Site icon vidhaatha

Nagarjuna Sagar | సాగర ఘోష: సాగర్‌ దరి చేరని కృష్ణమ్మ.. ఆయకట్టు పంటల సాగు ప్రశ్నార్ధకం

Nagarjuna Sagar |

విధాత: ముందుమురిపించిన వరుణుడు తీరా అక్కర సమయానికి జాడ లేకపోవడంతో కృష్ణా పరివాహకంలో భారీ వర్షాలు, వరదలు కరువై శ్రీశైలం, నాగార్జున సాగర్‌లు కనిష్ట మట్టాలకు చేరుతుండగా, ఆయకట్టులో పంటల సాగు ప్రశ్నార్ధకమవుతుంది. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా భావించే నాగార్జున సాగర్‌ జలాశయంలో నీటి నిల్వలు లేక కుడి, ఎడమ కాలువల ఆయకట్టులో వర్షాకాలం పంటల సాగు ప్రశ్నార్ధకంగా మారింది.

సాధారణంగా ఆగస్టు నెలలో సాగర్‌ ప్రాజెక్టుకు కృష్ణ వేణి వరద పొటెత్తనుండగా, ఆయకట్టుకు సాగునీటి విడుదల జరిగేది. ప్రస్తుత వర్షాకాలం ఆగస్టు మాసాంతానికి చేరుకున్నప్పటికి నేటి కృష్ణమ్మ పరవళ్లు కరువవ్వడంతో సాగర్‌ ప్రాజెక్టులో నీటి మట్టం 590అడుగులకుగాను 520.40అడుగులకు పడిపోయింది. 312టీఎంసీలకుగాను 150టీఎంసీలుగా ఉంది. మరో పది అడుగులు తగ్గితే కనీస నీటి మట్టం 510అడుగుల డెడ్‌ స్టోరేజీకి చేరనుంది.

అందుబాటులో ఉన్న పది అడుగులు కూడా తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు వినియోగించ నున్నారు. దీంతో త్వరలోనే డెడ్‌ స్టోరేజీకి సాగర్‌ నీటి మట్టం చేరవచ్చు. సాగర్‌ ప్రాజెక్టు కింద తెలుగు రాష్ట్రాల్లో 5 జిల్లాల్లో మొత్తం 22,35,910 ఎకరాల ఆయకట్టు ఉండగా, ఎడమకాలువ పరిధిలోని ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో 5.50లక్షల ఎకరాల సాగవుతుంది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో 3.50లక్షలు సాగవుతుంది.

సాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ ప్రాజెక్టుల నుండి వరద నీటి రాకపోవడంతో ఆయకట్టు వర్షాకాలం పంటల సాగు ప్రశ్నార్ధకమైంది. మరోవైపు రాష్ట్రంలో గోదావరి నది పరివాహకంలోని ప్రాజెక్టులన్ని ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టంతో కళకళలాడుతుండగా, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి రేపో ఎల్లుండో గేట్లు ఎత్తేందుకు సిద్ధమవుతున్నారు.

కృష్ణా ఎగువన కరువైన వర్షాలు

ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలలోనూ వర్షాలు లేకపోవడంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు కూడా తగినంత వరద చేరడం లేదు. ఫ్రస్తుతం ఎగువన అల్మట్టికి 1000క్యూసెక్కులు చేరుతుండగా, నారాయణపూర్‌ ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం లేదు. జూరాలలో 3వేల క్యూసెక్కులు, తుంగభద్రలో 600క్యూసెక్కులు చేరుతుండగా శ్రీశైలానికి వరద ప్రవాహం మాత్రం లేదు.

శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 215.807టీఎంసీలుగా కాగా , ప్రస్తుతం 107టీఎంసీలుగా ఉంది. జల విద్యుత్తు ఉత్పత్తి ద్వారా దిగువకు, పొతిరెడ్డిపాడు కాల్వలలకు నీటి విడుదల చేస్తుండగా, జలాశయంలో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్టం నీటి మట్టం చేరితేనే ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశముంది. అయితే కృష్ణా నది ఎగువన భారీ వర్షాలు పడకపోవడంతో శ్రీశైలం ఇప్పటికిప్పుడు నిండే పరిస్థితి కనిపించడం లేదు.

సాధారణంగా జూలైలోనే ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల, శ్రీశైలం నిండి తర్వాతా వచ్చే వరదలతో సాగర్‌ ప్రాజెక్టుకు నీటి విడుదల కొనసాగించడం జరుగుతుంది. ఈ సీజన్‌లో ఆగస్టు నెలంతా వర్షాభావంతో ఎగువన ప్రాజెక్టులకు వరదలు లేక సాగర్‌కు నీటి విడుదల కరువైంది. ప్రస్తుతం శ్రీశైలం జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ద్వారా సాగర్‌ ప్రాజెక్టుకు 8210క్యూసెక్కుల ఇన్‌ప్లోగా మాత్రమే వస్తుంది.

