Site icon vidhaatha

She Team । షీ టీమ్ మిమ్మల్ని గమనిస్తున్నది.. హైదరాబాద్‌ పోలీసుల వార్నింగ్‌! వీడియో వైరల్‌..

She Team । రోడ్లపై పోకిరీల ఆగడాలను అరికట్టేందుకు ఏర్పాటైంది షీ టీమ్‌. ఆపదలో ఉన్న ఆడపిల్లలకు అండగా నిలుస్తూ, అమ్మాయిలను ఇబ్బంది పెట్టే వాళ్ల భరతం పడుతున్నది. ఈ క్రమంలోనే మిమ్మల్ని షీ టీమ్‌ గమనిస్తున్నది.. అంటూ ఒక వీడియోను హైదరాబాద్ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారికి గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ఒక రద్దీ ప్రాంతంలో ఒక మహిళ శరీరాన్ని తాకుతూ ఒక యువకుడి వెకిలి చేష్టను రికార్డు చేసి.. ఆ వీడియోను రూపొందించారు. ఆ వీడియోకు పది లక్షల వ్యూస్‌ లభించినప్పటికీ.. సదరు వెకిలి చేష్టలు చేసిన యువకుడిపై  ఏమైనా చర్యలు తీసుకున్నారా? అనేది తెలియరాలేదు. ఈ క్లిప్‌ పోస్టు చేసిన పోలీసులు.. ‘రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో మీ ప్రవర్తనను షీటీమ్స్‌ రికార్డు చేస్తున్నాయి. మీరు జైలుకు వెళ్లకుండా మీ ఉద్దేశాలను తొలగించే ప్రయత్నమే ఇది’ అని రాశారు.


ఈ పోస్టింగ్‌పై పలువురు పలు రకాలుగా స్పందించారు. ఇటువంటి చర్యలకు పాల్పడినవారిపై ఫాలోఅప్‌ యాక్షన్స్‌ ఉండటం లేదని కొందరు వ్యాఖ్యానించారు. ‘దుష్ప్రవర్తనను రికార్డు చేయడం ఒక ఎత్తయితే.. అటువంటివారిని శిక్షించడం మరో ఎత్తు. వాస్తవికమైన ఈ సమస్యలలో ఎంతమందిని శిక్షించారు?’ అని ఒకరు ప్రశ్నించారు. ఇటువంటి వెకిలి చేష్టలకు పాల్పడేవారి ఫొటోలను బహిరంగంగా ప్రదర్శించాలి. వారు సిగ్గుపడేలా చేయాలి’ అని ఒకరు స్పందించారు. ఇటువంటివారికి తగిన గుణపాఠం చెప్పాలని మరో యూజర్‌ వ్యాఖ్యానించారు. పోలీసులు రికార్డు చేయడాన్ని ప్రస్తావించి ఒక యూజర్‌.. ఇటువంటి సమయంలో వెంటనే జోక్యం చేసుకుని అడ్డుకోకుండా రికార్డు చేయడమేంటని ప్రశ్నించారు. హైదరాబాద్ పోలీసులు  షేర్‌ చేసిన వీడియో నగరంలో ప్రజా భద్రతతోపాటు పర్యవేక్షణ, శిక్ష పై భారీ చర్చనే లేవదీసింది. ఇటువంటి ఘటనల్లో వెంటనే నిందితులను పట్టుకుని శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

Exit mobile version