Site icon vidhaatha

India Rs 10 Notes | భారత్‌కు చెందిన అరుదైన రూ.10 నోట్లు లండన్‌లో వేలం..!

India Rs 10 Notes | భారత్‌కు చెందిన అరుదైన రూ.10 నోట్లను వేలం వేయనున్నారు. అరుదైన నోట్స్‌ని బుధవారం వేలం వేయబోతున్నారు. ఈ నోటు 1918లో ముంబయి నుంచి లండన్‌కు వెళుతున్న ఓడ మునిగిపోగా.. అందులో దొరికాయి. లండన్‌లోని నూన్సన్‌ మే ఫెయిర్‌ వేలం సంస్థ ఈ నోట్లని వేలం వేస్తే 2వేల నుంచి 2600 పౌండ్లు పలకవచ్చని అంచనా వేస్తున్నారు. జులై 2, 1918లో మునిగిపోయిన ఓడ శిథిలాల మధ్య ఈ రూ.10 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు నూనన్స్ నిపుణురాలు థొమాసినా స్మిత్ పేర్కొన్నారు.

ఈ నోట్లపై 25 మే 1918 తేదీని ముద్రించినట్లుగా ఉందని తెలిపారు. వాటితో పాటు సంతకం చేయని అనేక రూ.5, రూ.10 నోట్లు, సంతకం చేసిన రూపాయి నోట్లను కూడా గుర్తించామన్నారు. ఇలా దొరికిన వాటిని అధికారులు చాలా వరకు స్వాధీనం చేసుకున్నారని.. వాటిలో కొన్ని నాశనమయ్యాయని.. ఇంకొన్ని కొత్తగా ముద్రణకు వెళ్తాయన్నారు. ఆ నోట్లలో కొన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఇలాంటి నోట్లను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఈ నోట్లు మంచి కండిషన్‌లో ఉన్నట్లు తెలిపారు. పైగా ఈ రెండు నోట్లు వరుస సంఖ్యలను కలిగి ఉండడం అద్భుతమని చెప్పారు.

బుధవారం నోట్ల వేలంలో మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. బ్రిటిష్ కాలంలోని అరుదైన రూ.100 నోటును వేలం వేస్తున్నారు. వాటి విలువ 4,400 నుంచి 5వేల పౌండ్ల వరకు పలకవచ్చునని భావిస్తున్నారు. ఈ రూ.100 నోటు నాటి కలకల్తాలో ముద్రించారు. సంతకం, స్టాంప్ సైతం ఉన్నాయి. రూ.100 నోటు 1917-1930 కాలం నాటిది కాగా.. నోటు వెనుక భాగాన హిందీ, బెంగాలీ భాషతో పాటు వివిధ భారతీయ భాషల్లో రూ.100 ముద్రించబడి ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-పర్షియన్ గల్ఫ్ ఇష్యూ చేసిన 1957-62 నాటి రూ.5 నోటును కూడా వేలం వేయనున్నారు. అశోక చిహ్నాన్ని కలిగి ఉన్నది.

Exit mobile version