విధాత : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం విష్వక్సేన ఆరాధన, ద్వజారోహణ ఘట్టాలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఉదయం పుణ్యాహవాచనం, యాగశాల ప్రవేశం, చతుస్థానార్చన, అగ్ని ప్రతిష్ఠ, ద్వారతోరణ ధ్వజకుంభ ఆరాధన, మూర్తి కుంభారాధన,నిత్యహోమాలు, పూర్ణాహుతి, (శేషవాహన సేవ) నిర్శహించారు. అనంతరం ధ్వజారోహణం (గరుడముద్దలు) ఘట్టాలను నిర్వహించిన అర్చక బృందం బలిహరణం, నివేదన, తీర్ధప్రసాద గోష్టి నిర్వహించింది.
తదుపరి పాలకుర్తి కళాకారులచే ఒగ్గుడోలు, బోనాలకోలాటం కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీ స్వయంభూ స్వామివారికి నవకలశ స్నపనం, హనుమత్ వాహన సేవ నిర్వహిస్తారు. సోమవారం ఉదయం లక్ష్మినరసింహుల ఎదుర్కోలు, లక్ష్మినరసింహుల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవ వేడుకల్లో దేవస్థానం చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ కుమార్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి సల్వాది మోహన్ బాబు, ధర్మకర్తలు కొడితాల కరుణాకర్, బండి రవికుమార్, ఈతాప రాములు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
