జపాన్‌కు చెందిన ప్రముఖ మంగా కళాకారిణి(Manga Artist), ‘నవ బాబా వంగా’(New Vanga Baba)గా ప్రసిద్ధి చెందిన రియో టట్సూకీ(Ryo Tatsuki) చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు జపాన్ను, ఆ సమీప దేశాలను ముచ్చెమటలు పట్టిస్తోంది. హాంగ్‌కాంగ్(Hongkong) నుండి జపాన్‌కు ప్రయాణం కట్టిన వేలాదిమంది జూన్ అఖరివారం, జులై మొదటివారం మధ్యలో ఉన్న తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు(Cancelling tours to japan). ఈ వార్త వల్ల ఏకంగా 83 శాతం విమాన బుకింగ్‌లు పడిపోయాయని అక్కడి ట్రావెల్ ఏజెన్సీలు లబోదిబోమంటున్నారు.
రియో టట్సూకీ 1999లో గీసిన చిత్రకథ “ద ఫ్యూచర్ ఐ సా”(The Future I Saw) లో ఓ పెను ఉపద్రవం గురించి ఊహించింది. ఇంతకుముందు కొవిడ్–19 గురించి కూడా ఈమె భవిష్యవాణి వినిపించింది. అది జరిగింది కాబట్టి ఇది కూడా జరుగుతుందని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఇంతకీ ఆమె చెప్పిందేమిటంటే, జులై5, 2025న జపాన్ను ప్రళయం ముంచెత్తబోతోంది..అని. 2022లో పునర్ముద్రించబడిన “ద ఫ్యూచర్ ఐ సా : కంప్లీట్ ఎడిషన్” లో జులై 5, 2025న జపాన్‌కు భారీ ఉపద్రవం సంభవించనుంది అని ఒక లైన్ ఆ పుస్తకంలో రాసింది. భారీ భూకంపం(Heavy Earthquake) కారణంగా పెను సునామీ(Mega Tsunami) జపాన్‌పై విరుచుకుపడుతుందని ఆమె తన భవిష్యవాణిలో చెప్పింది. ఇంతకుముందు, కొవిడ్19 గురించి, 2011లో తొహొకు(Tohoku), జపాన్‌లో సంభవించిన భారీ భూకంపం, సునామీ గురించి కూడా టట్సూకీ అంచనా వేసింది. మరో 17 రోజులలో జరుగబోతున్నట్లుగా చెప్పబడుతున్న విపత్తు గురించి ఆమె వివరించినదాని ప్రకారం.. జపాన్, ఫిలిప్పీన్స్ మధ్యన, సముద్రం అడుగుభాగంలో ఓ భారీ చీలిక ఏర్పడి, పెను భూకంపానికి, సునామీకి దారీ తీస్తుందనీ, దాని అలలు 2011 సునామీ అలల(130 అడుగుల ఎత్తు) కంటే మూడు రెట్లు పెద్దవిగా వస్తాయని ఆమె అంచనా వేసింది.
ఈ విషయం సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారమయ్యేసరికి, పర్యాటకులు ఆ తేదీకి చుట్టుపక్కల వారాలలో ఉన్న ప్రయాణాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. హాంగ్‌కాంగ్ ఎయిర్‌లైన్స్(Hongkong Airlines) ఏకంగా దక్షిణ జపాన్ నగరాలైన కగోషిమా, కుమామొటోలకు విమానాలను ఈ కారణం వల్ల రద్దు చేసింది. ఏప్రిల్, మే నెలల్లో వసంత రుతువు సందర్భంగా జపాన్‌లోని పలు పర్యాటక ప్రదేశాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ కాలంలో చెర్రీ బ్లాసం(Cherry blossom) చెట్లు విరగబూసి, చాలా అందంగా కనబడతాయి. వాటిని చూడటానికి ఏప్రిల్ నుండి జులై మధ్యలో పర్యాటకులు జపాన్‌కు పోటెత్తుతారు. సాధారణంగా హాంకాంగ్‌లో అప్పుడే ఈస్టర్ సెలవులు ఉంటాయి కాబట్టి, ఆ దేశంనుండి పెద్దయెత్తున పర్యాటకులు వస్తుంటారు. ఇప్పుడు ఈ భవిష్యవాణి పుణ్యమాని జపాన్ పర్యాటకం ఈ ఏడు 50శాతానికి పైగా తగ్గిపోయిందని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి.
ఈ గందరగోళాన్ని నివారించేందుకు జపాన్ ప్రభుత్వం నడుంబిగించింది. గత ఏప్రిల్ 23న నిర్వహించిన విలేకరుల సమావేశంలో మియాగీ(Miyagi) గవర్నర్ యోషిహిరో మురాయ్ చిందులు వేస్తూ, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న శాస్త్రీయ ఆధారం లేని ఊహాజనిత వ్యాఖ్యలు అర్ధరహితం. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయంగా ఆయన అభివర్ణించారు. దీనివల్ల జపాన్ పర్యాటకం దెబ్బతింటుందని గ్రహించాల్సిందిగా మురాయ్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ విషయం జపాన్ ప్రజలకు కూడా తెలుసు కానీ, వారెక్కడికీ పారిపోవడంలేదు. కనుక మీరు నిశ్చింతగా జపాన్‌లో పర్యటించండంటూ పర్యాటకులకు హామీ ఇచ్చారు. జపాన్ జాతీయ పర్యాటక సంస్థ(Japan National Tourism Organisation) కూడా భూకంపం, సునామీ వస్తుందన్న అంచనాలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదని తెలిపింది.
జపాన్ వాతావరణ శాఖ(Japan Meteorological Agency) కూడా సాధారణంగా తేదీ, ప్రాంతం సహా చెప్పబడే అంచనాలు బూటకం(Hoax)గానే పరిగణిస్తామని తమ వెబ్సైట్లో పేర్కొంది. హాంకాంగ్ ఎయిర్‌లైన్స్, జపాన్‌కు తమ ప్రయాణాలకు రద్దు చేసుకుంటున్న పర్యాటకులకు వేరే ప్రదేశాలలో పర్యటించే వెసులుబాటు కల్పించింది. చేసుకున్న బుకింగ్‌లను వేరే దేశాలైన చైనా, తైపీ, బ్యాంకాక్, వియత్నాంలకు మళ్లించే అవకాశం ఏర్పాటుచేసింది. ఈ రకంగా తమ వ్యాపారం దెబ్బతినకుండా చూసుకుంటున్నామని ఎయిర్‌లైన్స్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.