విధాత : టాలీవుడ్ లో ఈ ఏడాది రీరిలీజ్ సినిమాల సందడి క్రేజీగా కొనసాగుతుంది. ఆధిత్య 369, మురారి, జగదేక వీరుడు అతిలోక సుందరి, బాహుబలి ఎపిక్ చిత్రాలు ఈ ఏడాది మరోసారి ప్రేక్షకులను పలకరించాయి. ఈనెల 14న తెలుగు కల్ట్ క్లాసిక్ మూవీగా పిలిచే నాగార్జున శివ సినిమా కూడా రీరిలీజ్ కాబోతుంది. ఇక సిద్దార్థ్, త్రిషా నటించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ మూవీ 15న రీరిలీజ్ కాబోతుంది.
ఈ జావితాలో మెగాస్టార్ చిరంజీవి మరో హిట్ చిత్రం ‘కొదమసింహం’ కూడా మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమైంది. చిరంజీవి కెరీర్ లో కౌబాయ్ చిత్రంగా రూపొందిన ‘కొదమసింహం’ అప్పట్లో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించి హిట్ చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ సినిమాను సరికొత్త హంగులతో ముస్తాబు చేసి ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్బంగా చిరంజీవి సినిమాతో తన అనుభూతులను పంచుకున్నారు. నా కెరీర్‌లో అత్యంత సాహసోపేతమైన ప్రయాణం ఈ చిత్రం. చిరస్మరణీయమైన పాటలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ సినిమా చిత్రీకరణకి సంబంధించి ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. దీన్ని మళ్లీ విడుదల చేస్తుండడం సంతోషంగా ఉందంటూ పేర్కొన్నారు.
కౌబాయ్ చిత్రాలకు ఊపునిచ్చిన కొదమ సింహం
టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ మోసగాళ్లకు మోసగాడు కౌబాయ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. అ తర్వాత గిరిబాబు వంటి వారు అలాంటి చిత్రాల ఒరవడిని కొనసాగించారు. చిరంజీవి మెగా హీరోగా మారిపోయాక..ఆయనతో సరికొత్త జోనర్ లో సినిమా తీయాలనే ఆలోచనతో కె.మురళీమోహనరావు దర్శకత్వంలో కొదమ సింహం నిర్మించారు. 1990లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులనుంచి మంచి ఆదరణ దక్కింది. చిరంజీవి ఫైట్స్, డ్యాన్స్, రాజ్ – కోటి సంగీత దర్శకత్వంలో పాటలు, ఉత్కంఠభరిత కథనం సినిమాను విజయవంతం చేశారు. చిరంజీవి రాధ, సోనం, వాణీ విశ్వనాథ్ కథానాయికలుగా నటించారు. మోహన్‌బాబు సుడిగాలి అనే కీలక పాత్రలో అలరించారు. కైకాల నాగేశ్వరరావు నిర్మాతగా వ్యవహరించారు. ఆయనే ఈ చిత్రాన్ని 4కే విజువల్స్, 5.1 డిజిటల్ సౌండింగ్‌తో సిద్ధం చేయించి, రీరిలీజ్‌గా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కొదమ సింహం సినిమా హిట్ తో ..సాహసాలు, అద్బుత పోరాటాలు, అటవీ నేపథ్యం, అన్వేషణ, గుర్రాల ఛేజింగ్ లతో సస్పెన్స్ థ్రిల్లర్లతో సాగే కౌబాయ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకాన్ని పెంచింది. తర్వాత మహేష్ బాబు టక్కరిదొంగ పేరుతో వచ్చిన కౌబాయ్ సినిమాతో మెప్పించారు.
ఆ సినిమాలు కూడా ఈనెలలోనే రీరిలీజ్
ఇదే నెలలో నవంబర్ 22న కార్తీ నటించిన ‘ఆవారా’ మూవీ, నవంబర్ 28న సూర్య నటించిన ‘సికందర్’, 29న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘బిజినెస్ మెన్’ మూవీ రిలీజ్ కానుండటం విశేషం.
