కంపెనీకి చెందిన టూ వీలర్లను కూడా మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. మారుతీ కంపెనీకి చెందిన కారును కూడా ఆవిష్కరించనున్నారు. పర్సనల్ ఫోర్ వీలర్లు, టూ వీలర్లలో వంద శాతం ఇథనాల్‌తో నడిచే విధంగా దేశ ఆటోమొబైల్ రంగాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్రం ఉన్నది. ఫలితంగా మధ్యప్రాచ్య దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే బాధ తప్పడం తో పాటు విదేశీ మారకద్రవ్యం భారం ఉండదనేది ప్రభుత్వ వాదన.
భారత దేశం విదేశాల నుంచి 87 శాతం క్రూడాయిల్, ఎల్పీజీని దిగుమతి చేసుకుంటున్నది. కొద్ది నెలలుగా ఇరాన్ దేశంపై అమెరికాతో పాటు ఇజ్రాయెల్ దేశాలు విరుచుకుపడుతున్న విషయం విదితమే. ఫలితంగా ఇరాన్ దేశం నుంచి ముడి చమురుతో పాటు ఎల్పీజీ దిగుమతికి భారత్ నానా తంటాలు పడుతున్నది. రవాణాలో అతి ముఖ్యమైన హార్మూజ్ జల సంధిపై తమ పెత్తనం ఉండాలని అమెరికా దేశం పట్టుబడుతుండటంతో సమస్య జటిలంగా మారింది. ఇప్పట్లో యుద్ధం సద్దుమణిగే పరిస్థితులు కనిపించడం లేదు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఫలితంగా దేశంలో ఆయిల్ కంపెనీలకు నష్టాలు వస్తున్నాయంటూ ఇబ్బడి ముబ్బడిగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరిచేలా చేస్తున్నది. గత పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గిన సందర్భంలో దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు తగ్గించకుండా మౌనం వహించింది. పెంచినప్పుడు మాత్రం దానికి అనుకులంగా ప్రజలపై అదనపు భారం మోపుతున్న విషయం తెలిసిందే.
ప్రజల నుంచి వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రత్యామ్యాయ ఇంధనాలు, పర్యావరణానికి హాని లేని వనరులపై కేంద్రం శ్రద్ధ పెట్టింది. ఎల్పీజీ స్థానంలో ఇథనాల్ వంట స్టౌలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీని వల్ల ఎల్పీజీతో అవసరం ఉండదనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. నాగపూర్‌లో వారం క్రితం ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇథనాల్ తో నడచే వంట స్టౌ ను ఆవిష్కరించారు. తక్కువ ధరకు లభించే ఇలాంటి విధానాలు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, పర్యావరణానికి కూడా హాని ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఎల్పీజీ ధరలు పెరుగుతున్నాయని, బుక్ చేసిన సిలిండర్ రాలేదని ఎదురు చూడాల్సిన అవసరమే ఉండదన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు అయిన చెరకు, మొక్కజొన్న పంటల నుంచి ఇథనాల్ తయారు చేస్తున్నారన్నారు. వీటి కొనుగోలు వల్ల రైతులకు లాభం రావడమే కాకుండా పర్యావరణ హిత బయో ఫ్యూయల్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఇథనాల్ వినియోగం పెరిగితే దేశంలో మొక్కజొన్న, చెరకు పంటల సాగు అమాంతం పెరుగుతుందని, రైతులకు చేతినిండా పనితో పాటు అదనపు ఆదాయం వస్తుందన్నారు. వాటర్ లో 7 శాతం ఇథనల్ కలిపి స్టౌ వినియోగించే విధానానికి శ్రీకారం చూట్టామన్నారు. ఎల్పీజీ ధరతో పోల్చితే తక్కువ ధరతో వంటలు చేసుకోవచ్చన్నారు. విరివిగా బయో ఫ్యుయల్ లభించే విధంగా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. దశల వారీగా మౌలిక సదుపాయాలను సమకూర్చుతామని నితిన్ గడ్కరీ తెలిపారు.
కెన్యా దేశం మొంబాస లో 80 శాతం మంది వరకు వంట చెరకుతో వంటలు చేసుకునే వారు. ఫలితంగా పర్యావరణం కలుషితం అవుతుందని ప్రభుత్వం గుర్తించి ప్రత్యామ్నాయంగా బయో ఇథనాల్‌తో నడిచే వంట స్టౌలను అందచేయాలని నిర్ణయించింది. 2017 నుంచి బయో ఇథనాల్ స్టౌ లను మహిళలు విజయవంతంగా వినియోగిస్తున్నారు. మొంబాసలో సామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ పదివేల స్టౌ లను మహిళలకు అందచేసింది. దూరం వెళ్లి వంట చెరకు తెచ్చుకుని పొగ మధ్య వంట చేయాల్సిన బాధ తప్పిందని మహిళలు తెలిపారు. ఆఫ్రికా దేశంలోని వలస శిబిరాల వద్ద బయో ఇథనాల్ స్టౌల వినియోగాన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.
