Vinayaka Chavithi | విఘ్నాలకు తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి( Vinayaka Chavithi ). ఈ వినాయక చవితిని ప్రతి సంవత్సరం భాద్రపద మాసం( Bhadrapada Masam ) శుక్లపక్ష చవితి రోజున జరుపుకుంటారు. లంబోదరుడి కృప ఉంటే అన్నీ విజయాలే వరిస్తాయనే నమ్మకం భక్తుల్లో ఉంది. కాబట్టి ఏ శుభకార్యం ప్రారంభించినా.. తొలి పూజ విఘ్నేశ్వరుడితో ఆరంభిస్తారు. మరి ఈ ఏడాది వినాయక చవితి రోజున ఏ సమయంలో పూజించాలి..? ఏ రంగు వస్త్రాలు ధరించాలి..? ఎలాంటి దీపం పెట్టాలి అనే విషయాలు తెలుసుకుందాం.
ఏ సమయంలో వినాయకుడి పూజ చేయాలి..?
సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితిని జరుపుకోవాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇక వినాయక చవితి రోజున ఉదయం 11.03 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పూజలు చేస్తే మంచిది. ఈ సమయంలో వీలుకాకపోతే సాయంత్రం 6:22 గంటల నుంచి రాత్రి 7:30 గంటల మధ్యలో వరసిద్ధి వినాయక వ్రత కల్పం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఈ రెండు సమయాల్లో విగ్రహాన్ని ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు చేయడం వల్ల అన్నీ శుభాలే జరుగుతాయని పండితులు చెబుతున్నారు.
ఏ రంగు వస్త్రాలు ధరిస్తే మంచిది..?
గణేశుడికి ఎరుపు రంగు వస్త్రాలంటే ఎంతో ఇష్టం కాబట్టి.. వినాయక చవితి రోజున ఆ రంగు వస్త్రాలు ధరిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది వినాయక చవితి శనివారం రోజున వచ్చింది కాబట్టి.. శనివారానికి అధిపతి శనేశ్వరుడు కాబట్టి.. ఆయనకు ఇష్టమైన నీలం రంగు దుస్తులు ధరించినా మంచిదని చెబుతున్నారు. కాబట్టి పండగ నాడు ఎరుపు లేదా నీలం రంగు వస్త్రాలు ధరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని అంటున్నారు.
ఎలాంటి దీపం వెలిగిస్తే మంచిది..?
వినాయక చవితి రోజున జిల్లేడు ఒత్తుల దీపం వెలిగిస్తే మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ప్రమిదలో కొబ్బరినూనె పోసి ఐదు జిల్లేడు ఒత్తులు విడిగా వేసి దీపం పెడితే వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందట. అలాగే పండగ నాడు 21 పత్రాలతో గణపతిని పూజించడం వీలుకాని వారు.. దుర్వాయుగ్మం అంటే గరిక పోచల జంటను వినాయకుడికి సమర్పిస్తే 21 ప్రతాలతో ఆయనను పూజించిన ఫలితం కలుగుతుందని అంటున్నారు.