Tamanna Simhadri | తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు, ముఖ్యంగా బిగ్‌బాస్ అభిమానులకు సుపరిచితురాలైన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా పబ్లిక్‌లో పెద్దగా కనిపించని ఆమె, వరుసగా రెండు సంచలన విషయాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ముందుగా తనకు వివాహమై ఏడాది పూర్తయిందని ప్రకటించి భర్త ఫోటోను రివీల్ చేసిన ఆమె… ఇప్పుడు తాను గర్భవతినని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తాజాగా తమన్నా సింహాద్రి తన సోషల్ మీడియా ఖాతాలో బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించారు. ఈ ఫోటోలు క్షణాల్లోనే వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ఆమె, ప్రత్యేక వైద్య చికిత్స ద్వారా తాను గర్భం దాల్చినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటనపై నెటిజన్లలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతుండగా, మరికొందరు ఇది నిజమా? లేక పబ్లిసిటీ స్టంట్‌నా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
బిగ్ బాస్‌తో గుర్తింపు..
తమన్నా సింహాద్రి వ్యక్తిగత ప్రయాణం కూడా ఎంతో ఆసక్తికరం. విజయవాడకు చెందిన ఆమె, అబ్బాయిగా జన్మించినప్పుడు మస్తాన్ అనే పేరుతో జీవించారు. చిన్ననాటి నుంచే తనలో ఉన్న భిన్నమైన భావాలను గుర్తించిన ఆమె, పెద్దయ్యాక ముంబైకి వెళ్లి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం తమన్నా సింహాద్రిగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
ఆమెకు విస్తృత గుర్తింపు తెచ్చింది బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి వెళ్లిన తమన్నా, తన స్పష్టమైన మాటతీరు, ధైర్యమైన వ్యక్తిత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా యాంకర్ శ్రీముఖితో ఉన్న స్నేహం అప్పట్లో హైలైట్‌గా నిలిచింది.
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ..
వినోదరంగంతో పాటు రాజకీయాల్లో కూడా తమన్నా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2019లో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్‌పై, 2024లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ ఆమె తన సామాజిక కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.
ఇక ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీ ప్రకటన పెద్ద చర్చకు దారితీసింది. వైద్యపరంగా ట్రాన్స్‌జెండర్ మహిళలు సహజంగా గర్భం దాల్చడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో… తమన్నా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆమె చెప్పిన “ప్రత్యేక చికిత్స” ఏమిటి? అనే దానిపై కూడా ఆసక్తి పెరిగింది.
మరోవైపు, ఇది కేవలం ఫోటోషూట్ లేదా ఏదైనా అవగాహన కార్యక్రమం భాగమా? అనే కోణంలో కూడా చర్చలు సాగుతున్నాయి. ఈ అంశంపై తమన్నా మరింత క్లారిటీ ఇస్తారా? లేక ఇది సస్పెన్స్‌గా మిగిలిపోతుందా? అనేది చూడాలి.
