తెలంగాణకు ఎబోలా వైరస్..?

సూడాన్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుడికి ఎబోలా వైరస్ హిస్టరీ ఉన్నట్లు గుర్తించారు. అతడిని గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ కేంద్రానికి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ప్రపంచ దేశాలను భయపెడుతున్న ఎబోలా వైరస్ భారత్ ను సైతం కలవర పెడుతుంది. తాజాగా తెలంగాణలోని హైదరాబాద్ శంషాబాద్ ఏయిర్ పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడికి ఎబోలా వైరస్ హిస్టరీ ఉండటం కలకలం రేపింది. సూడాన్‌ నుంచి వచ్చిన మహమ్మద్‌కు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఎయిర్‌పోర్టులో ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్త్ స్క్రీనింగ్‌ కేంద్రంలో పరీక్షలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో సదరు ప్రయాణికుడికి ఎబోలా వైరస్ హిస్టరీ (లక్షణాలు లేదా గత రికార్డులు) ఉన్నట్లు స్క్రీనింగ్ వైద్య సిబ్బంది ప్రాథమికంగా గుర్తించారు. దీంతో విమానాశ్రయ రక్షణ మరియు వైద్య సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే అతడిని అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.ఎబోలా వంటి ప్రమాదకర వైరస్‌లు ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకు గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అత్యవసర ఐసోలేషన్‌ సెంటర్‌ (Isolation Center) లో అతడిని ఉంచి చికిత్స అందిస్తున్నారు.

నిర్ధారణ పరీక్షల కోసం వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలను సీసీఎంబీకి పంపించారు. తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కానర్‌లో ఈ ప్రయాణికుడు పట్టుబడ్డాడు. సీసీఎంబీ నివేదిక వస్తేనే అతనికి ప్రస్తుతం ఎబోలా యాక్టివ్‌గా ఉందా లేదా అనేది స్పష్టమవుతుందని గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.

Latest News