రక్తపోటు ఎక్కువైనా, తక్కువైనా అది నిర్లక్ష్యం చేయాల్సిన విషయం కాదు. సాధారణంగా రక్తం తక్కువగా ఉన్నవాళ్లలో బీపీ తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు దీని వెనుక వేరే సమస్యలు కూడా ఉండవచ్చు. అందుకే డాక్టర్ సూచన మేరకు బీపీ తక్కువ ఉన్నా జాగ్రత్తపడాలి. లో బీపీ లేదా హైపోటెన్షన్ రక్తప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. అయితే ఆహారంలో మార్పు చేర్పులతో దీన్ని సరిచేయడం సులువే. ఒక వారం రోజుల పాటు సక్రమమైన ఆహారాన్ని తీసుకుంటే తగ్గిన బీపీని నార్మల్ చేయవచ్చంటున్నారు నిపుణులు.
ప్రతిరోజూ రెండు సార్లు ఒక్కో కప్పు పచ్చి బీట్ రూట్ రసం తాగితే రక్తం, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా బీపీ నార్మల్ అవుతుంది. దానిమ్మ రసం కూడా రక్తప్రసరణను సరిచేయడంలో బాగా పనిచేస్తుంది.
ఇక మన రోజువారీ జీవనవిధానంలో తాజా పండ్లు లేకపోతే రక్తప్రసరణ మాత్రమే కాదు, అన్ని వ్యవస్థలకూ దెబ్బే. అందుకే రోజూ పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి. వీటివల్ల లో బీపీ నార్మల్ కావడంతో పాటు శరీరం కొత్త శక్తిని సంతరించుకుంటుంది. ప్రతిరోజూ మూడు సార్లు తాజా పండ్లను తీసుకోవాలి. ఒక మూడు వారాలు ఇలా పండ్లతో పాటు పాలు తీసుకుని, ఆ తర్వాత పండ్లను కొంతవరకు తగ్గించి, చిరుధాన్యాలు, పచ్చి కూరగాయలు, గింజల వంటివి చేర్చాలి. ఇలా 3 నెలలకు ఒకసారి 3 వారాలు ఒక డైట్ గా పాటిస్తే లో బీపీ సమస్య తగ్గి, రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
అధిక రక్తపోటా.. అల్లం తీసుకోండి
హైబీపీ కి మందులు వాడాలన్న బాధ పోవాలంటే వంటగదిలోనే ఉండే అల్లం దారి చూపుతుంది. ప్రతిరోజూ 4 గ్రాముల అల్లం ముక్కను నోట్లో వేసుకుని నమిలి తినండి. క్రమంగా బీపీ కంట్రోల్ లోకి రావడం ఖాయమంటున్నారు నైజీరియాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇలోరిన్ శాస్త్రవేత్తలు. అంతేకాదు, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు, రక్తంలో చక్కెర కూడా తగ్గిపోతాయనే హామీ ఇస్తున్నారు. ఇటీవల అల్లం పైన రకరకాల ప్రయోగాలు చేసి, అల్లం.. అమృతమని చెప్తున్నారు. అల్లంలో ఉండే రసాయనాలు హై బీపీని నియంత్రించడంలో తోడ్పడుతాయంటున్నారు. అంతేకాదు, దీంట్లో ఉండే నూనె పదార్థాలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫినాల్ సంయోగ పదార్థాలు అధిక రక్తపోటు నియంత్రణలో ఉండటానికి సహకరిస్తాయని వివరిస్తున్నారు. అయితే అల్లం.. బీపీ మందులకు ప్రత్యామ్నాయం కాదు. క్రమంగా బీపీ మందుల మోతాదు తగ్గించుకోవడానికి ఉపయోగపవచ్చేమో గానీ, అల్లం తింటూ మందులు మానేద్దామనే సొంత నిర్ణయం మాత్రం తీసుకోకండి. ఎప్పటికప్పుడు బీపీ పరీక్షలు చేయించుకుంటూ, అది కంట్రోల్ లో ఉన్నదాన్ని బట్టి డాక్టర్ల సూచనల మేరకు నడచుకోవడం మంచిది.
Read more:
మసాలాలు కాదు.. వానాకాలపు ఔషధాలు!
Brain Health | 40 ఏళ్ల తర్వాత కూడా బ్రెయిన్ యంగ్ గా ఉండాలంటే..