అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ అమీర్‌పేట మైత్రీవనం వద్ద కేఎస్ఆర్ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

హైదరాబాద్ అమీర్ పేట మైత్రి వనం వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తొలుత ఓ బొమ్మల షాపులో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న కేఎస్ఆర్ షాపింగ్ మాల్స్ కు విస్తరించాయి. కేఎస్ఆర్ షాపింగ్ మాల్ రెండో అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతూ మాల్ అంతట మంటలు విస్తరిస్తున్నాయి. అక్కడి నుంచి పక్కన ఉన్న దుకాణాలకు కూడా మంటలు విస్తరిస్తుండటంతో వ్యాపారులు తీవ్ర ఆందోళనలో పడిపోయారు.

మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది

కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలతో అమీర్ పేట మైత్రీవనం ప్రాంతంలో దట్టమైన పొగ ఆవరించింది. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం అవస్థలు పడుతున్నారు. కేఎస్ఆర్ ఫ్యాషన్స్ షాపింగ్ మాల్ లో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అదనపు వాటర్ ట్యాంకర్లను రప్పిస్తున్నారు.

ట్రాఫిక్ అలర్ట్!

అమీర్‌పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కెఎస్సార్ ఫ్యాషన్స్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో ట్రాఫిక్ డైవర్షన్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు.  అత్యవసర సహాయక చర్యల కారణంగా, అమీర్‌పేట నుండి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. విధుల్లో ఉన్న ట్రాఫిక్, అత్యవసర సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాం అని తెిలిపారు.

మైత్రివనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 13 షటర్లు పూర్తిగా దగ్ధమవడంతో సుమారు రూ.2.5 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న హోటల్ నుంచి వచ్చిన మంటలే ఈ ప్రమాదానికి కారణమని వారు ఆరోపించారు. ఆ హోటల్‌పై గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యం వల్లే తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని బాధితులు వాపోయారు.

Latest News