జీహెచ్ఎంసీ స్కెచ్… చార్మినార్ లో కేటీఆర్ పర్యటన !

జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా కేటీఆర్ పాతబస్తీలో పర్యటించారు. చార్మినార్ సమీపంలోని నిమ్రా కేఫ్‌లో ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు రుచి చూసి స్థానికులతో మమేకమయ్యారు.

రాబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహాల్లో మిగతా పార్టీల కంటే ముందున్న బీఆర్ఎస్ పార్టీ వరుసగా నియోజకవర్గాలు, డివిజన్ల వారిగా సమావేశాలు నిర్వహిస్తూ కేడర్ ను ఎన్నికలకు సంసిద్దం చేస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, నాయకులు అంతా కూడా డివిజన్ల వారి సమావేశాల నిర్వహణలో ఎన్నికల సన్నాహాలలో వేగం పెంచారు. ఇదే క్రమంలో తాజాగా కేటీఆర్ హైదరాబాద్ పాతబస్తీలో పర్యటించి సందడి చేశారు.

పాతబస్తీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్ చార్మినార్‌కు ఆనుకుని ఉండే ప్రసిద్ధ ‘నిమ్రా కేఫ్ అండ్ బేకరీ’ని గురువారం సందర్శించారు.పాతబస్తీ సంస్కృతికి అద్దం పట్టే ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లను కేటీఆర్ రుచి చూశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందిస్తూ.. “హైదరాబాద్ పాతబస్తీకి వెళ్లినప్పుడు అక్కడి ఇరానీ చాయ్ తాగకపోతే ఆ పర్యటనకు సంపూర్ణత్వమే ఉండదు. చార్మినార్ పక్కనే ఉన్న ప్రముఖ నిమ్రా కేఫ్‌ను సందర్శించి, ఇక్కడి రుచికరమైన ఉస్మానియా బిస్కెట్లు, ఇరానీ చాయ్‌ని ఆస్వాదించాను” అని పేర్కొన్నారు.

కేఫ్ సందర్శనకు వచ్చిన కేటీఆర్‌కు నిమ్రా బేకరీ అధినేత, యువ పారిశ్రామికవేత్త అస్లాం బిన్ అబూద్ సాదర స్వాగతం పలికారు. తమకు ఎంతో ఆప్యాయంగా ఆతిథ్యం ఇచ్చినందుకు అస్లాం బిన్ అబూద్‌తో పాటు కేఫ్ సిబ్బంది అందరికీ కేటీఆర్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కేటీఆర్ పాతబస్తీ రాకతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.

Latest News