Almabtrieb Festival : మీరు ఇది చూశారా..ఆవుల పండుగ అల్మాబ్ట్రీబ్ వేడుక

స్విట్జర్లాండ్‌లో ఆవులను అలంకరించి పూజించే వేడుకను అల్మాబ్ట్రీబ్ అంటారు. వేసవిలో ఆల్ప్స్ పర్వతాలకు వెళ్లిన ఆవుల మందలు, శీతాకాలం ప్రారంభంలో సురక్షితంగా ఇళ్లకు తిరిగి వచ్చే సందర్భంగా దీనిని నిర్వహిస్తారు. ఇది వేల ఏళ్ల నాటి సంస్కృతి. ఆవులకు పూలు, గంటలు కట్టి పరేడ్‌ నిర్వహిస్తారు.

Almabtrieb Festival

విధాత : మానవ నాగరికత పశుసంతతితో పురోగమిస్తూ వచ్చింది. శాస్త్ర సాంకేతికత ఎంత విస్తరించిన సహజమైన ఆవుపాలను అస్వాదించడం మానవాళి జీవన శైలి. ఇక రైతులకు పశు సంపదకు విడదీయరాని బంధం అనాదిగా వస్తునే ఉంది. పాడిపంటలతో తులతూగే పల్లె సీమలను భాగ్యసీమలుగా పేర్కొంటారు. రైతులు తమ వ్యవసాయంలో తన సహచరులుగా భావించే పశు సంపదను పలు పండుగ దినాలలో ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తుంటారు. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పర్విదినాల్లో వచ్చే కనుమ పశువుల పూజాదినంగా ఆచరిస్తారు. ఇలాగే స్విట్జర్లాండ్ దేశంలోనూ ఆవులను అలంకరించి పూజించే ఓ వేడుక పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

అల్మాబ్ట్రీబ్ వేడుక అంటే ఏమిటి?

అల్మాబ్ట్రీబ్ వేడుకగా పిలిచే ఆవుల పండుగ స్విట్జర్లాండ్‌ రైతుల సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పడుతూ ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తుండటం విశేషం. వేసవి నెలల్లో ఆవులను రైతులు ఆల్ప్స్ పర్వతాలకు తీసుకెళ్తారు. అక్కడ వాటిని కొన్ని నెలలు ఎత్తైన ప్రదేశాలలో పచ్చిక బయళ్లలో మేపుతారు. తర్వాత శరదృతువు వచ్చి ఉష్ణోగ్రతలు తగ్గి..శీతాకాలం ప్రారంభం కాగానే ఆవులను పర్వతాల ప్రాంతాల నుంచి తమ పొలాలకు తిరిగి తీసుకొస్తారు. ఈ ఆచారాన్ని ‘ట్రాన్స్‌హ్యూమన్స్’ అని అల్మాబ్ట్రీబ్ వేడుక అని పిలుస్తారు. ఇది వేల సంవత్సరాల నాటి ఆల్పైన్ సంచార రకం సాంప్రదాయం. ఈ సందర్బంగా ఆవులను అందమైన పువ్వులతో అలంకరించి, మెడలో గణగణ మోగే గంటలను కట్టి ఆల్పైన్ పచ్చిక బయళ్ల నుండి తమ పొలాలకు తీసుకెలుతారు. ఈ వేడుకనే అల్మాబ్ట్రీబ్ ఆవుల పండుగగా..శీతాకాలం ఆరంభంగా భావిస్తారు. వేసవి కాలంలో కొండలకు వెళ్లిన ఆవుల మందలు సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చే సందర్బంగా జరుపుకునే వేడుకగా ఇది కొనసాగుతుంది. అలాగే అల్మాబ్ట్రీబ్ విదేశీ పర్యాటకులను ఆకర్షించే మంచి టూరిజం ఈవెంట్ గా సాగుతుంది.అల్మాబ్ట్రీబ్ ఆచారం స్విట్జర్లాండ్ దాటి ఆస్ట్రియా, స్లోవేనియా వరకు విస్తరించడం విశేషం. ఈ వేడుకలను గడ్డి మైదాన ప్రాంతాల జీవవైవిధ్యాన్ని పెంచే స్థిరమైన పశువుల పెంపకాన్ని ప్రోత్సహించేదిగా భావిస్తారు.

పర్యాటకులను ఆకట్టుకునే వేడుక

ఈ ఏడాది అల్మాబ్ట్రీబ్ ఆవుల పండుగ వేడుకల వీక్షణకు స్విట్జార్లాండ్ లో 10,000 మందికి పైగా సందర్శకులు రానుండటం విశేషం. మెడలో గంటలు, తలపై పువ్వులు ఉన్న ఆవుల ప్రయాణం అల్మాబ్ట్రీబ్‌ వేడుకను చాటుతుంది. దీనిని ప్రాథమికంగా పర్వత ప్రాంతాల నుంచి ఊర్లకు వచ్చే ఆవుల కోసం ఒక భారీ స్వాగత గృహ విందుగా..ఆవుల పరేడ్ గా, డ్రైవ్ గా కూడా అభివర్ణిస్తుంటారు. ఆవుల పండుగలో ఆవుల కవాతులు నిర్వహించడం..స్థానిక గ్రామీణ ప్రజలు ప్రత్యేక ఆలంకరణలు, ఈకల టోపీల ధారణలతో నృత్యాలు, పాడటం, మద్యపానం, ప్రత్యేక వంటకాలతో సందడి చేస్తారు. వేడుకల సందర్భంగా స్థానిక పట్టణాలు, గ్రామాలలో ప్రధాన వీధుల వెంట క్రాఫ్ట్ మార్కెట్ లు ఏర్పాటు చేస్తారు. టైరోలియన్ ఫెల్ట్ టోపీలు, అల్లిన స్వెటర్లు, చేతితో పెయింట్ చేసిన గాజు ఆభరణాలు, సిరామిక్ ఆవు బొమ్మలు, స్నాప్‌ల బాటిళ్లు, స్థానికంగా చేతితో తయారు చేసిన అన్ని రకాల సావనీర్‌లు, వస్తువులు, స్థానిక వంటకాలు విక్రయిస్తుంటారు. ప్రతి ఏటా సెప్టెంబర్, ఆక్టోబర్, నవంబర్ మాసాల్లో స్విట్జర్లాండ్, ఆస్ట్రియాలలో జరిగే ఆవుల పండుగ వేడుకలను చూసేందుకు పర్యాటకులు వెళ్తుండటంతో ఈ వేడుకలు ఆ దేశాల టూరిజానికి ప్రత్యేక ఆకర్షణగా కొనసాగుండటం విశేషం.