Vastu Tips | కొంత మంది తమ ఇంటి పైకప్పును చాలా శుభ్రంగా ఉంచుకుంటారు. ఉదయం, సాయంత్రం వేళ వాకింగ్ చేస్తూ సేద తీరుతుంటారు. పూల మొక్కలను పెంచుతుంటారు. ఆహ్లాదంగా ఉండేలా ఆ ప్రాంతాన్ని తయారు చేసుకుంటారు. మరికొందరైతే పైకప్పును ఏ మాత్రం పరిశుభ్రంగా ఉంచుకోరు. విచ్చలవిడిగా ఏవేవో వస్తువులు పడేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు. మరి ముఖ్యంగా పాత ఇనుప సామాన్లు, విరిగిపోయిన కుర్చీల వంటి వాటిని పైకప్పుపై ఉంచడం వల్ల ఆ ఇంట్లో కూడబెట్టిన సంపదంతా ఆవిరైపోతుందని హెచ్చరిస్తున్నారు. మరి ఎలాంటి నిబంధనలు పాటించాలో తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి పైకప్పును పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పనికిరాని వస్తువులను ఉంచకూడదు. పగిలిపోయిన పాత్రనలు, పనికిరాని వస్తువులను, విరిగిపోయిన కుర్చీలను ఉంచరాదు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగి వాస్తు దోషాలకు కారణమవుతుంది. అంతేకాకుండా ఆ ఇంట సుఖశాంతులు లోపించి, వివాదాలకు కేంద్ర బిందువుగా తయారవుతుంది.
అలాగే మొక్కలు ఇంటికి అందాన్ని, ఆహ్లాదాన్ని తీసుకువస్తాయి. అయితే ముళ్లతో ఉండే మొక్కలను పైకప్పుపై లేదా ఇంటి లోపల ఉంచడం వాస్తు ప్రకారం అశుభంగా భావిస్తారు. ఇవి కుటుంబంలో ఉద్రిక్తతలు, ప్రతికూలతను పెంచుతాయని అంటారు.
శుభ్రంగా, అందంగా, ఖాళీగా ఉన్న పైకప్పు ఇంట్లో సానుకూల శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి ఆ ఇంట వరాలు కురిపిస్తుందని వాస్తు శాస్త్రం సూచిస్తోంది.
