విధాత, నల్లగొండ: సెల్ఫీ మోజులో, మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు నాగార్జునసాగర్ కొత్త బ్రిడ్జిపై నుంచి నదిలో పడ్డాడు. ఈ ఘటన 4వ తారీకు (సోమవారం) రాత్రి 8 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలానికి చెందిన నలుగురు యువకులు నాగార్జునసాగర్‌ను చూసేందుకు వచ్చారు.
అప్పటికే మద్యం మత్తులో ఉన్న మంతాని శివ(24) బ్రిడ్జిపైకి ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. స్థానికులు వారిస్తున్నా లెక్కచేయకుండా బ్రిడ్జి గోడమీదకు ఎక్కి సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన నాగార్జునాసాగర్ పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకుడి ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరౌతున్నారు.