ఆందోళనలో ఆయకట్టు రైతాంగం

గత కొన్నేళ్లుగా ఆగస్టు నెలలో వచ్చే ఇన్‌ఫ్లోతో సాగర్‌ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటి విడుదల సాధ్యమైంది. ఈ వర్షాకాలంలో ఆగస్టు మాసంతం వచ్చినా అలాంటి పరిస్థితి లేకపోవడంతో 5.50లక్షల ఆయకట్టులో వానకాలం పంట సాగు ఆలస్యం కాకతప్పని దుస్థితి నెలకొంది. వరదలు వెనుకో ముందో వస్తాయన్న ఆశతో కొంతమంది భూగర్భ జల వసతులున్న రైతులు నాట్లు వేయగా, మరికొందరు వరినార్లు పోసుకుని సాగర్‌ ప్రాజెక్టు నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. వరినార్లు ముదిరిపోతుండటం రైతాంగంలో ఆందోళన కల్గిస్తుంది. వర్షాలు కరువై సాగర్‌కు ఎగువ నుంచి సకాలంలో వరద ఉదృతి రాకపోతే వేసిన వరినాట్లు, పోసిన నారుమడులు నష్టపోవాల్సివస్తుందన్న ఆందోళన రైతాంగంలో వ్యక్తమవుతుంది.

ఆలస్యంగానే సాగర్‌కు జలకళ

నాగార్జున సాగర్‌ ఆయకట్టుకు ఏటా జూన్‌ 15నుండి వానకాలం పంటకు నీటివిడుదల చేయాలి గెజిట్‌ చెబుతుంది. కొన్నేళ్లుగా మాత్రం ఆగస్టు, సెప్టెంబర్‌లలోనే నీటి విడుదల సాధ్యమవుతుంది. దీంతో ఆయకట్టు రైతులకు ఏటా నీటి విడుదల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.

గెజిట్‌ మేరకు ప్రజెక్టులో ప్రతి సంవత్సరం 530అడుగులు కనీస నీటి నిల్వ ఉంచాలని, వరదలు వచ్చేదాకా ఆ నీటిని పొదుపుగా వాడుకుంటు వరదలొచ్చాకా పంటలకు నీటిని విడుదల చేసుకోవాల్సివుంది. అయితే తెలుగు రాష్ట్రాలు మాత్రం ఈ నిబంధనలకు నీళ్లోదులుతు నీటి వినియోగం 510అడుగుల డెడ్‌ స్టోరేజీకి దాకా కొనసాగిస్తున్నారు.

నాగార్జున సాగర్‌కు నీటి విడుదల వివరాలు పరిశీలిస్తే గడిచిన కొన్నేళ్లలో ఆలస్యంగానే ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో నీటి విడుదల ప్రక్రియ సాగుతుంది. 2016లో ఆగస్టు 18న ఆయకట్టు కాలువలకు నీటి విడుదల చేశారు. 2017లో సెప్టెంబర్‌ 21న, 2018లో ఆగస్టు 22న, 2019లో ఆగస్టు 11న, 2020లో ఆగస్టు 24న , 2021లో ఆగస్టు 5న , 2022లో జూలై 28న కాలువలకు నీటి విడుదల చేశారు. ఈ ఏడాది కూడా ఇప్పటిదాకా కృష్ణానది ఎగువన భారీ వర్షాలు వరదలు తగినంత లేకపోవడంతో మరోసారి సాగర్‌ ఆయకట్టుకు సాగునీటి విడుదల ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తుంది.

సాగర్‌ ప్రాజెక్టులో నీటి కొరత నేపధ్యంలో సోమవారం కృష్ణా జలాల కేటాయింపులపై నిర్వహించిన రెండు రాష్ట్రాల త్రిసభ్య కమిటీ భేటీకి తెలంగాణ ఈఎన్‌సీ వాయిదా కోరుతూ గైర్హాజరయ్యారు. ఇప్పటికే ఏపి తమ రెండు నెలల తాగునీటి అవసరాల కోసం 25టీఎంసీలు, సాగునీటికి 5టీఎంసీలు కోరగా, తెలంగాణ కూడా తన నీటి అవసరాలను బోర్డుకు తెలుపాల్సివుండగా భేటీ వాయిదా కోరడం గమనార్హం.

విద్యుత్తు ఉత్పత్తికి నీటి విడుదల

నాగార్జున సాగర్‌ జలాశయం ప్రధాన జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ద్వారా గడిచిన నాలుగు నెలల్లో 179యూనిట్ల విద్యుత్తు ఉత్పాదన చేశారు. ప్రతి రోజు రాత్రి విద్యుత్తు ఉత్పత్తి చేస్తు ఆ నీటిని పగటి పూట తిరిగి రివర్స్‌బుల్‌ పంపింగ్‌ ద్వారా జలాశయంలోకి పంపిస్తున్నారు. మంగళవారం ఎస్‌ఎల్‌బీసీ(ఏఎమ్మార్పీ) తాగునీటి అవసరాలకు 900క్యూసెక్కులను అవుట్‌ ఫ్లోగా వదలగా, ఇన్‌ఫ్లో 8210క్యూసెక్కులుగా ఉంది.

Exit mobile version