Mangli | సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. మోసం, బెదిరింపుల ఆరోపణలు!

Mangli | తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ గాయని మంగ్లీపై కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఆమెతో పాటు సోదరుడు శివపై కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు సమాచారం

Mangli | తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ గాయని మంగ్లీపై కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఆమెతో పాటు సోదరుడు శివపై కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు సమాచారం.

ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. తనను మోసం చేశారని, అలాగే ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ న్యాయవాది సుబ్బారావు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మంగ్లీ, ఆమె సోదరుడు శివతో పాటు మరో ముగ్గురిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 351(2), 352 కింద కేసులు నమోదు చేశారు.

డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు..

పోలీసుల వివరాల ప్రకారం, మంగ్లీ, ఆమె సోదరుడు మరియు ఇతరులు కలిసి సుమారు 100 మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పి ఈ నిధులను సేకరించినట్లు తెలుస్తోంది. అయితే కాలం గడిచినా పెట్టుబడిదారులకు లాభాలు ఇవ్వకపోగా, అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే మంగ్లీ, ఆమె సోదరుడు ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారని కూడా ఆరోపణలు వచ్చాయి. తనను యాక్సిడెంట్ చేసి చంపేస్తామని బెదిరించారని సుబ్బారావు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ రక్షణ కల్పించాలని కోరారు.

హాట్ టాపిక్ గా మంగ్లీ కేసు..

ఈ కేసులో మంగ్లీని ఏ5 నిందితురాలిగా చేర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  ఫోక్ సాంగ్స్‌తో ప్రజాదరణ పొందిన గాయని మంగ్లీపై వచ్చిన ఈ ఆరోపణలు ఇప్పుడు సినీ, సంగీత వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేసు దర్యాప్తులో నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే మంగ్లీ రీసెంట్ గా ఆటోడ్రైవర్ తో సెల్ఫీ దిగి అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఆటొో డ్రైవర్ తనకు పెద్ద ఫ్యాన్ అని తెలుసుకొని మంగ్లీ సంతోషం వ్యక్తం చేసింది. ఆటొో వ్యక్తి తన ఆటోకి మంగ్లీ ఎక్స్ ప్రెస్ అని పేరు పెట్టుకోవడం విశేషం.

Latest News