విధాత : హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈనెల 19న నిర్వహించనున్న సదర్ సమ్మేళనానికి హాజరుకావాలని శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించింది. కమిటీ సభ్యులు రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు. యాదవ సాంప్రదాయాలతో సన్మానించారు. ఏటా నగరంలో దీపావళికి సదర్ ఉత్సవ సమ్మేళనం యాదవ సంఘాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సదర్ పండుగకు దాదాపు 70 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్ర పండుగల్లో ఒకటిగా సదర్ పండుగకు రాష్ట్ర పండుగ హోదాను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది జీవో జారీ చేసింది.
దేశంలోని ప్రసిద్ది గాంచిన భారీ దున్నరాజుల విన్యాసాలతో కొనసాగే సదర్ ఉత్సవాలు హైదరాబాద్ నగర విభిన్న సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తుంది. ప్రత్యేక పోషణ, శిక్షణతో పెంచిన కోట్ల విలువ చేసే దున్నపోతులు నగరంలోని సదర్ ఉత్సవాల్లో సందర్శకులను అలరిస్తుంటాయి. యాదవులు దున్నపోతులతో కుస్తీ పడుతూ విన్యాసాలు, డ్యాన్సులు చేయిస్తారు. ఇది సదర్కు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. తీన్మార్ డ్యాన్స్ లతో ఫుల్ జోష్ లో ఉత్సహంగా సదర్ పండుగ సాగుతుంది.