జూన్ 3న హీరో ఫ్లెక్సీ ఫ్యుయల్ బైక్ లాంచింగ్
దేశంలో అగ్రగామి మోటర్ సైకిళ్లను విక్రయిస్తున్న హీరో మోటార్ సైకిల్ కంపెనీ మార్కెట్ లోకి హీరో ఫ్లెక్సీ ఫ్యూయల్ బైక్ ను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ 3వ తేదీ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. వందశాతం ఇథనాల్ ఇంధనంతో నడిచే విధంగా ఈ టూ వీలర్లను తయారు చేశారు. పెట్రోల్ తో అవసరం లేకుండా జీవ ఇంధనంతో నడవనున్నాయి.2025 లో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో లో వందశాతం ఇథనాల్ తో నడిచే హెచ్ఎఫ్ డీలక్స్ మోడల్ ను ప్రదర్శించిన విషయం తెలిసిందే. జైపూర్ లోని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ లో ఈ మోడల్ ను తయారు చేశారు. 100 సీసీ సామర్థ్యంలో బీఎస్6 ప్రమాణాలతో సాంకేతికతను డెవలప్ చేశారు. పెట్రోలో వెర్షన్ లో లభించే మోడల్ ధరపై రూ.50వేల అదనపు ధరతో ఈ కార్లు విక్రయించనున్నారు. ప్రస్తుతం పెట్రోల్ బంకులలో లభించే పెట్రోల్ లో 20 నుంచి 25 శాతం వరకు ఇథనాల్ ను మిక్స్ చేసి వాహనదారులకు విక్రయిస్తున్నారు. దశాబ్ధం క్రితం పెట్రోల్ లో 1.5 శాతం ఇథనాల్ కలిపి విక్రయించేవారని, క్రమంగా 2025 నాటికి అది 20 శాతానికి చేరుకుందన్నది. హీరో దారిలోనే పలు టూ వీలర్ కంపెనీలు వంద శాతం ఇథనాల్ తో నడిచే బండ్లను తయారు చేసే పనిలో ఉన్నాయి. ఈ సంవత్సరం ముగిసేనాటికి పలు కంపెనీలు తమ బండ్లను మార్కెట్ లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో సుజుకీ కంపెనీ జిక్సర్-25- మోడల్ ను, హోండా కంపెనీ సీబీ300ఎఫ్ టూ వీలర్లను మార్కెట్ లోకి ఆవిష్కరించి, ఆ తరువాత ఉత్పత్తిని నిలిపివేశాయి.
మారుతీ సుజుకీ వాగనర్ 4న మార్కెట్ లోకి
ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5వ తేదీ సందర్భంగా ఒక రోజు ముందుగా జూన్ 4న న్యూఢిల్లీలో మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన బయో ఫ్యూయల్ ఇథనాల్ తో నడిచే వాగనర్ కారు మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. న్యూఢిల్లీ తాజ్ ప్యాలెస్ లో జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి హాజరవుతున్నారు. ఈ కారు వంద శాథం ఇథనాల్ ఇంధనం ఉపయోగించి ప్రయాణాలు సాగించుకోవచ్చు. 2024 లో న్యూఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో ఫ్లెక్సీ ఫ్యుయల్ వాగనర్, ప్రాంక్స్ మోడళ్లను ప్రదర్శించింది. 2025లో జపాన్ మొబిలిటీ షో లో కూడా ఈ రెండు మోడళ్లను ప్రదర్శనకు పెట్టిన విషయం తెలిసిందే.
12 కంపెనీలు ముందుకు వచ్చాయి….
దేశంలో ఫ్లెక్సీ ఫ్యూయల్‌తో నడిచే వాహనాలను తయారు చేసేందుకు దేశంలో 12 ప్రముఖ ఆటోమోటివ్ కంపెనీలు మందుకు వచ్చాయి. పలుమార్లు సొసైటీ ఫర్ ఇండియన్ ఆటోమొబైల్ ఉత్పత్తిదారులు (సియామ్)తో నితిన్ గడ్కరీ సమావేశాలు నిర్వహించి ఒప్పించారు. దేశంలో ప్రముఖ కంపెనీలు అయిన మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, టాటా, మారుతీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు సిద్ధమయ్యాయి. బయో ఇథనాల్‌తో నడిచే టయోటా ఇన్నోవాను ఏడాదిన్నర కాలంగా వినియోగిస్తున్నట్లు నితిన్ గడ్కరీ స్వయంగా తెలిపారు.
విరివిగా బంకుల ఏర్పాటు
బ్రెజిల్‌లో ఇథనాల్‌తో నడిచే వాహనాలను ప్రవేశపెట్టారు. అదే తరహాలో దేశంలో కూడా ఇథనాల్ బంకులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. పెట్రోల్, డీజిల్ మాదిరి విరివిగా లభించే విధంగా బంకులు ఏర్పాటు కానున్నాయి. ఇప్పుడు ఉన్న పెట్రోల్, డీజిల్ బంకులు భవిష్యత్తులో పూర్తి స్థాయి బయో ఫ్యుయల్, ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇథనాల్ విరివిగా లభిస్తున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీలో తొలుత బంకులు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు కానున్నాయి.
