ప్రపంచ దేశాలను భయపెడుతున్న ఎబోలా వైరస్ విదేశీ ప్రయాణికుల రూపంలో హైదరాబాద్ కు చేరడం కలవరం రేపింది. ఎబోలా వైరస్ సోకిందన్న అనుమానాలతో ముగ్గురు విదేశీ ప్రయాణికులను గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చేర్చారు. నిన్న సూడాన్ నుంచి వచ్చిన 30 ఏళ్ల యువకుడికి ఎబోలా లక్షణాలు కనిపించడంతో అతడిని గాంధీకి ఆసుపత్రికి తరలించారు. నిర్ధారణ కోసం నమూనాలను పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. సుడాన్ ప్రయాణికుడు ప్రయాణించిన విమానంలోనే ప్రయాణించిన మరో ఇద్దరు ప్రయాణికులు ఎబోలా ప్రాథమిక లక్షణాలతో.. నిన్న రాత్రి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు. అపోలో వైద్యులు వారిద్దరిని కూడా గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
అంతర్జాతీయ ఎబోలా నిబంధనల ప్రకారం.. ఇలాంటి ప్రమాదకర లక్షణాలు ఉన్నప్పుడు ప్రభుత్వ నోడల్ కేంద్రాలకే తరలించాలనే నిబంధన ఉండటంతో వారిని గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. వైరస్ ఉనికిని పక్కాగా, త్వరగా నిర్ధారించేందుకు వారి శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని ప్రముఖ సీసీఎంబీ ల్యాబొరేటరీకి పంపించారు. ఈ పరీక్షల తాలూకు నివేదికలు రావడానికి కనీసం 24 నుంచి 48 గంటల సమయం పట్టే అవకాశం ఉందని ల్యాబ్ వర్గాలు వెల్లడించాయి.
ఆఫ్రికా ఖండంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక ‘ఎబోలా’ వైరస్ విషయంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అయినప్పటికి విదేశీయుల రూపంలో ఎబోలా వ్యాధి హైదరాబాద్ కు విస్తరించిందా? అన్న సందేహాలు జనాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఆందోళన పడాల్సిందేమి లేదని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశం అంతటా అప్రమత్తత
సెంట్రల్ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ మహమ్మారి విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీయంగా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు దేశంలోని అన్ని ప్రధాన అంతర్జాతీయ రవాణా కేంద్రాల వద్ద కఠినమైన నిఘా, స్క్రీనింగ్ చర్యలను చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఎబోలా ప్రభావిత దేశాలైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ నుండి వచ్చే ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఇప్పటికే నిబంధనలను జారీ చేసింది. ఇటీవలే ఎబోలా వైరస్ పీడిత దేశాల నుంచి 28 మంది ప్రయాణికులు దేశంలోకి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. దాంతో ఒక్కసారిగా అప్రమత్తమైన ఆరోగ్య యంత్రాంగం విమానాశ్రయంలో ప్రయాణికులను పరీక్షించడమే కాకుండా… ఒకవేళ వారు ఎబోలా విస్తరిస్తున్న ప్రాంతాల నుంచి వచ్చినట్టు గుర్తిస్తే… వెంటనే వారిని 21 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచి పరిశీలిస్తారు.