Crime news : ఎప్పుడూ అల్లరి చేస్తూ పిల్లలు తనకు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నారనే మనస్తాపంతో ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్నం నగరంలోని కొత్తపాలెంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు గోపాలపట్నం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్ రాష్ట్రానికి చెందిన చందన్‌కుమార్ (33) రైల్వేలో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్‌గా పనిచేస్తున్నారు. ఐదేళ్ల నుంచి విశాఖపట్నం 89వ వార్డు అయిన కొత్తపాలెం ఏరియాలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి కుమార్తె (7), కుమారుడు (5) ఆడుకుంటూ చందన్‌కుమార్ చొక్కా జేబులోని కరెన్సీ నోట్లను చించిపారేశారు.
దాంతో చందన్‌కుమార్ పిల్లలపై చిరాకు పడ్డారు. పిల్లలకు పూర్తిగా హద్దు లేకుండా పోతోందని చీవాట్లు పెట్టాడు. ఈ క్రమంలో చందన్‌కుమార్‌కు భార్య అడ్డు తగిలింది. ఎప్పుడూ పిల్లలపై చిరాకుపడుతావని వాదనకు దిగింది. దాంతో అందరూ కలిసి తనకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారని, తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ చందన్‌కుమార్ గదిలో వెళ్లాడు.
కానీ చందన్‌కుమార్ బెదిరింపును ఆయన భార్యగానీ, పిల్లలుగానీ పట్టించుకోలేదు. కానీ చందన్‌కుమార్ గదిలోని సీలింగ్ ఫ్యాన్ హుక్‌కు భార్య చీరతో ఉరేసుకున్నాడు. అలికిడి విన్న భార్య పరుగున వెళ్లేసరికే చందన్ మెడకు ఉరి బిగుసుకుంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్తను కాపాడేందుకు భార్య ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను నమోదు చేశారు. ఘటనా ప్రాంతంలో ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు.