Site icon vidhaatha

Bhadrapada Masam | నేటి నుంచి భాద్ర‌ప‌ద మాసం ప్రారంభం.. ఈ మాసంలో వ‌చ్చే పండుగ‌లు ఇవే..!

Bhadrapada Masam | మూడు రోజుల క్రితం వ‌ర‌కు శ్రావ‌ణ‌మాసం( Shravana Masam ) కొన‌సాగింది. ఈ శ్రావ‌ణ‌మాసంలో ప్ర‌తి ఇల్లు ల‌క్ష్మీదేవి( Lakshmi Devi ) పూజ‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడింది. శ్రావ‌ణ శుక్ర‌వారాలు.. వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాల‌తో సంద‌డిగా మారాయి. ఇక నేటి(సెప్టెంబ‌ర్ 4) నుంచి భాద్ర‌ప‌ద మాసం( Bhadrapada Masam )ప్రారంభ‌మైంది. ఈ భాద్ర‌ప‌ద మాసంలో ప్ర‌ధానంగా వినాయ‌క చ‌వితి( Vinayaka Chavithi ) వ‌స్తుంది. వినాయ‌క చ‌వితితో పాటు మ‌రిన్ని పండుగ‌లు రానున్నాయి. ఈ పండుగ‌ల జాబితా ఏంటో తెలుసుకుందాం..

సెప్టెంబ‌ర్ 7 – వినాయ‌క చ‌వితి

ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 7వ తేదీన వినాయ‌క చ‌వితి జ‌రుపుకోనున్నారు. ఇక గల్లీకో గ‌ణేశుడు కొలువుదీర‌నున్నారు. చాలా మంది భ‌క్తులు త‌మ ఇండ్ల‌లోనూ వినాయ‌కుడి విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించి ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌నున్నారు. ప్రకృతిలో దొరికే ఆకులు, పండ్లుతో పార్వతీ తనయుడిని పూజించి ఆశీస్సులు అందుకుంటారు. కుడుములు, ఉండ్రాళ్లు , వివిధ పిండివంటలు నైవేద్యంగా సమర్పిస్తారు.

సెప్టెంబ‌ర్ 8 – రుషి పంచ‌మి

సెప్టెంబ‌ర్ 8వ తేదీన రుషి పంచ‌మి జ‌రుపుకోనున్నారు. రుషుల‌ను స్మ‌రించుకోవ‌డ‌మే ఆ రోజు చేయాల్సిన ప‌ని. ఆ రోజు వేకువజామునే స్నానమాచరించి వినాయకపూజ చేసిన తర్వాత గురువులను పూజిస్తే దేవతల అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. రుషి పంచ‌మి ప‌ర్వ‌దినం నాడు ప్రదోష కాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే అన్నీ మంచిఫలితాలే పొందుతారు

సెప్టెంబరు 14 – పరివర్తన ఏకాదశి

ఏడాదిలో వచ్చే 24 ఏకాదశిలకు ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు ఒక్కో విశిష్టత ఉంటుంది. భాద్రపదమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. ఈ రోజు శ్రీమహావిష్ణువును లక్ష్మీసమేతంగా పూజిస్తే తెలిసో తెలియకో చేసిన పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం.

సెప్టెంబరు 17 – అనంత చతుర్దశి

ఈ రోజుతో వినాయక నవరాత్రులు ముగుస్తాయి. వాడవాడలా కొలువుతీరిన గణేషుడు గంగమ్మ ఒడికి తరలివెళ్లేరోజు అనంత చతుర్ద‌శి.

సెప్టెంబరు 21 – సంకటహర చతుర్థి భాద్రపద బహుళ చవితి

అమావాస్య ముందు వచ్చే చవితి రోజు సంకటహర చతుర్థి వ్రతం చేస్తారు. వివాహం, సంతానం, విద్య, ఉద్యోగం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమస్యలు తొలగించే వ్రతం ఇది. చతుర్థి తిథి సూర్యాస్తయమ సమయానికి ఉండేలా చూసుకోవాలి.

Exit mobile version