Spicy Chicken Curry | నాన్ వెజ్( Non Veg )లో చికెన్( Chicken ) అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే చికెన్ తక్కువ ధరకే లభిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే.. నిమిషాల వ్యవధిలో చికెన్ కర్రీని( Chicken Curry ) చేయొచ్చు. అంతేకాదు.. ఎన్నో రకాలుగా చికెన్‌ను వండుకోవచ్చు. అంటే కర్రీ, ఫ్రై, మాసాల, గ్రేవీ స్టైల్లో చికెన్‌ను వండుకొని ఆరగించొచ్చు. అయితే చికెన్‌లో ఎన్ని వెరైటీలు ఉన్నా.. పల్లెటూరి స్టైల్లో స్పైసీ చికెన్ కర్రీ( Spicy Chicken Curry ) మాత్రం ఒక్కసారైనా తిని తీరాల్సిందే. ఎందుకంటే.. ఈ స్టైల్ చికెన్ కర్రీ టెస్ట్ అదిరిపోతుంది. సింపుల్‌గా ఎవ్వరైనా క్షణాల్లో తయారు చేసుకోవచ్చు. పల్లెటూరి స్పైసీ చికెన్ కర్రీని చపాతీలతో పాటు అన్నంలో కూడా తినొచ్చు.
స్పైసీ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇవే..
చికెన్ – కిలో
టమోటాలు – 2
ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి – 5
నూనె – తగినంత
ఉప్పు – రుచికి తగినంత
కారం – రుచికి సరిపడా
పసుపు – పావు టీస్పూన్
ధనియాల పొడి – ఒక టేబుల్‌స్పూన్
గరం మసాలా మసాలా – టీస్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్‌స్పూన్
కొత్తిమీర తరుగు – కొద్దిగా
పల్లెటూరి స్పైసీ చికెన్ కర్రీ తయారీ ఇలా..
పరిశుభ్రమైన నీటితో చికెన్‌ను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత చికెన్‌కు నీరు పోయేలా.. ఒక జాలి గిన్నెలో వేసి ఉంచాలి. ఆ తర్వాత ఒక పాత్రలోకి చికెన్‌ను తీసుకొని, దానికి అర టీ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా నూనె వేసి మిక్స్ చేయాలి. ఇక స్టవ్ వెలిగించి.. మరో పాత్రలో తగినంత నూనె వేసి వేడి చేయాలి. ఈ నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బంగారు వర్ణంలోకి వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేయాలి.. ఆపై టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత సన్నగ తరిగిన టమోటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
ఆపై రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేయండి. ఈ స్టేజ్‌లోనే కర్రీలో గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి మూతపెట్టి కర్రీలో ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. కూర అడుగుపట్టేయకుండా మధ్యమధ్యలో మూత తీసి గరిటెతో మిక్స్ చేసుకోవాలి. కూర చక్కగా ఉడికి, ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి వేసి ఒకసారి కలపాలి. చివరిగా కాస్త కొత్తిమీర తరుగు చల్లి కలిపి రెండునిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. ఇక ఇప్పుడు పల్లెటూరి స్టైల్ స్పైసీ కర్రీ రెడీ.. ఇంకెందుకు ఆలస్యం.. లొట్టలేసుకుంటూ తినేయండి..