విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోని నిర్మాణంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్కు పనులను ఆకస్మికంగా పరిశీలించారు. వివాహ వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా పార్కు వద్ద ఆగి పనులను గమనించారు. గతంలో కబ్జాకు గురికాకుండా పార్కు నిర్మించాలని ఆదేశించిన సీఎం, తుది దశకు చేరుకున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్కులో పనిచేస్తున్న కూలీలను ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఒక వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో ఇదే నియోజకవర్గంలోని పార్కులను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నియోజవర్గంలో ప్రభుత్వ పరంగా చేయాల్సిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, అతని విజయం కోసం ప్రచారం చేస్తున్న మంత్రులు సైతం నియోజకవర్గం ప్రజా సమస్యల పరిష్కారం దిశగా హామీలు గుప్పిస్తూ ముందుకెలుతున్నారు.
